వాటి ద్వారా కూడా.. ఇంట్లోకి వైరస్‌ వచ్చే అవకాశముంది!

ABN , First Publish Date - 2020-03-29T10:15:53+05:30 IST

‘కరోనా వైరస్‌ బారినపడకుండా..

వాటి ద్వారా కూడా.. ఇంట్లోకి వైరస్‌ వచ్చే అవకాశముంది!

ఆ రెండు కీలకం

సామాజిక దూరం,  వ్యక్తిగత పరిశుభ్రత పాటిించాలి

కరోనా వైరస్‌ నియంత్రణకు ఎంతో ముఖ్యం 

ప్రభుత్వాల సూచనలను పాటించాలి

కూరగాయలు, పండ్లు, పాల ప్యాకెట్ల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం

నీటితో శుభ్రం చేసిన తరువాత ఇంట్లోకి తీసుకువెళ్లడం మంచిది

మనం మరింత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం

బహిరంగ ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మాస్క్‌ ధరించడం మేలు

ఉష్ణోగ్రతలు పెరిగితే వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టవచ్చు

నాలుగో దశకు వెళితే ప్రమాదం

ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ ఎం.మధుసూదన్‌బాబు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): ‘కరోనా వైరస్‌ బారినపడకుండా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో అయితే లాక్‌డౌన్‌ను ప్రకటించాయో గుర్తించి ప్రతి ఒక్కరూ పాటించాలి...’ అని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, కింగ్‌జార్జ్‌ ఆసుపత్రి (కేజీహెచ్‌) రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.మధుసూదన్‌బాబు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజలకు జాగ్రత్తలను సూచించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...


4 నుంచి 14 రోజుల్లో...

కరోనా వైరస్‌ బారినపడిన వ్యక్తిలో నాలుగు నుంచి 14 రోజుల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌, ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్‌ రోగులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ వైరస్‌ బారినపడుతున్నారు. వీరితోపాటు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుండే చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్‌ బారినపడేందుకు ఎక్కువ అవకాశముంది. 


సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత

వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరంతోనే వైరస్‌ బారినపడకుండా వుండేందుకు అవకాశముంది. ఈ వైరస్‌ బారినపడిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్‌ ఆరు అడుగుల దూరం వరకు పడుతుంది. ఆ సమయంలో సమీపంలో వున్న వ్యక్తిపై ఈ తుంపర్లు పడితే అందులో వుండే వైరస్‌ నోరు, ముక్కు ద్వారా లోపలకు ప్రవేశిస్తుంది. అదేవిధంగా అతను తాకిన వస్తువులను ఇతరులెవరైనా పట్టుకుని, ఆ చేతులను నోట్లో లేదా ముక్కులో పెట్టుకుంటే వైరస్‌ వ్యాపిస్తుంది. ఆయా వస్తువులను బట్టి రెండు నుంచి 24 గంటల వరకు వైరస్‌ బతుకుతుంది.


ఇవీ లక్షణాలు.. 

నీరసం, పొడి దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, కఫం పడడం వంటి లక్షణాలు వైరస్‌ బారినపడిన వారిలో కనిపిస్తాయి.


ఆ దశకు వెళితే ప్రమాదకరం

ఈ వైరస్‌ వ్యాప్తిలో నాలుగు దశలు ఉన్నాయి. మొదటి దశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్‌ ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఐసోలేట్‌ చేయడం ద్వారా వ్యాధిని నియంత్రించేందుకు అవకాశముంది. రెండో దశలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో దగ్గరగా వున్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు సోకే అవకాశముంది. ఈ స్టేజీలో ఇద్దరినీ క్వారంటైన్‌ చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశముంది. ఈ దశలోనే వైరస్‌ను నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, సోషల్‌ డిస్టెన్స్‌కు పిలుపునిచ్చాయి.


ఇకపోతే మూడో దశ... ఇది కొంత ఇబ్బందికరమైన దశగానే చెప్పాలి. దీనినే స్టేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ అని అంటారు. ఎవరి వల్ల, ఎప్పుడు, ఎక్కడ వైరస్‌ సోకిందనేది గుర్తించడం కష్టమవుతుంది. బాధితులను గుర్తించి ఐసోలేట్‌ చేయడం సాధ్యం కాదు. దీనివల్ల వైరస్‌ శరవేగంగా మరింత మందికి వ్యాప్తి చెందేందుకు అవకాశముంది. ఇకపోతే నాలుగో దశ.. ఈ దశకు వెళితే ప్రమాదకరమనే చెప్పాలి. వందలు, వేలాది కేసులు వస్తాయి. ఎపిడమిక్‌గా పరిస్థితి మారిపోతుంది. కంట్రోల్‌ చేయలేక, వైద్యం అందించలేని స్థితికి చేరుకుటుంది. 


నీటితో శుభ్రం చేయాలి

పండ్లు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల ద్వారా కూడా వైరస్‌ ఇంట్లోకి వచ్చే అవకాశముంది. కాబట్టి, వీలైనంత వరకు ఇంటిబయటే.. వేగంగా నీరు వచ్చే ట్యాప్‌ కింద వాటిని (సరకులైతే ప్యాకెట్లను) శుభ్రం చేసి కొంతసేపు ఎండలో ఆరబెట్టిన తరువాత ఇంట్లోకి తీసుకువెళ్లడం మంచిది. దీనివల్ల ఆ వస్తువులపై ఒకవేళ వైరస్‌ వున్నా శుభ్రం చేసినప్పుడు పోయేందుకు అవకాశముంది. 28 డిగ్రీలు దాటితే ఏ వైరస్‌ అయినా బతికేందుకు అవకాశం లేదు. అయితే ఈ వైరస్‌ స్వభావం, వ్యవహరించే తీరు ఎలా వుంటుందో తెలియదు. అయితే ఈ వైరస్‌ ఎండ తీవ్రత పెరిగే కొద్దీ చనిపోతుందని భావిస్తున్నాం.


అయితే వైరస్‌ ఎండలో కాకుండా మనుషులు ద్వారా చల్లని ప్రదేశాలలోకి వచ్చేస్తేనే ప్రమాదం. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. అయితే, మన దేశంలో ఎవరు, ఎప్పుడు ఎలా దగ్గుతారో, ఎక్కడ ఉమ్మేస్తారో తెలియని పరిస్థితి కాబట్టి ఎక్కువ మంది వుండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం మేలు. 

Updated Date - 2020-03-29T10:15:53+05:30 IST