నిరసనలకు పరిమితమైన డాక్టర్స్‌ డే

ABN , First Publish Date - 2022-07-02T04:55:36+05:30 IST

సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పనిచేసే సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు రెండో రోజూ ఆందోళన కొనసాగించారు

నిరసనలకు పరిమితమైన డాక్టర్స్‌ డే
సంగారెడ్డిలోని జీజీహెచ్‌ అత్యవసర విభాగం వద్ద నిరసన తెలుపుతున్న సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు

సంగారెడ్డి జీజీహెచ్‌లో రెండోరోజూ విధుల బహిష్కరణ 

వేతనాల కోసం సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల ఆందోళన 

సంగారెడ్డి అర్బన్‌, జూలై 1: సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పనిచేసే సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు రెండో రోజూ ఆందోళన కొనసాగించారు. శుక్రవారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అత్యవసర, ఓపీ, ఎలక్టివ్‌ విధులను బహిష్కరించారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ అత్యవసర విభాగం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు అర్వింద్‌సాయి, రాజశేఖర్‌ మాట్లాడుతూ డాక్టర్స్‌ డే నాడు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. జీతాలు రాకపోవడంతో సంతోషంగా డాక్టర్స్‌ డే జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కొవిడ్‌ సమయంలో మూడు నెలలు డ్యూటీలు చేయించుకున్నారని, ఆ మూడు నెలల కాల వ్యవధిని ఎస్‌ఆర్‌లో పరిగణిస్తారా? లేదా అన్న విషయంపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ మూడు నెలల జీతాలు కూడా ఇప్పటికీ చెల్లించలేదని ప్రశ్నిస్తే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ నుంచి ఇవ్వాలా ? లేక ఇంకా వేరే బడ్జెట్‌ నుంచి చెల్లించాలా? అన్న విషయంపై తర్జనభర్జన పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ షిప్‌ కాల పరిమితి అక్టోబరా? లేక జూలైలో అయిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని, దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు, కొవిడ్‌ సమయంలో చేసిన మూడు నెలల వేతనాలు విడుదల చేసే వరకు విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌లు ప్రవీణ, భావన, ఐశ్వర్య, గాయత్రీ, ఆశ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:55:36+05:30 IST