రెండు పడకల ఇళ్లు వీరికే

ABN , First Publish Date - 2022-08-12T06:54:42+05:30 IST

రెండు పడకల ఇళ్ల కేటాయింపునకు కసరత్తు మొదలైంది. గ్రేటర్‌తోపాటు జిల్లాల్లోనూ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

రెండు పడకల ఇళ్లు వీరికే

గ్రేటర్‌ అడ్ర్‌సతో ఆధార్‌.. 2018 ఓటరు జాబితాలో పేరు

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్ల కేటాయింపులో అవే కీలకం

క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తోన్న సిబ్బంది

జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలతో కమిటీ

కమిటీకి కన్వీనర్‌గా కలెక్టర్‌

గ్రామ/వార్డు సభల్లో అర్హుల జాబితా

లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రెండు పడకల ఇళ్ల కేటాయింపునకు కసరత్తు మొదలైంది. గ్రేటర్‌తోపాటు జిల్లాల్లోనూ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపునకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ వేర్వేరుగా జారీ చేసిన మూడు జీవోలు కీలకమని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగం వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 15, 2015లో జీవో నెం. 10, అదే ఏడాది నవంబర్‌ 26న జీవో 12, నవంబర్‌ 6, 2020లో జారీ చేసిన జీవో 3లోని అంశాలు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. జీవో 10, 12లో పేర్కొన్న అంశాలతోపాటు జీవో 3లో అదనపు మార్గదర్శకాలు పొందుపర్చారు. ఆ మూడు జీవోల్లో పేర్కొన్న మార్గదర్శకాల ఆధారంగా అర్హత ఉన్న వారి జాబితా సిద్ధం చేస్తామని, లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఓ ఉన్నతాధికారొకరు తెలిపారు. 


నియోజకవర్గానికి 1000 మంది

రాష్ట్ర వ్యాప్తంగా 2.91 లక్షల రెండు పడకల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో లక్ష ఇళ్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని పౌరుల కోసం నిర్మిస్తున్నారు. గ్రేటర్‌లో 60 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇన్‌సిటు లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లు మూడు వేలకుపైగా ఉన్నాయి.ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు తుది నిర్ణయానికి వచ్చారు. ఆ మూడు జీవోల్లోని మార్గదర్శకాల ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపికచేయాలని నిర్ణయించారు.2018 ఎన్నికల ముందు జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు పడకల ఇళ్ల కోసం ఆరు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వేరు చేసిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది..క్షేత్రస్థాయిలో పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఓటర్‌ గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, ఇతరత్రా వివరాలు సేకరిస్తున్నారు. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ పరిధిలో  1000- 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 


ప్రధాన మార్గదర్శకాలు

2018 అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాలో దరఖాస్తుదారుడి పేరు ఉండాలి. 

జీహెచ్‌ఎంసీ పరిధిలోని చిరునామాతో ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి. 

తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి. 

దరఖాస్తుదారుడి చిరునామా (అడ్రస్‌ ప్రూఫ్‌) జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండాలి. 

రూరల్‌ హౌసింగ్‌, అర్బన్‌ హౌసింగ్‌, ఇందిరమ్మ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, ఐహెచ్‌ఎ్‌సడీపీ, వాంబే, రాజీవ్‌ గృహకల్ప, గతంలో ప్రభుత్వం అమలు చేసిన పక్కా ఇళ్ల పథకాల్లో లబ్ధిదారులై ఉండకూడదు. 

జీవో 58, 59 లబ్ధిదారులకు రెండు పడకల ఇళ్లు ఇవ్వరు. ఈ వివరాలను తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌(టీఎ్‌సటీఎస్‌) నుంచి తీసుకొని దరఖాస్తుదారుల్లో వారి పేర్లుంటే పక్కన పెడ్తారు. గతంలో పక్కా గృహాలు పొందిన వారి వివరాలూ సమగ్రంగా పరిశీలిస్తారు. 

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై)- హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ పథకం విధివిధానాలూ లబ్ధిదారుల ఎంపికలో పరిశీలిస్తారు. పీఎంఏవై కింద గృహ రుణాల్లో సబ్సిడీ పొందిన వారూ రెండు పడకల ఇళ్లు పొందేందుకు అనర్హులు. 

గ్రేటర్‌ ఆవలి ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లలో 10 శాతం లేదా 1000.. రెండింటిలో ఏది తక్కువైతే అన్ని ఇళ్లను ఆ నియోజకవర్గంలోని (జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రాని) అర్హులకు కేటాయిస్తారు.

లబ్ధిదారుడి కుటుంబం దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. 

కుటుంబంలోని మహిళ పేరిట ఇల్లు మంజూరు చేస్తారు. 

ఇళ్లు లేని, గుడిసెలు, కచ్చా ఇళ్లు, అద్దె ఇళ్లలో నివసించే వారు రెండు పడకల ఇళ్లు పొందేందుకు అర్హులు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మైనార్టీలకు ఏడు శాతం, మిగతా ఇళ్లు ఇతరులకు కేటాయిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇళ్ల కేటాయింపులో పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ-17, ఎస్టీ 6, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ఆయావర్గాలకు సంబంధించి స్థానిక జనాభాను బట్టి కేటాయింపు రిజర్వేషన్ల శాతంలో పెరుగుదల ఉండొచ్చు. 

గ్రేటర్‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ యూనిట్‌గా ఏ కేటగిరీకి ఎన్ని ఇళ్లు అన్నది నిర్ణయిస్తారు. 


జిల్లా స్థాయిలో కమిటీ

ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా నియమించే కమిటీ లబ్ధిదారుల ఎంపికలో కీలకం. ఈ కమిటీకి కలెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 

గ్రామ పంచాయతీలు/పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. జిల్లా యూనిట్‌గా ఆయా వర్గాలకు ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్‌ అమలు చేస్తారు. 

జిల్లా కలెక్టర్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. గ్రామ/వార్డు సభ నిర్వహించి దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన పూర్తి చేయాలి. నిబంధనలు అనుసరించి అర్హత ఉన్న వారి జాబితా సిద్ధం చేయాలి. 

ప్రాథమిక పరిశీలన అనంతరం రూపొందించిన అర్హుల జాబితా తహసీల్దార్‌కు పంపుతారు. తహసీల్దార్‌ సమగ్ర పరిశీలన జరిపి జాబితాను కలెక్టర్‌కు నివేదిస్తారు. 

అనంతరం కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ మరోసారి గ్రామ/వార్డు సభ నిర్వహించి.. అర్హత ఉన్న వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలి.  

ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లాస్థాయి కమిటీ ఆమోదం కోసం పంపుతారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు. 

ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి ఫిర్యాదులు వస్తే.. జిల్లా స్థాయి అధికారి (నోడల్‌ ఆఫీసర్‌) సమగ్ర విచారణ జరిపి నివేదికను జిల్లా కమిటీ ముందుంచాల్సి ఉంటుంది. తరువాత కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌. 

Updated Date - 2022-08-12T06:54:42+05:30 IST