కడతారా.. రద్దు చేయాలా?

ABN , First Publish Date - 2022-04-06T05:30:00+05:30 IST

‘ఇల్లు కట్టుకుంటారా? లేదా? లేకుంటే పట్టా రద్దు చేస్తాం’ ఇదీ లబ్ధిదారులకు వలంటీర్ల బెదిరింపు.

కడతారా.. రద్దు చేయాలా?
ఉడుములపాడు లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి

  1. ఇల్లు కట్టుకోని లబ్ధిదారులకు వలంటీర్ల హెచ్చరిక 
  2. ఇంటి కోసం అప్పు చేయాలా అని ప్రశ్నిస్తున్న వైనం
  3. నీటి సౌకర్యం కూడా లేని జగనన్న కాలనీలు 


డోన, ఏప్రిల్‌ 6:  ‘ఇల్లు కట్టుకుంటారా? లేదా? లేకుంటే పట్టా రద్దు చేస్తాం’ ఇదీ లబ్ధిదారులకు వలంటీర్ల బెదిరింపు. ‘జగనన్న కాలనీల్లో నీటి వసతి కూడా లేదు. అలాంటి చోట అప్పు చేసి ఇల్లు ఎలా కట్టుకోవాలి?’ లబ్ధిదారుల ఆవేదన ఇది. ప్రభుత్వ ఒత్తిడితో వలంటీర్లు మాత్రం ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో డోన అర్బన జగనన్న కాలనీల్లో లబ్ధ్దిదారులకు దిక్కు తోచడం లేదు. పట్టణ సమీపంలోని దొరపల్లి కొండ వద్ద ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో 1,500 మందికి పట్టాలు మంజూరయ్యాయి. ఉడుములపాడు లే అవుట్‌లో 1,200 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులకు టార్గెట్‌ విధించింది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకొనేలా చూసే బాధ్యతను అధికారులు సచివాలయ సిబ్బందికి, వలంటీర్లకు అప్పగించారు. 

ఇల్లు కట్టుకోకపోతే పట్టా రద్ద్దు

జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుండామంటే వసతులు లేవు. కనీసంగా నీటి వసతి కూడా లేదు. ఇలాంటి చోట అప్పు చేసి ఇళ్లు కట్టుకోడానికి సిద్ధం కావడం లేదు. అయితే ఇళ్లు కట్టుకుంటారా? పట్టా రద్దు చేయమంటారా? అని వలంటీర్ల ఒత్తిడి చేస్తున్నారు. ఇళ్లు నిర్మాణం ప్రారంభించకపోతే పట్టాలను వెయిటింగ్‌ లిస్టులో ఉన్న వారికి ఇస్తామంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పు చేసి ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

బోర్లు పని చేయడం లేదు

డోన అర్బనలోని దొరపల్లి కొండ లే అవుట్‌లో వేసిన బోర్లు పని చేయడం లేదు. దీంతో సంపులకు నీరు వదలడం లేదు. కొంత మంది లబ్ధిదారులు ట్యాంకర్‌ నీటిని రూ. 1000 చొప్పున కొని ఇళ్ల నిర్మాణానికి వాడుకుంటున్నామని అంటున్నారు. 


అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నా

ఉడుములపాడు లే అవుట్‌లో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోకపోతే పట్టా రద్దు చేస్తామంటున్నారు. అప్పులు చేసి బేస్‌ మట్టం వేసుకుంటున్నాం. 

 -  లక్ష్మీదేవి


నీరు కొంటున్నా

 నేను కార్పెంటర్‌గా పని చేస్తున్నా. దొరపల్లి కొండ లే అవుట్‌లో ఇంటి స్థలం వచ్చింది. అధికారుల ఒత్తిడితో ట్యాంకు నీరు రూ.1000 పెట్టి కొంటున్నా. రెండు రోజులకే ట్యాంకరు నీరు అయిపోతోంది. 

-  మల్లికార్జున

ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నాం

జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించుకోవాలని వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్లు కట్టుకోకపోతే పట్టా రద్దు చేస్తామని చెప్పడం లేదు. నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దొరపల్లి కొండ లే అవుట్‌లో కొత్తగా వేసిన రెండు బోర్లు ఫెయిల్‌ అయ్యాయి. కొత్తగా మరో రెండు వేయిస్తాం. 

-  నాగభూషణం, హౌసింగ్‌ డీఈ, డోన


Updated Date - 2022-04-06T05:30:00+05:30 IST