క్రిమినల్‌ సైకాలజీ చదవాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

ABN , First Publish Date - 2021-11-15T15:38:16+05:30 IST

క్రిమినల్‌ సైకాలజీ చదవాలనేది..

క్రిమినల్‌ సైకాలజీ చదవాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

క్రిమినల్‌ సైకాలజీ 

ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. భవిష్యత్తులో సైకాలజీ తీసుకోవాలనుకుంటున్నాను. అందులో కూడా క్రిమినల్‌ సైకాలజీ చదవాలనేది నా కోరిక. మన దేశంలో దీనికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుపగలరు? 

- నేహా,  ఏలూరు

భవిష్యత్తు, కెరీర్‌పై ఒక స్పష్టమైన క్లారిటీ ఉండడం అనేది మంచి ఆలోచన. సైకాలజీకి మంచి భవిష్యత్తు ఉంది. అంతేకాదు ఇది సంతృప్తికరమైన ప్రొఫెషన్‌ కూడా. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించిన తరవాత లభించే మానసిక సంతృప్తి లభించే కొద్ది రంగాల్లో సైకాలజీ కూడా ఒకటి. ప్రొఫెషన్‌లో రాణించాలంటే నీవు అనుకుంటున్న కోర్సును అందించే మంచి కాలేజీని ఎంచుకో.


గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈ సబ్జెక్టును చదివిన తరవాత సైకాలజీపై ఒక అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు నీకు కావాల్సిన స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. మన దేశంలో క్రిమినల్‌ సైకాలజీ కేవలం ప్రభుత్వ పరిశోధన ఏజెన్సీలకే పరిమితమై ఉంది. అయితే సైకాలజీలోనే ఎడ్యుకేషనల్‌, ఫోరెన్సిక్‌, స్పోర్ట్స్‌, కన్జుమర్‌, ఎన్విరాన్‌మెంటల్‌, కౌన్సెలింగ్‌, క్లినికల్‌... ఇలా పలు రకాల స్పెషలైజేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అందుకే గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఒక రంగాన్ని ఎంచుకోవడం బెటర్‌. గ్రాడ్యుయేషన్‌ సమయంలోనే ఏదో ఒక రంగంలో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తే తరువాత స్పెషలైజేషన్‌ ఎంచుకోవడం సులువు అవుతుంది. 



అమెరికాలో ఫుల్‌టైమ్‌ డిగ్రీ!

నేను ఎమ్‌కాం, ఎంబిఏ(ఫైనాన్స్‌) పూర్తిచేశాను. బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో ఒకటిన్నర సంవత్సరం పనిచేశాను. విదేశాల్లో చదవాలనుకుంటున్నాను. అదికూడా అమెరికాలోనే. ఏదైనా మంచి యూనివర్సిటీలో చేయగలిగే ఫుల్‌టైమ్‌ డిగ్రీ గురించి చెబుతారా? 

- పృథ్వి, హైదరాబాద్‌


మంచి ఫీజులు చెల్లించి చదువుకోవాలనుకునే అండర్‌ గ్రాడ్యుయేట్‌ విదేశీ విద్యార్థుల కోసం అక్కడి యూనివర్సిటీలు ఎదురుచూస్తుంటాయి. గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తుంటాయి. ఎందుకంటే వీరు కోర్సు కాగానే అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడే ఆలోచనలో ఉంటారని వారి భావం. మీ విషయం అయితే మరింత కష్టం. మీరు ఇప్పటికే పీజీతోపాటు ఎంబిఏ పూర్తిచేశారు. మీరు పీజీ చేసి ఉంటే ఎంబిఏ అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎంబిఏ చేశారు. కాబట్టి మరో ఎంబిఏ చేయడం అనవసరం. మీకు ఉన్న అవకాశం పీహెచ్‌డినే. దానికి కూడా రీసెర్చ్‌ ప్రపోజల్‌ తయారు చేయాలి. వివిధ యూనివర్సిటీలు తిరిగి మీ పరిశోధన ఉపయోగపడుతుందని వారికి నచ్చచెప్పగలగాలి. మీకు బ్యాంకింగ్‌ రంగంలో అనుభవం ఉందంటున్నారు కాబట్టి ఆ రంగానికి సంబంధించిన కోర్సుల్లో చేరడానికి ప్రయత్నించండి. 

- గోవర్ధనం కిరణ్‌కుమార్‌

మీక్కూడా ఏదైనా సందేహం ఉంటే సంప్రదించండి:

చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, 

ఆంధ్రజ్యోతి, ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్‌, 

హుడా హైట్స్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033


Updated Date - 2021-11-15T15:38:16+05:30 IST