Abn logo
Jun 3 2020 @ 03:44AM

నవజీవన సత్యాన్ని గుర్తించారా?

ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతికత అందరికీ చేరడంలో ఉన్న అసమానతలను, ఆర్థిక తారతమ్యాలను, జీవనవిధానంలో ఉన్న సమస్యలను కరోనా విస్తృతి ఎత్తిచూపింది. ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ కనబరచడంతోపాటు ఆ రంగంలో పెట్టుబడులు పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని మరోసారి మనకు గుర్తుచేసింది. సామాజిక, రాజకీయ ఆర్థిక పరమైన అంశాలను పునర్నిర్వచించుకోవాల్సిన తక్షణావసరాన్ని తెలియచెప్పింది. ప్రకృతి, తోటి మనిషి, సకలజీవులతో సామరస్యపూర్వకంగా జీవించాల్సిన సత్యాన్ని ప్రపంచానికి ఉపదేశించింది.


స్పర్శ నిషిద్ధం. శ్వాస ప్రాణాంతకం. కరోనా వైరస్‌తో మానవాళికి దాపురించిన దుస్థితి ఇది. మన జీవన గమనంలో కరోనాకు ముందు, కరోనా తర్వాత అని స్పష్టమైన తేడా స్పష్టమవుతోన్న సందర్భమిది. కనుక సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరమైన అంశాలను పునర్నిర్వచించుకుని ముందుకెళ్ళడమనేది ప్రస్తుత పరిస్థితులలో అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మానవాళిని ప్రమాదపుటంచులకు చేర్చిన కరోనా వైరస్ కారణంగా.. అంతకుముందున్న స్వేచ్ఛాయుత వాతావరణం ఇపుడు మచ్చుకైనా కనిపించడంలేదు. ప్రతి అడుగూ అత్యంత జాగ్రత్తగా, స్వీయ నియంత్రణతోనే వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దుర్భర పరిస్థితుల్లో కరోనా తదనంతర జీవితమేమిటనే విషయమై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ మహమ్మారిని నియంత్రించే టీకా వచ్చేంతవరకు, ఆ విషక్రిమితో కలిసి జీవించక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. జీవితాన్ని పునర్నిర్వచించుకుని ప్రాచీన సంప్రదాయ జీవన విధానాన్ని అలవర్చుకునే దిశగా మన ఆలోచనలను మార్చుకోవాల్సివున్నది. ఇది పెద్ద కష్టమైన పనేం కాదు.


కరోనా అనంతర జీవనంపై ‘ప్యూ పరిశోధనా కేంద్రం’ చేసిన ఓ సర్వేలో వెల్లడయిన విశేషాలు: 91% మంది అమెరికన్లు కరోనా తమ జీవితాలను పూర్తిగా మార్చేసిందని భావిస్తున్నారు. 88% మంది ఈ వైరస్ అంతమైపోవాలని ప్రార్థనలు చేశారు. 77% మంది ఇకపై రెస్టారెంట్లలో భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అమెరికా ఎన్నికల్లో వరుసలో నిలబడి ఓటు వేయడం సరికాదేమోనని 66% మంది అభిప్రాయపడ్డారు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా మానవాళిపై చూపించిన పెను ప్రభావమిది. భారతదేశ వ్యాప్తంగా 500 కరోనా కేసులు నమోదైన సమయంలో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుతో (మార్చి 25 నుంచి) దేశంలోని 130కోట్ల మంది ప్రజలు ఈ మహమ్మారిని తరిమేసేందుకు స్వీయనిర్బంధాన్ని విధించుకున్నారు. వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కరోనాతో పోరాటాన్ని సుదీర్ఘకాలం కొనసాగించక తప్పదని స్పష్టం చేశారు. అంతా అనుకుంటున్నట్లుగా జరిగినా, నడుస్తున్న పరిశోధనలు వెంటనే సత్ఫలితాలిచ్చినా టీకా వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందనేది మనమంతా అంగీకరించాల్సిన విషయం. ఈ పరిస్థితుల్లో ప్రజలు వాస్తవ పరిస్థితులను అంగీకరిస్తూ రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన అంశాలను పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం స్పష్టంగా గోచరిస్తోంది.


కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో ఒకరి అనారోగ్య పరిస్థితి మరొకరిపై ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలో మన ప్రవర్తన, మన ఆలోచన అత్యంత కీలకం కానున్నాయి. సురక్షిత దూరాన్ని (సోషల్ డిస్టెన్సింగ్) పాటిస్తూనే.. అనుసంధానత, పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. ఇది కరోనా తదనంతర పరిస్థితుల్లో మరీముఖ్యంగా మన కార్యక్షేత్రంలో (పనిచేసేచోట) పాటించాల్సిన అత్యంత కీలకమైన సూచన. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం మన ఇళ్లే తరగతి గదులవుతాయి. సెమినార్లన్నీ వెబినార్లుగా మారిపోతాయి. ఇకపై ఏ సమావేశాల్లోనూ ఒకరినొకరు భౌతికంగా కలిసేందుకు వీలుపడదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగ పరుచుకుని ఆన్‌లైన్ సమావేశాలు, సదస్సులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆరోగ్యకరమైన డిజిటల్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ఇన్నాళ్లుగా మనం జీవితం కొనసాగినదానికి భిన్నంగా.. కొత్త అలవాట్లను నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిందే. ‘ద ప్లేగ్’ నవలలో ఓ కల్పిత అల్జీరియా పట్టణం గురించి రాస్తూ రచయిత అల్బర్ట్ కామూ ఇలా వ్యాఖ్యానించాడు: ‘ప్రతి ఒక్కరూ ప్రస్తుత పరిస్థితులతో విసుగు చెందారు. అందుకే కొత్త అలవాట్లను అలవర్చుకోవాలని అనుకుంటున్నారు’. నేటి పరిస్థితులకు ఇది సరిగ్గా అన్వయమవుతుంది. కరోనా తదనంతరం అందరం ఆరోగ్యంగా బతికేందుకు కొత్త నిబంధనలు అవసరమయ్యాయి. సురక్షిత దూరాన్ని పాటించడం, మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్తలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరముంది. 


దేశ ఆర్థికస్థితిని పునరుజ్జీవింపజేస్తూనే ప్రజల జీవితాలకు భద్రత కల్పించడం ఓ ముఖ్యమైన సవాల్. ఈ నేపథ్యంలో జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో ఎక్కువమంది పనిచేసే చోట భద్రతాప్రమాణాలు పాటిస్తూనే పరిశ్రమలు, ఇతర ఆర్థికపరమైన కార్యక్రమాలను తిరిగి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కఠినమైన నిబంధనలను రూపొందించి వాటిని తప్పనిసరిగా అమలుచేసేలా చూడాలి. లాక్‌డౌన్ సమయలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు తక్కువ సమయంలోనే ఉత్పత్తిని ఒకేసారి పెంచేయాలని అనుకోవడం కంటే ఓ క్రమపద్ధతిలో ముందుకెళ్లడం అత్యంత ఆవశ్యకమని గమనించాలి. మరోవైపు ఈ అనిశ్చితి కారణంగా భారీసంఖ్యలో వలస కార్మికులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. అక్కడ కూడా ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితి. ఇది సమీప భవిష్యత్తులో వారికి మరిన్ని ఇబ్బందులను తీసుకొస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారిని తిరిగి పనుల్లోకి తీసుకురాడంతోపాటు వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది.


కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సంపూర్ణ సహకార సమాఖ్య విధానం స్పష్టంగా కనిపించింది. ఒకటవ లాక్‌డౌన్ నుంచి నాల్గవ లాక్‌డౌన్ వరకు పరిస్థితులకు అనుగుణంగా పరస్పర సమాచార మార్పిడితో కరోనావ్యాప్తిని వీలైనంతమేర అడ్డుకునేందుకు సహకరించుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత సాన్నిహిత్యంగా పనిచేశాయి. ప్రజలకు సరైన భద్రత కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఈ పరస్పర సహకారం కొనసాగింపు అత్యంత కీలకం. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రపంచదేశాల మధ్య సహకారం అంత గొప్పగా కనిపించలేదని ప్రముఖ చరిత్రకారుడు యువల్ నో అ హరారీ విమర్శించారు. ప్రతిదేశం తనకు తానుగా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దీనికంటే సంయుక్తంగా అందరూ కలిసి కృషిచేస్తే స్పష్టమైన ఫలితాలు సాధించేందుకు వీలవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ విస్మరించారన్నారు.


దాని కారణంగానే వైరస్‌ ఉన్మాదరూపాన్ని ప్రదర్శిస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ పరిస్థితులనుంచి బయటపడేందుకు అన్నిదేశాలు ‘సంయుక్త వ్యూహా’న్ని అనుసరిస్తూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని మనమంతా గమనించాలి. ప్రస్తుతం వినియోగిస్తున్న సాంకేతికత అందరికీ చేరడంలో ఉన్న అసమానతలను, ఆర్థిక తారతమ్యాలను, జీవనవిధానంలో ఉన్న సమస్యలను కరోనా విస్తృతి ఎత్తిచూపింది. దీనికితోడు ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ కనబరచడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులు పెంచడం, మౌలికవసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని మరోసారి మనకు గుర్తుచేసింది. ఈ విలయం నుంచి మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరముంది. మొత్తంగా చూస్తే కరోనా వైరస్ యావత్ ప్రపంచానికే ఓ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. సామాజిక, రాజకీయ ఆర్థిక పరమైన అంశాలను పునర్నిర్వచించుకోవాల్సిన తక్షణావసరాన్ని గుర్తుచేసింది. ప్రకృతి, తోటి మనిషి, సకలజీవులతో సామరస్యపూర్వకంగా జీవించాల్సిన సత్యాన్ని ప్రపంచానికి ఉపదేశించింది.


ముప్పవరపు వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి

Advertisement
Advertisement
Advertisement