Abn logo
Sep 23 2021 @ 00:26AM

రెండు ‘తెలుగు’లు అవసరమా?

ఒకభాష–రెండు రాష్ట్రాలు, రెండు భాషా దినోత్సవాలు. సంతోషం. దాని మూలంగా భాషాభివృద్ధికి ఏదైనా జరిగితే మంచిదే కదా. కానీ, ఇది అలాంటిది కాదు. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబరు 9. ఆ సందర్భంగా కొంతమంది సహచరులను సరదాగానే అడిగాను. అవునూ, తెలంగాణ భాష అంటూ ఉందా? అని. దానికి వాళ్ళ సమాధానం ఇంగ్లీషులో ఇండియన్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటన్ ఇంగ్లీష్... ఇన్ని భేదాలుండగా, తెలుగులో ఉంటే తప్పేంటి? అని. నిజమే తెలుగులో ప్రాంతీయ భాషాభేదాలు ఉన్నాయి. తెలుగు ప్రాంతంలో కూడా రాయలసీమ తెలుగు, తెలంగాణ తెలుగు, కోస్తాంధ్ర తెలుగు అని వాడుకలో ఉంది. ఇంకా సూక్ష్మ పరిశీలనకు చిత్తూరు తెలుగు, శ్రీకాకుళం తెలుగు, ఆదిలాబాద్ తెలుగు అని వ్యవహరించుకోవచ్చు. ఇవన్నీ ప్రాంతీయ భాషా వైవిధ్యాన్ని తెలపడం కోసమేగానీ, భాషలు వేరు వేరు అని కాదు. తెలంగాణ తెలుగు భాషాదినోత్సవం అనొచ్చు కదా అంటే, తమది తెలంగాణ తెలుగు కాదు, తెలంగాణ భాషే అన్నారు.


తెలంగాణ భాష అంటూ చాలామంది అంటున్నారు. కానీ అది ఎలా ఉంటుందో; దాని లక్షణాలు, స్వరూపం, స్వభావం ఏంటో; తెలుగుభాష, తెలంగాణ భాషలు ఒకదానికొకటి ఎంత దూరమో; పరస్పర అర్థావగాహన కుదురుతుందో లేదో... ఏ ఒక్కరూ ఇప్పటివరకు ఈ అంశాలపై ఒక్క వ్యాసం రాయలేదు. తెలుగు ప్రాంతంలో ప్రాంతీయ అస్తిత్వాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మాండలికాలకు ప్రాధాన్యం పెరిగింది. ప్రాధాన్యం పెరగడంతోపాటు, వ్యక్తుల ఇష్టాలు మాండలికాల నిర్ణయంపై ప్రభావం చూపాయి. తెలుగు ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు పెరగడానికి మాండలికాలు ఒక కారణం కావడం దురదృష్టకర పరిణామం. మాండలికాల చుట్టూ తెలుగు ప్రాంతాల్లో అవగాహన కంటే, అపోహలే ఎక్కువగా పేరుకుపోయాయి. ‘తెలుగు’ల మధ్య అంతరాలు, విద్వేషాలు అలుముకుంటున్న దశలో అంతకుమించి, మాతృభాషగా తెలుగుకే ప్రమాదం పొంచి ఉన్న దశలో దీన్ని తొలగించాల్సిన బాధ్యత తెలుగు భాషాశాస్త్రవేత్తలపై ఉంది. 


ఇప్పుడు తెలుగు మాండలికాల గురించి మాట్లాడే క్రమంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితమై మాట్లాడడం సంకుచితదృష్టి అవుతుంది. పైగా నిర్దుష్టమైన నిర్ణయాలకు ఈ పరిశోధన సరిపోదు. తెలుగు రాష్ట్రేతర ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పాటు; మారిషస్, బర్మా, ఇండోనేసియా మొదలైన దేశాల్లో వ్యవహారంలో ఉన్న తెలుగు మాండలికాలు మన ప్రాంతాల్లోని మాండలికాల నిర్ణయానికి పనికిరావడం ఆశ్చర్యకరమైన నిజం. 


ఉదాహరణకు – అంగి అనే పదం ‘చొక్కా’ అనే అర్థంతో తెలుగు నేలలో వివిధ ప్రాంతాల్లో వ్యవహారంలో ఉంది. ఈ పదం మాండలిక పదకోశం (ఆం.ప్ర.సా.అ. 1970), మాండలిక పదకోశం (తె.అ. 1985[తెలంగాణం; కోస్తా]), నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి,1986), తెలంగాణా మాండలికాలు – కావ్య ప్రయోగాలు (రవ్వా శ్రీహరి, 1988), తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్, 2010), కళింగాంధ్ర నిఘంటువు (జి.ఎస్.చలం), రేనాటి పలుకుబళ్లు (కోడూరి ప్రభాకర్ రెడ్డి) వంటి భిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ మాండలిక పదకోశాల్లో ఆకరంగా ఉంది. అలాంటప్పుడు ‘అంగి’ అనే పదం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన మాండలిక పదం కాదని తెలిసిపోతోంది. ఈ పదం ఇతర తెలుగు నిఘంటువుల్లోనూ ఇదే అర్థంతో చూపించారు. అంతేగాక ఆంధ్ర–తమిళ–కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.1979)లో మూడు భాషల్లోనూ ఈ పదం కనిపిస్తోంది. ఈ పదం తెలుగుపదం మాత్రమే కాదు. అలాంటప్పుడు ఇది మా ప్రాంతీయ పదమంటే, మా ప్రాంతీయం అని చెప్పుకోవడానికి ఉబలాటపడడం ఎంత అవివేకం. 


తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొన్ని భావోద్వేగాల కోసం ‘తెలంగాణ భాష’ అనే మాట విస్తృతంగా పనికొచ్చింది. ఇప్పుడు దాని అవసరం తీరింది. ఇప్పుడు అంతకు మించిన సమస్యలు తెలుగును చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో భాష విషయంలో శాస్త్రీయతను విస్మరిస్తే భాషకు అన్యాయం చేసినట్టే. భాషాభివృద్ధి జరగాలంటే అన్ని రంగాల్లో భాషా వినియోగం, వ్యాప్తి పెరగాలి. ఇది జరగాలంటే దానికి తగిన వ్యూహాలు, ప్రణాళికలు శాస్త్రీయంగా ఉండాలి. అందుకోసం పండితులు, భాషాశాస్త్రవేత్తల విలువైన ఆలోచనలు చాలా అవసరం. 


తెలంగాణ భాష అంటూ మాట్లాడేవాళ్ళ చూపు కేవలం కొన్ని మాండలిక పదాలకు పరిమితం. అందులోనూ చాలా పదాలు మాండలికాలు కావు. వాటిని చెప్పడం వల్ల భాషకు ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళు భాషను శాస్త్రీయంగా అధ్యయనం చేసినవాళ్ళూ కాదు. భాషాభివృద్ధి జరగాలంటే భాషపై ఇష్టం ఒక్కటే సరిపోదు. ఆ భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలి. అది సరైనవిధంగా జరగాలి. అలా జరగాలంటే విద్యావిధానంలో శాస్త్రీయత పాటించాలి.


ఇంటర్ వరకు తెలుగును ఒక పేపరుగా పెట్టడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. దీనివల్ల భాషకు ఏదో జరుగుతుందనుకోవడం ఒక భ్రమ. తెలుగు ప్రాంతంలో తెలుగువాళ్ళు తెలుగు చదువుకోవడానికి ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాల్సిరావటం ఒక పెద్ద విషాదం. అదీ ఒక పేపరు ఖచ్చితంగా చదవాలనడం విడ్డూరం. మన పాలకులు భాష విషయంలో ఆ దేశాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.


ప్రాచీన సాహిత్యం, కాల్పనిక సాహిత్యం, సృజనాత్మక రచనలు మాత్రమే వర్తమాన అవసరాల్ని తీర్చవు. వర్తమానంలోనే కాక, భవిష్యత్ అవసరాలను కూడా తెలుగు తీర్చగలగాలి. అప్పుడే తెలుగు నిలుస్తుంది. కేవలం సాహిత్య బోధనకు పరిమితమైన పండితులు ఈ అవసరాన్ని గుర్తించలేరు. గుర్తించినా తగిన పరిష్కారాలు చూపలేరు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగును ఆధునీకరించే పని సాంకేతిక పరిజ్ఞానం, ఆధునికత అలవడిన భాషాశాస్త్రవేత్తలు, ఆధునిక దృక్పథం గల భాషాపండితులు మాత్రమే చేయగలరు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందూ తర్వాతా తెలుగు ప్రామాణిక భాషారూపం పొందడంలో భాషా యుద్ధాలు చాలానే జరిగాయి. ఆ సందర్భంలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాసలు పెద్దగా ప్రామాణిక భాషలో చోటుచేసుకోలేదు. నిజానికి మాండలిక పదజాలమంతా ప్రామాణికభాషలో వాడడం ప్రపంచంలోని ఏ భాషా సమాజంలోనూ కుదరదు. తెలంగాణ, రాయలసీమ యాసల్ని కోస్తాంధ్ర ప్రాంతీయులు కొంత చులకన చేసిన మాట వాస్తవమే. అది కొన్ని దశాబ్దాలు సాగింది. దాన్ని బలంగా తిప్పికొట్టిన సందర్భాలు తక్కువే. ప్రాంతీయ అస్తిత్వాల నేపథ్యంలో ప్రాంతీయ యాసని అవహేళన చేసే సందర్భాలు తగ్గిపోయాయి. అదే సందర్భంలో ప్రామాణిక భాషా అవసరాన్ని, అది రూపొందే క్రమంలో దానివెనుకున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక సమీకరణల్ని అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మరో కొత్త భాష ఉందని తెలిస్తే మంచిదే. పెద్దభాష అని తెలిస్తే, రాజ్యాంగం గుర్తించిన భాషగా కూడా చేర్చవచ్చు. భాషల దేశం భారతదేశంలో మరో కొత్త భాష అని అందరూ ఆనందించవచ్చు. కానీ శాస్త్రీయంగా తెలంగాణ భాష అంటూ ఒకటుందని నిరూపించడం సాధ్యం కాదు. 


తెలుగు ప్రాంతాల్లోని బడుల్లో తెలుగు మాధ్యమమే కన్పించకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. భాషా బానిసత్వంలోకి తెలుగు ప్రజలు కూరుకుపోతున్నారు. ఇది భాషతో ఆగిపోదు. ఆలోచన, భావం, పుస్తక ముద్రణ, పరిశోధన, ఆవిష్కరణ, ఆచరణ... మొత్తం ఒక్కొక్కటిగా బానిసత్వానికి గురవుతాయి. భాషా బానిసత్వం వచ్చాక అక్కడెక్కడి నుంచో వాళ్ళు పంపిందే మనం చదువుకోవాలి, ఆలోచించాలి, ఆచరించాలి. భాష పరాధీనం కావడమంటే జాతి పరాధీనంలోకి వెళ్ళడమే. ఇలా ప్రతిదానికీ విదేశంపై ఆధారపడే పరిస్థితి దాపురిస్తే, మనకు స్వాతంత్య్రం వచ్చి ప్రయోజనం ఏముంది? మాతృభాష లేనినాడు జాతి, జాతి లేనినాడు ఆ సంస్కృతి ఉండదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు కోసం సమష్టిగాను, వేరువేరుగాను కలిసి చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. ఇకనైనా తెలుగు భాషను విడగొట్టక ఉమ్మడిగానూ, ఎవరికి వారుగానూ భాషాభివృద్ధిపై దృష్టి పెడితే అందరికీ మంచిది. 

టి. సతీశ్

ప్రత్యేకంమరిన్ని...