బిల్‌గేట్స్ గురించి మీకిది తెలుసా..?

ABN , First Publish Date - 2021-06-13T23:57:04+05:30 IST

బిల్‌గేట్స్ గురించి మీకు ఏం తెలుసు? అని ప్రశ్నిస్తే.. చాలా మంది ఆయన విజయగాథల గురించి పుంకానుపుంకాలు చెబుతారు. బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు అని మొదలు పెట్టి.. తాజాగా ఆయన విడాకు

బిల్‌గేట్స్ గురించి మీకిది తెలుసా..?

వాషింగ్టన్: బిల్‌గేట్స్ గురించి మీకు ఏం తెలుసు? అని ప్రశ్నిస్తే.. చాలా మంది ఆయన విజయగాథల గురించి పుంకానుపుంకాలు చెబుతారు. బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్‌ సహా వ్యవస్థాపకుడు అని మొదలు పెట్టి.. తాజాగా ఆయన విడాకుల ప్రకటన వరకు గుక్కతిప్పుకోకుండా చెప్పగలరు. కానీ ఆయన సాఫ్ట్‌వేర్‌లే కాదు.. పంటలు కూడా పండిస్తారనే విషయం బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. మీరు చదివింది నిజమే. బిల్‌గేట్స్.. టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌కు సహ వ్యవస్థాపకుడే కాకుండా ఆయన ఓ రైతు కూడా. వివరంగా చెప్పాలంటే.. అగ్రరాజ్యం అమెరికాలోని అతిపెద్ద రైతుల్లో బిల్‌గేట్స్ కూడా ఒకరు. ఈ విషయాన్ని అమెరికా భూ గణాంకాలే చెబుతున్నాయి. 



అమెరికా భూ గణాంకాల ప్రకారం.. బిల్‌గేట్స్ దంపతులకు లూసియానా, జార్జియా నెబ్రస్కా సహా 18 రాష్ట్రాల్లో ఏకంగా 2,69,000 ఎకరాల సాగుభూములు ఉన్నాయి. లూసియానాలో ఉన్న 70వేల ఎకరాల్లో బిల్‌గేట్స్.. సోయాబీన్స్, పత్తి, వరి తదితర పంటలను పండిస్తున్నారు. వాషింగ్టన్‌లో కూడా బిల్‌గేట్స్‌కు భారీ మొత్తంలో సాగు భూములున్నాయట. అక్కడ ఆయనకు 14వేల ఎకరాల భూములు ఉన్నాయని గణాంకాల్లో వెల్లడైంది. వాషింగ్టన్‌లో ఉన్న భూముల్లో గేట్స్ దంపతులు పెద్ద మొత్తంలో బంగాళ దుంపలను పండిస్తున్నట్టు అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. మెక్‌డొనాల్డ్స్ వంటి అమెరికాలోనే అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ కంపెనీకి బంగాళదుంపలు ఇక్కడ నుంచే వెళ్తాయని పేర్కొంది. కేవలం బంగాళదుంపలే కాకుండా క్యారెట్, ఉల్లిగడ్డలను కూడా పండిస్తూ విదేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు వెల్లడించింది. 



ఇంతకీ ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశం అయిందనే విషయంలోకి వెళితే.. బిల్‌గేట్స్ దంపతులు తమ 27ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఈ సందర్భంగా తమకు సంబంధించిన ఆస్తులను సమానంగా పంచాలని గేట్స్ దంపతులు కోర్టును కోరారు. దీంతో గేట్స్ దంపతుల సాగుభూముల వ్యవహారం బయటికొచ్చి, ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2021-06-13T23:57:04+05:30 IST