చిన్న తనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫేమ్ సంపాదించుకున్న బాల నటుడు దర్షీల్ సఫారి (Darsheel Safary). దాదాపు 15ఏళ్ల క్రితమే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్ ఖాన్ (Aamir Khan) తెరకెక్కించిన ‘తారే జమీన్ ఫర్’ (Taare Zameen Par) లో బాలనటుడిగా కనిపించాడు. డైస్లెక్సియాతో బాధపడే విద్యార్థిగా నటించాడు. ఈ చిత్రం 2017లో విడుదలై సంచలన విజయం సాధించింది. అనంతరం మరో మూడు సినిమాల్లో బాల నటుడి పాత్రను పోషించాడు. ఈ ఏడాది మార్చిలో 25వ పుట్టిన రోజును జరుపుకొన్నాడు. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. రెండో సారి సినిమాలు చేయడానికీ సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశాడు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌తో టచ్‌లో ఉన్నప్పటికీ కరోనా వల్ల ఆ ప్రయత్నం విఫలమయిందని తెలిపాడు.
తాను 25ఏళ్ల వయసుకే కెరీర్లో స్థిరపడతానని ఆశించానన్నాడు. కానీ, జీవితం ఆ విధంగా లేదని పేర్కొన్నాడు. ‘‘ నాకు 25ఏళ్ల వయసు ఉన్నప్పుడే నటుడిగా స్థిరపడతానని అనుకున్నాను. తేలికగా అవకాశాలు వస్తాయనుకున్నాను. మనం కరోనాతో పోరాడతామని నేను అనుకోలేదు. గతేడాది నాకు సవాలుగా గడిచింది. దీంతో ఓపికగా ఉండాలని నా స్నేహితులు, తల్లిదండ్రలు నన్ను బుజ్జగించారు. వారు నా స్థానంలో లేరు. అందువల్ల నేను ఏ విధంగా బాధపడుతున్నానో వారికీ తెలియదు. అవకాశాలు రాకపోతే నటుడు ఆవేదనలో కూరుకుపోతాడు’’ అని దర్షీల్ సఫారి చెప్పాడు. తన తండ్రి ఆమిర్ అంకుల్‌తో టచ్‌లోనే ఉన్నాడని వెల్లడించాడు. ‘తారే జమీన్ ఫర్’ అనంతరం నటించిన అనేక సినిమాలను ఆమిర్ మార్గదర్శకత్వంలోనే చేశానని స్పష్టం చేశాడు. ఈ చిత్రం విజయం సాధించిన అనంతరం పాఠశాలలో బుల్లీయింగ్‌కు గురయ్యానని పేర్కొన్నాడు. అందరు చుట్టుముట్టి దుస్తులను తొలగించారన్నాడు. నటుడు కావాలంటే వీటన్నింటికీ సిద్దపడాలన్నాడు.