సొంతిల్లు ఉంటే పథకాలు ఇవ్వరా?

ABN , First Publish Date - 2022-08-15T08:18:05+05:30 IST

సొంతిల్లు ఉంటే పథకాలు ఇవ్వరా?

సొంతిల్లు ఉంటే పథకాలు ఇవ్వరా?

ఇక సొంత పెళ్లాం ఉంటే రావంటారేమో?

‘గడపగడప’లో ఎమ్మెల్యే గడికోటకు చేదు అనుభవం


రాయచోటి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ‘సొంత ఇల్లు.. సొంత కార్లు ఉన్న వాళ్లకు ప్రభుత్వ పథకాలు రావని చెప్తున్నారు.. రాబోయే రోజుల్లో సొంత పెళ్లాం ఉన్న వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు రావని అంటారేమో’  అంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని సత్తార్‌ అనే వ్యక్తి నిలదీశాడు. శనివారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని బోస్‌నగర్‌లో ‘గడపగడపకు’ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సోషల్‌ మీడియాలో ఎవరో పోస్టు చేశారు. వీడియోలో సంభాషణ.

సత్తార్‌: నమస్కారం.. ఎమ్మెల్యే గారూ.. (రెండు చేతులూ పైకెత్తి)

శ్రీకాంత్‌రెడ్డి: నమస్కారం అన్నా... బాగున్నారా?

సత్తార్‌: మా మున్సిపల్‌ వార్డు సభ్యుడు ఎవరన్నా.? ఇంతవరకు చూడలేదు.. మా సమస్యలు ఏవైనా చెప్పుకుందామంటే.. కనిపించలేదు.

శ్రీకాంత్‌రెడ్డి: అతనెవరో ఎందుకు? నేనున్నా కదా.. నేనే వార్డు సభ్యుడిని అనుకో.. మీ సమస్య ఏంటి.?

(ఇంతలో కొందరు వైసీపీ నాయకులు సత్తార్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు) 

శ్రీకాంత్‌రెడ్డి: ఎవరూ ఏమీ అనొద్దు. అన్నా.. నేను మాట్లాడతా.. సత్తార్‌ భుజం మీద చేయి వేసి కొంచెం పక్కకు తీసుకెళ్లి.. మీకు విద్యాదీవెన వచ్చిందా? 

సత్తార్‌: రాలేదు. 


శ్రీకాంత్‌రెడ్డి: ఇంకా కొన్ని ప్రభుత్వ పథకాలు వచ్చాయా? 

సత్తార్‌: ఏమీ రాలేదు. సొంత ఇల్లు, సొంత కారు.. ఉంటే పథకాలు రావంటున్నారు.. రేపు సొంత పెళ్లాం ఉంటే కూడా ప్రభుత్వ పథకాలు రావంటారేమో...? మీ పార్టీ మ్యానిఫెస్టోను మార్చండి సార్‌’ అని అనగానే.. అలాగే... మారుస్తాం అంటూ శ్రీకాంత్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను వీడియో తీస్తున్న యువకుడిని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సత్తార్‌ ఆ వీడియోను విడుదల చేశాడు. ఇది వైరల్‌ కావడంతో.. ఆదివారం సాయంత్రం రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ ఆధ్వర్యంలో పలువురు వైసీసీ కౌన్సిలర్లు, నాయకులు విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. 

Updated Date - 2022-08-15T08:18:05+05:30 IST