పంట ఎండుతున్నా.. పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-02-25T05:49:15+05:30 IST

మూసుకుపోయిన పెద్ద చెరువు తూము నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరవై రోజులుగా పడుతున్న కష్టాలను బ్యానర్‌గా ప్రదర్శిస్తూ పెద్దచెరువు కట్టపై ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు.

పంట ఎండుతున్నా.. పట్టించుకోరా?
తూప్రాన్‌లోని హైవేపై రైతుల రాస్తారోకో

తూము మూసుకుపోయినా 20 రోజులుగా పత్తాలేని ఇరిగేషన్‌ అధికారులు

పెద్దచెరువు తూముకు మరమ్మతు చేపట్టాలని ఆయకట్టు రైతుల రాస్తారోకో

అరెస్టు చేసిన పోలీసులు


తూప్రాన్‌, ఫిబ్రవరి 24:  మూసుకుపోయిన పెద్ద చెరువు తూము నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరవై రోజులుగా పడుతున్న కష్టాలను బ్యానర్‌గా ప్రదర్శిస్తూ పెద్దచెరువు కట్టపై ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోతున్నా... అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని రైతులు మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకొని బ్యానర్‌ను ప్రదర్శిస్తూ రాస్తారోకో చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని, అధికారులు వచ్చి తూము మరమ్మతులు చేపట్టాలని నినాదాలు చేశారు. రాస్తారోకోతో హైవేపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే....  తూప్రాన్‌ పెద్ద చెరువు కింద సుమారు 750 ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. వానకాలంలో వర్షాలు భారీగా కురియడం, లిప్టులతో నీటిని పంపింగ్‌ చేయడంతో చెరువులోకి భారీగానే నీరొచ్చి చేరింది. దీంతో ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారు. 200 ఎకరాల రబీసాగుకు నయబ్‌ తహసీల్దారు తైబందీ కూడా నిర్వహించారు. తీరా పంటలకు నీరందే సమయంలో తూము మూసుకుపోయింది.  పెద్ద తూము నుంచి నీటిని విడుదల చేసేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో తూము నుంచి నీరు లీకవుతుండడంతో పట్టణ విస్తరణలో తొలగించిన మట్టిని పోసి పూడ్చారు. రాళ్లు, మట్టి పేరుకుపోయి తూము తెరుచుకోవడం లేదు. 20 రోజులుగా తూమును తెరవడానికి రైతులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాంప్రెషర్స్‌ సైతం తీసుకువచ్చి ఏయిర్‌ను పంపించి మట్టిని తొలగించేందుకు ప్రయత్నించారు. గజఈతగాళ్లతో పాటు రైతు లు ఎంత ప్రయత్నిస్తున్నా తూం నుంచి నీరు బయటకు రావడంలేదు. దీంతో ఆయకట్టు పంటలు ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2021-02-25T05:49:15+05:30 IST