ప్రమాదకరంగా ఉన్నా.. పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-08-11T06:07:25+05:30 IST

మండలంలోని రోడ్ల పరిస్థితే కాదు, వంతెనల పరిస్థి తులు కూడా అధ్వానంగా మారాయి.

ప్రమాదకరంగా ఉన్నా..  పట్టించుకోరా?
ప్రమాదకరంగా కందులపాడు - హెచ్‌.ముత్యాలంపాడు వంతెన

వర్షాలకు కుంగిన కందులపాడు- హెచ్‌.ముత్యాలంపాడు వంతెన

జి.కొండూరు, ఆగస్టు 10: మండలంలోని రోడ్ల పరిస్థితే కాదు, వంతెనల పరిస్థి తులు కూడా అధ్వానంగా మారాయి. బుడమేరుపై కందులపాడు, హెచ్‌.ముత్యాలం పాడు మధ్యగల వంతెన ప్రమాదకరంగా మారింది. వర్షాలకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఏ నిమిషానికైనా కూలిపోతుందని తెలపటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు వంతెను పరిశీలించి రాకపోకలను నిలిపివేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కొండూరు, విజయవాడ వైపు వెళ్లేందుకు కందులపాడు, చిన నందిగామ, కోడూరు, వెల్లటూరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మార్లు గ్రామస్థులు కొత్త వంతెనకు అంచనాలు వేసి నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ప్రతిపాదించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇపుడు ముత్యాలంపాడు వైపు వంతెన పూర్తిగా కుంగిపోయిందని కూలిపోతే ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ వంతెన నిర్మాణానికి చోరవ తీసుకోవాలని ప్రజలు  కోరుతున్నారు.


పాలకుల నిర్లక్ష్యం.. కుంగిన వంతెన : దేవినేని ఉమా

జి.కొండూరు, ఆగస్టు 10: పాలకుల నిర్లక్ష్యానికి బుడమేరు కాల్వపై కుంగిన వంతెనే నిదర్శనం అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కందులపాడు, హెచ్‌.ముత్యాలంపాడు మధ్యగల బుడమేరు కాల్వపై వంతెన కుంగిపోవటంతో రాకపోకలను నిలిపివేశారు. బుధవారం కుంగిన వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  38 నెలలుగా శిథిలావస్థకు చేరిన వంతెనను పట్టించుకునే తీరక ఎమ్మెల్యేకు లేకుండా పోయిందన్నారు. కనీసం వంతెనకు అప్రోచ్‌ సరిగ్గా వేయకుండా రెండు వంతెనలకు కూడా మట్టి వేయకపోవడం బాధ్యాతారాహిత్యం అన్నారు. కవులూరులో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వేసిన రోడ్డు నెల రోజులకే ఘోరంగా మారిందని అన్నారు. పాలకులు అభివృద్ధిపై దృష్టి లేకపోవటం వలన ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు.


Updated Date - 2022-08-11T06:07:25+05:30 IST