వేమనను పట్టించుకోరా..?

ABN , First Publish Date - 2022-01-14T06:13:06+05:30 IST

తెలుగు భాషా సాహిత్యాలను జన సామాన్యంలోకి తీసుకుపోయి సామాజిక సంస్కరణలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రజాకవి వేమనను ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు...

వేమనను పట్టించుకోరా..?

తెలుగు భాషా సాహిత్యాలను జన సామాన్యంలోకి తీసుకుపోయి సామాజిక సంస్కరణలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రజాకవి వేమనను ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కనీసం వేమన జయంతినయినా అధికారికంగా నిర్వహించడం లేదు. వేమన అందించిన సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరం. వేమన జయంతిని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తే వేమన సందేశం, సామాజిక స్ఫూర్తిని మన సమాజంలోని భావితరాలకు అందించేందుకు మరింత తోడ్పడుతుంది.


ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విభిన్న రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖుల జయంతులు, వర్ధంతులు అధికారికంగా చేస్తున్నాయి. ఆ సరసన వేమనకు కూడా స్థానం కల్పించాలని అనేక సందర్భాలలో కోరుతూ వస్తున్నాం. 2018 లో వేమన అభిమానుల ఒత్తిడితో ఆంధ్రప్రదేశ్ లోని కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు అత్తార్ చాంద్ భాషా వేమన జయంతి విషయం చర్చకు తీసుకొచ్చినా అడుగు ముందుకు పడలేదు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మంత్రికీ సంబంధిత అధికారులకూ వినతులు ఇచ్చినా కదలిక రాలేదు.


కర్ణాటక రాష్ట్రప్రభుత్వం తమ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడానికి 2017 ఆగస్టు 17న ఒక జీఓను జారీ చేసింది. 2018 జనవరి 19న వేమన జయంతి కార్యక్రమ నిర్వహణ అమలు కావాలని అందులో నిర్దేశించింది. కేవలం జీఓతో ఆగిపోకుండా బెంగుళూరు కేంద్రంగా రాష్ట్ర స్థాయి వేమన జయంతి వేడుకలకు 10 లక్షలు, జిల్లా కేంద్రానికి యాభై వేలుగా 30 జిల్లాలకు 15 లక్షలు, తాలుకా కేంద్రానికి 25వేలుగా 136 తాలుకాలకు 44 లక్షలు, మొత్తం 69 లక్షలు ప్రతి సంవత్సరం కేటాయింపులు చేశారు.


కర్ణాటక రాష్ట్రంలో తెలుగు భాషాభిమానులు, వేమన సాహిత్య అభిమానులు 1920ల నుంచే వేమన జయంతిని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. మైసూరు విశ్వవిద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి పని చేసిన రోజుల్లో వేమన జయంతులు ఘనంగా సాగేవని రికార్డులు చెబుతున్నాయి. తెలుగు ప్రజల ఆకాంక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా వేమన జయంతిని నిర్వహిస్తోంది. పక్క రాష్ట్రంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా, అధికారికంగా కొనసాగుతున్న వేమన జయంతిని మన తెలుగు నేలపై కూడా నిర్వహించాలి.


అనంతపురం జిల్లా కటారుపల్లిలో ఉన్న వేమన స్మృతికేంద్రం వద్ద అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో చేపట్టాలి. వేమన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి సాధికారికంగా పరిశోధనలు జరగాలి. వేమన ప్రామాణిక పద్య నిర్ణయం జరగాలి. పుస్తకాలను డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. పాఠ్య పుస్తకాలలో వేమన పద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేమన పద్యాల ద్వారా తెలుగు భాషను తొలిదశలో సులభంగా నేర్చుకొనే విధంగా ప్రత్యేక పుస్తకాల ముద్రణ జరగాలి. వేమన సంబంధిత స్థలాలపై అవగాహన కలిగించి సంరక్షణ చేయాలి. జానపద సాహిత్యంలో వేమన స్థానం వెలుగులోకి రావాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అడుగు ముందుకు వేసి ఈ జనవరి 19 నుంచే వేమన జయంతిని అధికారికంగా చేపట్టాలని కోరుతున్నాం.

డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి

Updated Date - 2022-01-14T06:13:06+05:30 IST