రాష్ట్రంలో రైతులను పట్టించుకోరా?

ABN , First Publish Date - 2022-05-24T10:07:19+05:30 IST

రాష్ట్రంలో రైతుల గోస పట్టించుకునే వారు కరువయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రైతులను పట్టించుకోరా?

  • ఇక్కడ రైతులను గాలికి వదిలేసిన కేసీఆర్‌..
  • పంజాబ్‌లో మొసలి కన్నీరు కారుస్తున్నారు
  • రాజకీయాల పేరిట ఢిల్లీలో తిరుగుతున్నారు
  • లక్ష్మాపూర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌


మేడ్చల్‌ అర్బన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల గోస పట్టించుకునే వారు కరువయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానంటూ సీఎం కేసీఆర్‌ తరచూ ఢిల్లీలో తిరుగుతున్నారని, రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్‌, ఫామ్‌హౌజ్‌కు పరిమితమవుతున్నారని విమర్శించారు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఢిల్లీలో 20 రోజులు, ఫామ్‌హౌజ్‌లో 15 రోజులు పడుకుంటున్న కేసీఆర్‌.. రైతుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయకుండా దేశాటన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు చనిపోతే, వారి కుటుంబాలను కనీసం ఓదార్చని కేసీఆర్‌.. పంజాబ్‌కు వెళ్లి రైతుల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. రైస్‌ మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకుంటూ రైతుల గోస పుచ్చుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిలోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, క్వింటాల్‌ ధాన్యానికి రూ.2,500, కందులకు రూ.3,050 ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కూరగాయలు, ఆకు కూరల రైతులకు ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ ఇచ్చి, స్థానికంగా రైతుబజారు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే లక్ష్మాపూర్‌ నుంచి ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం.. ఈ గ్రామానికి నక్ష ఏర్పాటు చేయించలేక పోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఈ గ్రామ రైతుల రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు వెళ్లే రోడ్డు కోసం లక్ష్మాపూర్‌ వాసుల ఇళ్లను కూల్చేశారని, కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిస్తానని, రూ.5లక్షలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. 70 ఏళ్ల ఎల్లవ్వకు పరిహారం ఇవ్వని కేసీఆర్‌ నిజంగా సన్నాసేనని విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నాయకులు హరివర్ధన్‌రెడ్డి, వజ్రేశ్‌ మూడు నెలల్లో ఈ వృద్ధురాలికి ఇల్లు కట్టిస్తారని తెలిపారు. 

Updated Date - 2022-05-24T10:07:19+05:30 IST