Abn logo
Jul 11 2020 @ 00:15AM

‘గ్రామ రాజకీయాలు’ మారబోతున్నాయా?

సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత కరోనా కారణంగా సొంత ఊళ్లు చేరిన కష్టజీవులంతా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు. 1952 నుంచి 1989 ఎన్నికల వరకూ దేశంలో అనేక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది ఈ అణగారిన వర్గాలే!


కరోనా మహమ్మారి ప్రపంచ రాజకీయాలను, యుద్ధ వ్యూహాలను, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను, ప్రపంచ భౌగోళిక రాజకీయాలను, భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని....ఒకటేమిటి సకల కీలక రంగాలను కుదిపివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భూగోళం ఎదుర్కొంటున్న కీలక పరిణామం ఇది. కరోనా దెబ్బకు దేశంలోని కష్టజీవులు తిరిగి తమ పల్లెలకు చేరిన పరిణామం రాబోయే రోజుల్లో ఎన్నికల చిత్రపటాన్ని, రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని గ్రామాల స్వరూపం మారితే రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయావకాశాలు ప్రశ్నార్థకమవుతాయి. 


90వ దశకంలోని వ్యవసాయ సంక్షోభం, మాంద్యం, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న కరువు రైతుకూలీలను విస్తరిస్తున్న పట్టణాలకు తరిమేసింది. ఇది అనివార్యమైన పరిణామం. పీవీ సంస్కరణల నేపథ్యంలో పట్టణాల విస్తరణ, నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగాలతో పాటు అనేక కొత్త ఉపాధి అవకాశాలు పల్లెవాసుల్లో ఆశలురేపాయి. దీంతో గ్రామాలు ఖాళీ అయి పట్టణాలు జనసాంద్రతతో క్రిక్కిరిసి పోయాయి. 90వ దశకంలో గ్రామాలు వదిలిన రైతు, కూలీగా వలస కార్మికుడిగా పరిణామం చెందడం ఈ దేశ చరిత్రలో అత్యంత కీలక, విషాద పరిణామం. 

వలసకూలీలు తిరిగి గ్రామాలకు చేరడమన్న పరిణామం ఊహించనిది. పట్టణ జీవితం అలవాటు పడిన వలస కూలీలనుంచి తిరిగి పల్లెల్లో బ్రతకగలమా అన్న ప్రశ్న వినిపించేది. అయితే కరోనా వారిని వందలాది కిలోమీటర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, పసిపాపలను చంకనేసుకుని పుట్టిన గడ్డకోసం పరుగులు తీసేలా చేసింది. సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత సొంత ఊళ్లు చేరిన వారంతా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు. 1952 సాధారణ ఎన్నికల కాలం నుంచి 1989 ఎన్నికల వరకూ దేశంలో అనేక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది అణగారిన వర్గాలే! ఇది తెలంగాణకు మరింత సరిగ్గా సరిపోతుంది.


1990ల్లోని దుర్భిక్షం వారిని పట్టణాల్లో కూలీలుగా మార్చిన తర్వాత ఎన్నికల ఫలితాల్లో గ్రామాల పాత్ర క్రమంగా తగ్గుతూ వచ్చింది. గ్రామాలను పట్టణాలుగా మార్చి... మున్సిపాలిటీలుగా, గ్రేటర్ మున్సిపాలిటీలుగా మార్చడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఇదే. వై.ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల 12 మండలాలను కలిపి ‘‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్’’ చేయడం పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతుల వ్యవసాయ భూమిని మార్కెటైజ్ చేయడమనే అసలు పని జరిగింది. అంతేకాదు గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ ఓటర్లే మెరుగని ఆయన భావించారు. అందుకు కారణం గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్థిరమైన అభివృద్ధిని, నిర్దిష్టమైన, నిశ్చలమైన అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. పట్టణ ప్రాంత ఓటర్లు ఎన్నికలప్పుడు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తారు.


భూమి కోల్పోయిన రైతులు స్వస్థలాలను వదిలి వెళ్లి కూలీలుగా మారిపోతారు. వారికి ఉపాధి ఓ యుద్ధంగా మారిపోయిన తర్వాత ఓటు విషయంలో అంత ప్రాధాన్యం ఉండదు. తెలంగాణ పట్టణాలు, నగరాల్లోని మెజారిటీ వలస కూలీలకు ఓటు హక్కు ఉండదు. రియల్ వ్యాపారం కారణంగా భిన్నప్రాంతాల వారు స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. వారికి నిర్దిష్టమైన రాజకీయ అభిప్రాయాలకన్నా, తమ నివాసిత ప్రాంతాల్లో మౌలిక సమస్యల పరిష్కారం ప్రధానంగా మారుతుంది. కోటిమంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో 2019 లెక్కల ప్రకారం వెనుకబడిన వర్గాల ఓటర్ల శాతం రెండు మాత్రమే. జీహెచ్ఏంసీ ఓటర్ల సంఖ్య 72,34,669 అయితే బీసీల ఓట్లు కేవలం 17వేల పైచిలుకు. ఇందులో సగానికి సగం మంది ఓటు వేయటం లేదని స్వయంగా జీహెచ్ఎంసీ 2019లో ప్రకటించింది. చార్మినార్ జోన్ పరిధిలోని మలక్‌పేట్, సంతోష్‌నగర్, చాంద్రాయణ్‌గుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌లలో బీసీ ఓటర్ల సంఖ్య 4వేలు మాత్రమే. వీరంతా పొరుగునున్న పాలమూరు, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి వలస వచ్చిన వారు. గ్రామాల్లో ఓట్లు ఉన్నా వారు వెళ్లలేని స్థితి. నగరాల్లో ఓటు హక్కుకోసం ప్రయత్నిస్తే సవాలక్ష కొర్రీలు. మొత్తంగా వలస కూలీలు ఓటు హక్కుకు క్రమంగా దూరమయ్యారు. ఇక విదేశాల్లో ఉన్న వారి పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. 


1952 సాధారణ ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం చెప్పుకోవాల్సినంతగా లేదు. బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండేది. అనంతరం బ్రాహ్మణుల ప్రభావం క్రమంగా తగ్గింది. 1952 సాధారణ ఎన్నికల్లో 26 మంది గెలిస్తే, 1957లో 18, 1962లో 12, 1972లో 9. అట్లా తగ్గుతూ వచ్చి చివరకి రెండుకో మూడుకో పరిమితమైంది. రెడ్డి సామాజిక వర్గం ఏకైక రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే ఉండేది. అసెంబ్లీలో, పార్లమెంటులో బీసీల, ఎంతో కొంత ఎస్సీల ప్రాతినిథ్యం పెరిగినా ఆ వర్గాల ఓటర్లు ఏమైపోయారన్నది వారికి పట్టలేదు. 1982లో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తెలంగాణ బీసీ సామాజిక వర్గం బలాన్ని గుర్తించారు. అందుకు తగినట్టుగానే ప్రాధాన్యం ఇచ్చి స్థానాలు కేటాయించారు. దీంతో బీసీల ప్రాతినిథ్యం క్రమంగా పెరిగింది. కొంత మేర ఎస్సీ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా పెరిగింది. 1952 నుంచి 1989 ఎన్నికల వరకూ రాజకీయ పక్షాల జయాపజయాలను శాసించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వలసకూలీలుగా మారి, రాష్ట్రాలూ, దేశాల సరిహద్దులు దాటారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడంతో రాజకీయ పార్టీల విజయం సునాయాసమైంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా చిన్నచిన్న వాగ్దానాలకు సైతం ఆశపడి ఓట్లేయడం పరిపాటైంది. సేద్యాన్నీ, భూమినీ వదిలేసిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల్లాంటి అభివృద్ధి పథకాలు కాంట్రాక్టర్ల జేబులు నింపే వనరులుగా మారాయి. 


విస్తరించిన పట్టణ ప్రాంతాల్లో కొత్త అవకాశాల కారణంగా స్థిరపడిన కొత్త వర్గాలు, చిన్నస్థాయి ఉద్యోగులు కొత్త పట్టణ ఓటర్లుగా మారారు. కరోనా నేపథ్యంలో తిరిగి గ్రామాలకు చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉపాధిలేని, నీటివనరులు లేని గ్రామాల్లో ఎట్లా బతుకీడుస్తారు? రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఏర్పడే సంక్షోభాన్ని రాజకీయ పార్టీలు ఎట్లా ఎదుర్కొంటాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజకీయ ఎజెండాగా మార్చుకుని మరోసారి మోసగిస్తాయా? ఇదో దయనీయస్థితి.


-ప్రశాంత్

Advertisement
Advertisement
Advertisement