నచ్చిందే చేయండి!

ABN , First Publish Date - 2020-06-17T05:51:49+05:30 IST

‘‘నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది అదృష్టం కాదు... టెక్నాలజీపై నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలన్న అభిలాష. విద్యార్థులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఇవి’’... ఇటీవల ‘డియర్‌ క్లాస్‌ 2020’ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ చెప్పిన మాటలివి...

నచ్చిందే చేయండి!

‘‘నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది అదృష్టం కాదు... టెక్నాలజీపై నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలన్న అభిలాష. విద్యార్థులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఇవి’’... ఇటీవల ‘డియర్‌ క్లాస్‌ 2020’ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ చెప్పిన మాటలివి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంతో ఎదుర్కొనేలా పట్టభద్రులకు విలువైన సందేశాన్నిచ్చారు పిచాయ్‌. ఆ స్ఫూర్తి మంత్రమే ఇది...


  1. కరోనా వల్ల ఏడాది పాటు చదివి, విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని బయటకు వస్తున్న పట్టభద్రులకు భవిష్యత్‌ అంధకారంగా కనిపించవచ్చు. ప్రణాళికలన్నీ తారుమారయ్యి ఆందోళన ఆవహించవచ్చు. ఇది దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ... ఎలాంటి పరిస్థితులైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. 
  2. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి. అప్పుడే కోల్పోయిన విషయాలతో కాకుండా సాధించిన మార్పులతో చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. ‘దేన్నయినా మార్చగలిగే అవకాశం ఇప్పుడు మీ ముందున్నది’ అని మరిచిపోకండి. 
  3. గతంలోనూ ఇలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. 1920లో ప్రాణాంతక మహమ్మారి, 1970లో వియత్నాం యుద్ధం, 2001లో అమెరికాలో 9/11 ఉగ్రదాడులు... ఇలా అన్ని విపత్కర పరిస్థితులనూ నాటి పట్టభద్రులు జయించగలిగారు. 
  4. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విశ్వాసం కోల్పోకూడదని చరిత్ర చెబుతోంది. 
  5. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాల పట్ల మీరు అసహనంతో ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనివ్వండి. దాన్ని కోల్పోవద్దు. అదే భవిష్యత్తులో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుంది. 
  6. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, పాప్‌ స్టార్‌ లేడీ గాగా, ప్రపంచ ప్రసిద్ధ కొరియన్‌ బ్యాండ్‌ ‘బీటీఎస్‌’తో కలిసి ఇలా వర్చ్యువల్‌ వేదిక పంచుకొంటానని కలలో కూడా ఊహించలేదు. దీనికి కారణం సాంకేతికతపై నాకున్న మక్కువ, కొత్తవి నేర్చుకోవాలన్న ఆసక్తి. విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. 
  7. ప్రతి తరం తరువాతి తరం సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తుంది. ఎందుకంటే, ఒక తరం పురోగతి తరువాతి కాలానికి పునాది అవుతుందని వారు గ్రహించకపోవడమే! 
  8. కనుక మీరు కొంత సమయం తీసుకోండి. ఆలోచించండి. ఈ ప్రపంచంలో అన్నింటి కన్నా మీకు ఏది ఇష్టమో తెలుసుకొని, అటువైపే అడుగులు వేయండి. మీ తల్లితండ్రులకు నచ్చిందనో, స్నేహితులు ఏదో చేస్తున్నారనో, లేదా ఈ సమాజం మీ నుంచి ఇంకేదో ఆశిస్తుందనో నిర్ణయం తీసుకోకండి. మీ మనసు ఏది కోరుకొంటే అదే చేయండి. 
  9. చివరగా... విశాల దృక్పథం, అసహనం, ఆశావహ వైఖరితో ఉండండి. అలా మారగలిగితే మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకొంటుంది. దేన్నయినా మార్చగల అవకాశం మీకుంది. ప్రయత్నించండి. నేను ఆశావాదిని. మరి మీరు?

Updated Date - 2020-06-17T05:51:49+05:30 IST