పరిహారం చెల్లించే వరకూ పనులు వద్దు

ABN , First Publish Date - 2022-08-10T06:16:39+05:30 IST

మండలంలోని వేంపాడు రెవెన్యూ మూలపర్ర గ్రామంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటులో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని, తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకూ ఈ నిర్మాణాలను ఆపాలని కారిడార్‌ నిర్వాసిత రైతులు అల్టిమేటమ్‌ జారీ చేశారు.

పరిహారం చెల్లించే వరకూ పనులు వద్దు
సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు


- ఇండస్ర్టియల్‌ కారిడార్‌ నిర్వాసితులు స్పష్టీకరణ

నక్కపల్లి, ఆగస్టు 9 : మండలంలోని వేంపాడు రెవెన్యూ మూలపర్ర గ్రామంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటులో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని, తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకూ ఈ నిర్మాణాలను ఆపాలని కారిడార్‌ నిర్వాసిత రైతులు అల్టిమేటమ్‌ జారీ చేశారు.  మూలపర్రలో పలువురు నిర్వాసిత రైతులు  మంగళవారం సమావేశమయ్యారు. భూములు కోల్పోయిన డి.పట్టాదారులు, సాగుదారులకు ఇంకా కొంతమంది పరిహారం ఇవ్వలేదని చెప్పారు.  వారందరికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించే వరకూ కారిడార్‌ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు.  రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, అమలాపురం ఉప సర్పంచ్‌ గంటా నర్సింగరావు, సూరకాసుల గోవిందరావు, సూర కాసుల అప్పారావు తదితరులు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం, ప్యాకేజీ, పునరావాస సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిబంధనలు పాటించకుండా భూముల్లోకి చొరబడి నిర్మాణాలు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడపా బాబూరావు, అడపా సత్తిబాబు, గోవింద్‌, గంటా అప్పారావు, శ్రీను, అడపా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T06:16:39+05:30 IST