Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Jun 2022 12:57:37 IST

మోకీలు మారినా అజాగ్రత్త వద్దు

twitter-iconwatsapp-iconfb-icon
మోకీలు మారినా అజాగ్రత్త వద్దు

చెప్పులు అరిగిపోతే, కొత్త చెప్పులు కొనుక్కున్నంత తేలికగా, అరిగిపోయిన మోకీళ్లను మార్చుకోగలిగే వైద్య సదుపాయాలు అందుబాటులోకొచ్చాయి. అయితే సర్జరీ సక్సెస్‌... మోకీలు మార్పిడి చేయించుకున్న వ్యక్తి ఆరోగ్య సమస్యలూ, సర్జరీ తదనంతర జాగ్రత్తల మీదే  ఆధారపడి ఉంటుంది అంటున్నారు ఎముకల వైద్యులు.  


నీరీప్లేస్‌మెంట్‌ ఫెయిల్‌ అవడం అనగానే సాధారణంగా సర్జరీ చేసిన వైద్యుల మీదే అనుమానపడతాం. కృత్రిమ కీలును బిగించడంలో పొరపాట్లు చేయడం వల్ల సర్జరీ ఫెయిల్‌ అయిందని అనుకుంటాం. కానీ నిజానికి సర్జరీ తర్వాత తలెత్తే ఇన్‌ఫెక్షన్లు, అసెప్టిక్‌ లూజెనింగ్‌, ఫిజియోథెరపీ కొరవడడం మొదలైన కారణాల వల్ల కృత్రిమ మోకీలు సామర్ధ్యం మేరకు పని చేయకపోవచ్చు. లేదా కొంత కాలానికే పనిచేయకుండా మొరాయించవచ్చు. 


మధుమేహాన్ని అదుపులో ఉంచి..

మోకీలు మార్పిడి లైఫ్‌స్టైల్‌ సర్జరీ. అత్యవసరంగా చేయవలసిన సర్జరీ కాదు కాబట్టి, మోకీలు మార్పిడి చేయించుకోవాలనే ఆలోచన ఉన్న మధుమేహులు మొదట చక్కెర స్థాయిలను అదుపులోకి తెచ్చుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పినా, లక్షణాల రూపంలో బయల్పడేవరకూ వైద్యులను కలవని వారే ఎక్కువ. అలాగే ఒకవేళ చక్కెర పెరిగినా, సాధారణంగా తిన్న పదార్థాల మీదకు తప్పును తోసేసి, మరో మాత్ర అదనంగా మింగేవాళ్లూ ఎక్కువే! కానీ చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉండాలంటే మందులను మార్చవలసి ఉంటుందని కానీ, తరచూ షుగర్‌ లెవల్స్‌ను గమనించుకుంటూ ఉండాలని కానీ, వైద్యులను కలుస్తూ ఉండాలని కానీ ఎవరూ అనుకోరు. కానీ నీ రీప్లే్‌సమెంట్‌ సర్జరీ సక్సెస్‌ కావాలంటే, సర్జరీ తదనంతర ఇన్‌ఫెక్షన్లకు ఆస్కారం లేకుండా సర్జరీకి ముందే చక్కెరను అదుపులోకి తెచ్చుకోవాలి.


ఇన్‌ఫెక్షన్లు ప్రమాదకరం

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, 0.5 - 1.0ు ఇన్‌ఫెక్షన్‌ రిస్క్‌ ప్రతి సర్జరీలోనూ ఉంటుంది. సర్జరీ చేయించుకున్న ఆస్పత్రి, రోగికి ముందు నుంచి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, సర్జరీ తర్వాతి జాగ్రతలు... వీటన్నిటి మీదా సర్జరీ తదనంతర ఇన్‌ఫెక్షన్లు ఆధారపడి ఉంటాయి. అయితే ఇన్‌ఫెక్షన్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, కీలుకు నష్టం అంత తక్కువగా ఉండే వీలుంటుంది. కాబట్టి సర్జరీ చేసిన చోట ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తే, సొంత వైద్యంతో సరిపెట్టుకోకుండా వెంటనే వైద్యులను కలవాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్‌ చర్మాన్ని దాటుకుని, మరింత లోతుకు కృత్రిమ కీలు వరకూ వెళ్లిపోతుంది. సూపర్‌ఫిషియల్‌ ఇన్‌ఫెక్షన్‌ మందులతో అదుపు కానప్పుడు, వైద్యులు తిరిగి కృత్రిమ కీలును తెరచి, ఆ ప్రదేశం మొత్తాన్నీ శుభ్రం చేసి, కీలు మధ్య ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ను రీప్లేస్‌ చేయవలసి వస్తుంది. సర్జరీ జరిగిన ఆరు వారాల లోపు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు, ఈ తరహా వైద్యం అవసరమవుతుంది. ఆ సమయం దాటితే, ఇన్‌ఫెక్షన్‌ మూలంగా కృత్రిమ కీలు మొత్తం మీదా బయోఫిల్మ్‌ ఏర్పడి, అది ఇంప్లాంట్‌కు అతుక్కుపోతుంది. అప్పుడు ఇంప్లాంట్‌ మొత్తాన్నీ సమూలంగా తొలగించి, కొత్త ఇంప్లాంట్‌ బిగించుకోవలసి వస్తుంది. 


రుమటాయిడ్‌ ఆర్ర్థైటిస్‌ ఉంటే...

కీళ్ల అరుగుదలకు ఆస్టియో ఆర్ర్థైటిస్‌తో పాటు రుమటాయిడ్‌ ఆర్ర్థైటిస్‌ కూడా ఓ కారణమే! అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు లక్షణాలను అదుపులో ఉంచుకోవడం కోసం దీర్ఘకాలంగా స్టిరాయిడ్ల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వీటితో నొప్పి అదుపులోకొచ్చినా, దీర్ఘకాలంలో షుగర్‌ పెరగడం, ఎముకలు మెత్తబడిపోవడం లాంటి సమస్యలు మొదలవుతాయి. ఒకవేళ వీళ్లకు మోకీళ్లు మార్చే పరిస్థితి వస్తే, ఆ సర్జరీకి ఎముక పటుత్వం సరిపోకపోవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే సర్జరీకి ముందు నుంచీ స్టిరాయిడ్లకు బదులుగా, మెథాట్రెక్సేట్‌ లాంటి ఇతర మందులకు మారవలసి ఉంటుంది. అలాగే అప్పటివరకూ వాడిన స్టిరాయిడ్స్‌ మూలంగా మెత్తబడిన ఎముకకు బలం చేకూర్చడం కోసం టెర్రిపారటైడ్‌ అనే ఇంజక్షన్లు కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు వాడుకోవలసి ఉంటుంది. సర్జరీ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఇవే ఇంజెక్షన్లను ఇంకొంత కాలం పాటు వాడుకోవలసి రావచ్చు. 


ఈ పనులు చేయకూడదు

20 ఏళ్ల యుక్తవయస్కులు మెట్లు ఎక్కినా, ఎగిరి దూకినా వాళ్ల కీళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ పెద్ద వయసులో, ఎలాంటి మోకీళ్ల సమస్యలూ లేకపోయినా, ఈ పనులకు పూనుకోకూడదు. ఒకవేళ సమస్యలు అప్పుడే మొదలైనా, అవి మరింత పెరగకుండా ఉండడం కోసం కొన్ని అలవాట్లు మానుకోవాలి. అలాగే సర్జరీతో అమర్చుకున్న కృత్రిమ కీళ్లు త్వరగా అరిగిపోకుండా, వాటి మన్నిక పూర్తి కాలం కొనసాగాలన్నా కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అవేంటంటే...


  • నేల మీద కూర్చోవడం 
  • ఎక్కువగా మెట్లు ఎక్కడం
  • ఎగిరి దూకడం
  • ఇండియన్‌ టాయిలెట్‌ వాడకం
  • మోకాళ్ల మీద బరువు పడే పనులు చేయడం
  • ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తడం


సర్జరీలో ఏం చేస్తారంటే...

సర్జరీలో ప్రధానంగా... మోకీలులో అరిగిపోయిన పై ఎముక, కింది ఎముకకు మెటల్‌ క్యాప్స్‌ (స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కోబాల్ట్‌ క్రోమ్‌) బిగించి, ఆ రెండూ ఒకదానికొకటి తగలకుండా వాటి మధ్యలో ఒక ప్లాస్టిక్‌ ఇన్‌సర్ట్‌ లాంటిది బిగిస్తారు. 40 ఏళ్ల క్రితం చేసిన సర్జరీలో, నేడు చేస్తున్న ఆధునిక సర్జరీల్లో వైద్యులు అనుసరిస్తున్న సూత్రం ఇదే! అయితే ఈ నలభై ఏళ్లలో, కృత్రిమ మెటల్‌ క్యాప్స్‌ నునుపుదనం, ప్లాస్టిక్‌ ఇన్‌సర్ట్‌ దృఢత్వం పెరిగాయి. అలాగే రోగి మోకీలును బట్టి కృత్రిమ కీళ్ల సైజులను తయారుచేసుకోగలిగే ‘పేషెంట్‌ స్పెసిఫిక్‌ ఇంప్లాంట్స్‌’ పరిజ్ఞానం పెరిగింది. అలాగే ఆగ్జీలియం, గోల్డ్‌ కోటెడ్‌ తరహా ఇంప్లాంట్లు కూడా తాజాగా అందుబాటులోకొచ్చాయి. వీటితో తయారైన ఇంప్లాంట్లు ఎక్కువ కాలం మన్నుతాయని కంపెనీలు చెప్తున్నాయి. అయితే పదేళ్ల క్రితమే మార్కెట్లోకొచ్చిన ఈ ఇంప్లాంట్లను ప్రయోగాత్మకంగా పరిశీలించడమే జరిగింది తప్ప, శాస్త్రీయ పరిశీలన జరగలేదనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఈ ఆగ్జీలియం, గోల్డ్‌ కోటెడ్‌ ఇంప్లాంట్లతో ఒక ప్రయోజనం ఉంది. లోహపు ఎలర్జీలు ఉన్నవాళ్లు మోకీలు మార్పిడి కోసం ఈ ఇంప్లాంట్స్‌ను నిర్భయంగా ఎంచుకోవచ్చు. 


ఫిజియోథెరపీ కీలకం

మోకీలు పటుత్వం, అరుగుదలలు కొంతమేరకు ఫిజియోధెరపీ మీద ఆధారపడి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆర్ర్థైటిస్‌ ప్రారంభదశలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రేడ్‌ వన్‌ నుంచి గ్రేడ్‌ ఫోర్‌కు పెరుగుతూ పోయే ఆర్ర్థైటిస్‌ సమస్యను చివరి దశ వరకూ వెళ్లకుండా ఫిజియోథెరపీతో నియంత్రించుకోవచ్చు. ఈ వ్యాయామాలతో కండరాల పటుత్వం పెరిగి, కీలు మీద భారం తగ్గుతుంది. అలాగే ఈ వ్యాయామాలు చేసిన వాళ్లకు, సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ తేలికవుతుంది. కాబట్టి సర్జరీకి ముందు నుంచే ఈ వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అలాగే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ విషయంలో కొంతమంది అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ నీ రీప్లే్‌సమెంట్‌ సర్జరీ తర్వాత కనీసం మూడు నుంచి ఆరు వారాల పాటు ఫిజియోథెరపీ చేయడం తప్పనిసరి. లేదంటే, మోకీలు బిగుసుకుపోయే ప్రమాదం ఉంటుంది. 


మోకాళ్ల నొప్పులు మొదలైతే మోకీళ్ల మార్పిడి చేయించుకోవాలని ఆలోచించడం సరి కాదు. మోకాళ్ల నొప్పులకు ఎన్నో కారణాలుంటాయి. వాటిని సరిదిద్దుకోవడం మీద దృష్టి పెట్టాలి. నీ రీప్లే్‌సమెంట్‌ సర్జరీని చిట్టచివరి ప్రత్నామ్నాయం మాత్రమే అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. కీళ్లవాతం, లేదా ఆర్ర్థైటిస్‌ చివరి దశకు చేరుకుని, దైనందిన పనులు చేసుకోలేని పక్షంలో, నొప్పి తీవ్రంగా ఉండి, అది మందులతో అదుపులోకి రానప్పుడు మాత్రమే, అంతిమ పరిష్కారంగా నీ రీప్లే్‌సమెంట్‌ సర్జరీని ఎంచుకోవాలి. 


ఇన్‌ఫెక్షన్‌ కారక మైక్రోఆర్గానిజమ్స్‌, శరీరంలోని ఏ ప్రదేశం నుంచైనా నీ రీప్లే్‌సమెంట్‌ సర్జరీ చేసిన ప్రదేశానికి చేరుకునే అవకాశాలుంటాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, దంతాల ఇన్‌ఫెక్షన్‌, గుండెలో ఇన్‌ఫెక్షన్‌ (ఇన్‌ఫెక్టివ్‌ ఎండోకార్డైటిస్‌).. ఈ ఇన్‌ఫెక్షన్లు శరీరంలో ఉంటే, అవి రక్తం ద్వారా మోకీలుకు చేరుకుని ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేస్తాయి. ఇలాంటప్పుడు, ఇంప్లాంట్స్‌ వదులై నొప్పి మొదలవుతుంది. నడవలేకపోవడం, నడవగలిగినా ఎక్కువ దూరాలు నడవలేకపోవడం లాంటి లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. ఇలాంటప్పుడు కృత్రిమ కీలును తొలగించి, తిరిగి మరొక ఇంప్లాంట్‌ బిగించవలసి వస్తుంది. కాబట్టి నీ రీప్లే్‌సమెంట్‌ సర్జరీకి ముందూ, తర్వాతా ఎలాంటి ఇన్‌ఫెక్షన్లూ శరీరంలో లేకుండా చూసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ సోకినా, వెంటనే వైద్యులను కలిసి యాంటీబయాటిక్స్‌ వాడుకోవాలి. ఏదైనా దంత సంబంధ చికిత్సలు చేయించుకోవలసి వస్తే, మందులతో ఇన్‌ఫెక్షన్‌ను అదుపులోకి తెచ్చుకుని, ఆ తర్వాతే చికిత్సలు చేయించుకోవాలి. 


ఇంచుమించు ఒకే ఫలితం

కంప్యూటర్‌ అసిస్టెడ్‌, నావిగేషన్‌ టెక్నిక్స్‌, రోబోటిక్స్‌.. ఇవి మోకాలి మార్పిడి సర్జరీలో కొత్తగా అనుసరిస్తున్న పద్ధతులు. అయితే ఈ సర్జరీలన్నీ వైద్యుల నైపుణ్యానికి కొంత మేరకు సహాయపడేవే తప్ప, సర్జరీలో వైద్యులకు ప్రత్యామ్నాయాలు కావు. అయితే ఈ ఆధునిక సర్జరీ విధానాలతో, ఎముకలను కత్తిరించడంలో కచ్చితమైన కొలతలను అనుసరించే వెసులుబాటు దొరికింది. సాధారణ సర్జరీతో సక్సెస్‌ రేటు 95% ఉంటే, ఆధునిక సర్జరీలతో సక్సెస్‌ రేటు 97% ఉండవచ్చు. అయితే అనుభవజ్ఞులైన వైద్యులు ఎలాంటి ఆధునిక పద్ధతుల అవసరం లేకుండా, సాధారణ సర్జరీతోనే 97% సక్సెస్‌ను సాధించగలుగుతారు.

మోకీలు మారినా అజాగ్రత్త వద్దు-డాక్టర్‌ జి.శశికాంత్‌

సీనియర్‌ ఆర్థోపెడిక్‌ అండ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, యశోద హాస్పిటల్స్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌

మోకీలు మారినా అజాగ్రత్త వద్దు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.