చేపల కోసమేనీటిని ఆపారా!

ABN , First Publish Date - 2021-12-05T07:39:38+05:30 IST

రిజర్వాయరులో ఉన్న చేపల సంరక్షణ కోసం జరిగిన ప్రయత్నం మోపాడును ముప్పు ముంగిటకు తీసుకెళ్లిందా? అన్న ప్రశ్నకు తాజాగా వెలుగుచూస్తున్న కొన్ని పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

చేపల కోసమేనీటిని ఆపారా!
చేపలు కిందకు వెళ్లకుండా అలుగు వద్ద ఏర్పాటు చేసిన వల

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

రిజర్వాయరులో ఉన్న చేపల సంరక్షణ కోసం జరిగిన ప్రయత్నం మోపాడును ముప్పు ముంగిటకు తీసుకెళ్లిందా? అన్న ప్రశ్నకు తాజాగా వెలుగుచూస్తున్న కొన్ని పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. జిల్లాలో ప్రధానమైన మోపాడుకు నెల్లూరు జిల్లా నుంచి వరద నీరు వచ్చిపడటం, కట్టల నుంచి నీరు లీకేజీతో ప్రమాదం నెలకొనటం, ఆయకట్టు గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొంది. రోజులు గడుస్తున్నా ఇంకా ప్రమాదం వీడలేదు. లీకేజీ ఆగలేదు. నివారణకు అఽధికారులు చేస్తున్న ప్రయత్నంలో ఒక్క శాతం కూడా సఫలీకృతం కాలేదు. అయితే దక్షిణాంధ్రాకు రెండో వాయుగుండం ముప్పు తప్పటం, నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు తగ్గటంతో మోపాడు రిజర్వాయర్‌కు వచ్చేనీటి ఉధృతి తగ్గింది. తదనుగుణంగా తాత్కాలికంగా ప్రమాదం తప్పినట్లుగానే భావిస్తున్నారు. అయితే లీకేజీలను అరికట్టడంలో యంత్రాంగం విఫలమైంది. పాలకులు కానీ, అధికారులు కానీ ఆవైపు వెళ్లి పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించ లేదు. యంత్రాంగం కూడా  అలుగుకు గండికొట్టడంతో పాటు కాలువ తవ్వి బయటకు వెళ్లే నీటి ప్రవాహాన్ని పెంచ గలిగారు.  అయినా రిజర్వాయర్‌లో ఇప్పటికి 29 అడుగులు నిల్వ ఉండటం, లీకేజీలు ఆగకపోవటంతో ముప్పు ఇంకా పొంచి ఉన్నట్లే భావించాలి.

చేపల పెంపకంలో భారీ ఆదాయం

ఈ నేపథ్యంలో సమస్యను లోతుగా అధ్యయనం చేస్తే రిజర్వాయర్‌లో ఉన్న చేపల విక్రయం ద్వారా లబ్ధిపొందే అఽధికార పార్టీ నేతల ఒత్తిడితో నీటి విడుదలకు అడ్డుకట్ట వేయటం వలనే సమస్య తీవ్రమైనట్లుగా భావిస్తున్నారు. 1996లో ఇలానే మోపాడుకు భారీగా నీరుచేరింది. దీంతో కట్ట తెగిందని భావించి మోపాడు ప్రజలు ప్రధానంగా ఎస్సీ కాలనీ ప్రజలు అర్ధరాత్రి పరుగులు పెట్టారు. అలుగు దాటుతూ పలువురు నీటిప్రవాహానికి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఆ తర్వాత ఈ చెరువు నీటిని సాగుకు వాడకుండా చేపల పెంపకానికే ప్రాధాన్యం ఇచ్చారు. నుచ్చుపొద మత్స్యకారుల సహకార సొసైటీకి చేపల పెంపకం అఽధికారాన్ని ప్రభుత్వం ఇచ్చింది. క్రమేపీ ఈ చేపల పెంపకం వ్యవహారం రాజకీయ నాయకులకు ఆదాయ వనరుగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఒకసారి చెరువులో చేపలు పట్టుకుని లబ్ధిపొందారు. తదనంతరం ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. అయితే 2018 ప్రాంతంలో అప్పట్లో స్ధానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు చేపల పెంపకాన్ని ప్రారంభించారు. అవి పెరిగి పెద్దవయ్యేసరికి అఽధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు వాటిని అమ్ముకుని లబ్ధిపొందారు. తిరిగి మరోసారి కూడా సొసైటీకి సంబంధం లేకుండా చెరువులో చేపలను విక్రయించుకుని లబ్ధిపొందారు. ఆ విషయంలో అధికారపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఆర్థికంగా సొమ్ము చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చేపలు వెళ్లిపోతాయనే.. 

ప్రస్తుతం కూడా మోపాడులో చేపల పెంపకం ఉంది. 23అడుగుల వరకు రిజర్వాయర్‌లో నీరున్నా చేపలకు ఇబ్బంది లేదు. ఆపై క్రమేపి నీరు పెరగడం, ఆ నీటిని విడుదల చేస్తే చేపలు కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉండటంతో ప్రధాన తూము వద్ద నీటితోపాటు చేపలు బయటకు వెళ్లకుండా ఇనుప చువ్వలతో మెష్‌లను పెంపకందార్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తూము ద్వారా నీరు పూర్తిగా బయటకు రావటం మందగించింది. దాన్ని తొలిగించే సాహసం చేసేందుకు స్థానిక అధికారులు ముందుకొచ్చినా అఽధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిలువరించినట్లు సమాచారం. దీంతో కట్టకు ఐదుప్రాంతాల్లో లీకులు ఏర్పాడ్డాయని భావిస్తు న్నారు. తొలిరోజు రిజర్వాయరు ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న మీడియాను, విపక్ష పార్టీల వారిని ఆ తూము వైపు వెళ్లకుండా అడ్డు కున్నారు. ఈ విషయంలో పామూరు ఎస్సై కీలక పాత్ర పోషించారు. తూము వైపు చేపల సంరక్షణ కోసం చేసిన ఏర్పాట్లు చూడకుండా ఉండేందుకు అలాంటి ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. అనంతరం పరిస్థితి చేయిదాటడంతో జిల్లా అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. అయినా శాశ్వత పరిష్కారం లభించలేదు. 

Updated Date - 2021-12-05T07:39:38+05:30 IST