మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు

ABN , First Publish Date - 2022-07-02T05:00:36+05:30 IST

రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దని, ముఖ్యంగా దుక్కిలో వేసే డీఏపీ వంటి ఎరువులు మోతాదుకు మించి వేయడం వల్ల గాలి, నీరు కాలుష్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ అన్నారు.

మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దు
ఇబ్రహీంపుర్‌లో రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు, శాస్త్రవేత్తలు

జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌

నారాయణరావుపేట, జూలై 1: రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడొద్దని, ముఖ్యంగా దుక్కిలో వేసే డీఏపీ వంటి ఎరువులు మోతాదుకు మించి వేయడం వల్ల గాలి, నీరు కాలుష్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపుర్‌ గ్రామంలో పాస్పో బ్యాక్టీరియా ఎరువుల వాడకం, నేల సంరక్షణపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుక్కిలో అధిక మోతాదులో రసాయన ఎరువులు వేయడం వల్ల నేలలో అవసరానికి మించి భాస్వరం నిల్వలు పెరిగిపోయాయని చెప్పారు. భూమిలో సేంద్రియ కర్బన పదార్థాలు తగ్గిపోయి పంటలకు మేలు చేసేటువంటి సూక్ష్మ జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి భూసారం దెబ్బతినడంతో పాటు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ రూపేణా రూ.65 వేల కోట్లు ఖర్చు పెడుతున్నదన్నారు. వానాకాలంలో ఇబ్రహీంపూర్‌లో రైతులు సుమారు 400 ఎకరాల్లో జనుము, జీలుగ, పెసర పంటలు సాగుచేస్తూ భూ సారం పెంపొందించేందుకు కృషిచేయడం, సుమారు 200 ఎకరాల్లో భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడుతూ దుక్కిలో వాడే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేయడం అభినందనీయమన్నారు. ఈ వర్షాకాలం నుంచి పంట అవశేషాలను తగల పెట్టకుండా ఉంటామని రైతులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి, మండల వ్యవసాయ అధికారి ప్రకా్‌షగౌడ్‌, సర్పంచ్‌ దేవయ్య, ఏఈవో నాగార్జున్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:00:36+05:30 IST