బయో వ్యర్థాలను బయట పడేయొద్దు

ABN , First Publish Date - 2021-10-24T05:23:50+05:30 IST

బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వంద శాతం అమలు చేయాలని, ఇందుకోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌ అన్నారు.

బయో వ్యర్థాలను బయట పడేయొద్దు

  1. వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా జరగాలి
  2. జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌ 


కర్నూలు(కలెక్టరేట్‌), అక్టోబరు 23: బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వంద శాతం అమలు చేయాలని, ఇందుకోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణ కృపాసాగర్‌ అన్నారు. కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పాన్‌ ఇండియా అవేర్నెస్‌ అండ్‌ ఔట్‌ రీచ్‌ ప్రోగ్రాం శనివారం జరిగింది. జిల్లా జడ్జి మాట్లాడుతూ బయోమెడికల్‌ వేస్ట్‌ను చాలా ఆసుపత్రులు ఎక్కడపడితే అక్కడ పడవేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. జిల్లాలో లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చాలా బాగా పని చేస్తోందన్నారు. బయో వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేందుకు బార్‌ కోడింగ్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజంలో ప్లాస్టిక్‌ వినియోగం మోతాదుకు మించిపోయిందని, దీనివల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోందని అన్నారు. 


జిల్లాలో బయోమెట్రిక్‌ నిర్వహణ మరింత సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, క్లినికల్‌ ప్రయోగశాలలు, నర్సింగ్‌ హోమ్‌లలో బయో మెడికల్‌ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా బయటకు వస్తున్నాయని, ఇతరులు కూడా టన్నుల కొద్దీ బయోమెడికల్‌ వేస్ట్‌ను జనరేట్‌ చేస్తున్నారని తెలిపారు. కొవిడ్‌ సమయంలో వినియోగించిన మాస్క్‌లను బాధ్యతగా డిస్పోజ్‌ చేయాలని సూచించారు. 


గ్రామీణ ప్రాంతాలో మరణించిన కొన్ని పశువులకు పోస్టుమార్టం చేస్తే.. వాటి శరీరంలో సిరంజన్‌లు లభ్యమయ్యాయని ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి అన్నారు. పశువుల మరణానికి బయోమెడికల్‌ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో పడేయడమే కారణమని దీనిద్వారా తెలుస్తోందన్నారు. బయో వ్యర్థాలు పడేసినచోట మొలిచిన గడ్డిని పశువుల తింటున్నాయని, ఈ నేపథ్యంలో సిరంజిలు కూడా పశువుల కడుపులోకి వెళుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా బయో మెడికల్‌ వ్యర్థాలను పద్ధతి ప్రకారమే పడేయాలని సూచించారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


 కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాస్‌ రావు, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం.సుబ్బయ్య, డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్య, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ మునిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:23:50+05:30 IST