మా సహనాన్ని పరీక్షించొద్దు

ABN , First Publish Date - 2021-09-07T06:43:20+05:30 IST

వివిధ ట్రైబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల పదవులకు నియామకాలు

మా సహనాన్ని పరీక్షించొద్దు

  • నియామకాలు చేపట్టకుండా ట్రైబ్యునళ్లను నాశనం చేస్తారా?
  • కోర్టు తీర్పులంటే గౌరవమే లేదు
  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • మా తీర్పునకు వ్యతిరేకంగా చట్టమా?
  • ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవడం లేదు
  • కానీ ట్రైబ్యునళ్లు పతనావస్థలో ఉన్నాయ్‌
  • ఎందుకు నియామకాలు జరపరు?
  • 13వ తేదీలోగా భర్తీచేయాల్సిందే
  • ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ


ప్రభుత్వంతో మేం ఘర్షణ కోరుకోవడం లేదు. ఎందుకంటే తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడంపై మేం సంతోషంగా ఉన్నాం. కానీ ట్రైబ్యునళ్లకు నియా మకాలు చేపట్టకుండా మీరెందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.

- చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వివిధ ట్రైబ్యునళ్ల చైర్‌పర్సన్లు, సభ్యుల పదవులకు నియామకాలు చేపట్టనందుకు కేంద్రంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. కోర్టు తీర్పులంటే గౌరవం లేకుండా వ్యవహరిస్తోందని.. తమ సహనాన్ని పరీక్షిస్తోందని ఆక్షేపించింది. ఈ నెల 13వ తేదీలోగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. సెంట్రల్‌ గూడ్స్‌-సర్వీసెస్‌ ట్యాక్స్‌ (సీజీఎ్‌సటీ) ట్రైబ్యునల్‌ ఏర్పాటు, సాయుధ దళాల ట్రైబ్యునల్‌ (ఏఎ్‌ఫటీ), జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తదితర కీలక ట్రైబ్యునళ్లలో నియామకాల కోసం దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.


చైర్‌పర్సన్లు, సాంకేతిక సభ్యులను నియమించకపోవడం ద్వారా ట్రైబ్యునళ్లను కేంద్రం క్షీణింపజేస్తోందని, 250 పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా కోరగా చీఫ్‌ జస్టిస్‌ తిరస్కరించారు. ఏజీ రావలసిన అవసరమే లేదన్నారు.




‘వాయిదా వేసే ప్రసక్తే లేదు. కిందటిసారే ఇది స్పష్టం చేశాం. ట్రైబ్యునళ్ల అంశంపై ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులతో కలిపి ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేశాం. ఈ కోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదని మేం అభిప్రాయపడుతున్నాం. మా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. గత విచారణ సమయంలో కొందరిని నియమించామని చెప్పారు. ఎక్కడ?’ అని ప్రశ్నించారు.


కొత్త ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం నిబంధనలకు అనుగుణంగా సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునళ్లలో ఈ నియామకాలు జరిగాయని మెహతా బదులిచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ తనకు రాసిన లేఖను సమర్పించారు. కమిటీల సిఫారసులపై కేంద్రం రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ నెల 13వ తేదీలోగా నియామకాలు జరిగి తీరాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను అప్పటికి వాయిదా వేసింది.


ఇవే మా ఆప్షన్లు..

కోర్టు తీర్పును కేంద్రం గౌరవిస్తున్నట్లుగా లేదని చీఫ్‌ జస్టిస్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తమ ముందు మూడే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. ‘ఒకటి.. మీరు తెచ్చిన చట్టంపై స్టే ఇచ్చి నియామకాలు కొనసాగించాలని ఆదేశాలివ్వడం; రెండోది.. ఈ ట్రైబ్యునళ్లన్నిటినీ మూసివేసి వాటి అధికారాలను హైకోర్టులకివ్వడం; మూడోది.. మేమే స్వయంగా నియామకాలు చేపట్టి, కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడం. అయితే ప్రభుత్వంతో మేం ఘర్షణ కోరుకోవడం లేదు. 9మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడంపై మేం సంతోషంగా ఉన్నాం. కానీ ఈ ట్రైబ్యునళ్ల మాటేంటి? ఎన్‌జీటీ, క్యాట్‌, వినియోగదారుల కమిషన్లు, ఎన్‌సీఎల్‌టీ చాలా మంచి ధర్మాసనాలు. కానీ వాటికి చైర్‌పర్సన్లు లేరు.. అధ్యక్షులు లేరు. కొన్ని ట్రైబ్యునళ్లు ఒక సభ్యుడితోనే నడుస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.


న్యాయమూర్తుల సారథ్యంలోని కొన్ని ఎంపిక ప్యానెళ్లు 18 నెలల కింద నాటి చట్టాలకు అనుగుణంగా పేర్లు సిఫారసు చేశాయని.. వాటిపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉండాల్సిన పనే లేదని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తెలిపారు. టీడీశాట్‌లో నియామకాల కోసం ఏడాదిన్నర కింద 55 మందిని రెండు రోజులపాటు ఇంటర్వ్యూ చేసి సిఫారసులు చేశామని, కానీ నియామకాలు చేపట్టకుండా ట్రైబ్యునళ్లను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఏఎ్‌ఫటీ, ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఏఎల్‌టీ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని జస్టిస్‌ చంద్రచూడ్‌ గుర్తుచేశారు. కార్పొరేట్‌ రంగ సమస్యలను 330 రోజుల్లో పరిష్కరించాలన్న నిబంధన ఉందని, లేని పక్షంలో లిక్విడేషన్‌కు వెళ్లాలన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉందని ఆయన గుర్తుచేశారు.


చీఫ్‌ జస్టిస్‌ రమణ ఈ సమయంలో ఎన్‌సీఎల్‌టీ అంశాన్ని ప్రస్తావించారు. దీని ఎంపిక ప్యానెల్లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి కూడా ఉన్నారని.. వారికి ఆ ఇద్దరు న్యాయమూర్తులపై విశ్వాసం లేనట్లుగా ఉందని పేర్కొన్నారు. సీజీఎ్‌సటీ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుకు నిరాకరించింది.



మా తీర్పునకు వ్యతిరేకంగా చట్టమా?

ట్రైబ్యునల్‌ సంస్కరణల చట్టం-2021 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ సహా ఇతర పిటిషన్లపై కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఆర్థిక శాఖ లేఖను జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.


‘మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌-2, 3 కేసుల్లో సుప్రీంకోర్టు కొట్టివేసిన నిబంధనలన్నీ 2021 చట్టం లో ఉన్నాయి. అటార్నీ జనరల్‌ సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆ తీర్పు ఇచ్చానని జస్టిస్‌ నాగేశ్వరరావు నాకు చెప్పారు. అయునా ఆ తీర్పును  ప్రభుత్వం గౌరవించలేదు. ఏమిటిది? ఆ చట్టంలోని 3(1), 3(7), 14, 7(1) సెక్షన్లు మా తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయి. 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు చైర్‌పర్సన్‌/సభ్యుడి నియామకానికి అనర్హుడన్నారు. సెలక్షన్‌ కమిటీ రెండు పేర్లు సిఫారసు చేయాలి. వాటిపై ప్రభుత్వం 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. చైర్‌పర్సన్‌, సభ్యుల పదవీకాలం నాలుగేళ్లుగా నిర్ణయించడం. చైర్‌పర్సన్‌ భత్యాలు కేంద్ర ప్రభుత్వాధికారితో సమానమనడం.. ఇవన్నీ మా తీర్పునకు విరుద్ధమే’ అని స్పష్టం చేశారు. వచ్చేవారానికి వాయిదా వేస్తున్నామని.. ఆలోగా నియామకాలు జరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు.


Updated Date - 2021-09-07T06:43:20+05:30 IST