పెండింగ్‌ జీతాలివ్వకపోగా విధుల్లోకీ తీసుకోరా?

ABN , First Publish Date - 2022-01-22T06:42:27+05:30 IST

‘కొవిడ్‌ రెండో వేవ్‌లో మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాం. అయినా ఆరు నెలల జీతాలివ్వలేదు. ఇపుడేమో మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా కొత్తవారిని నియమించుకోవడం అన్యాయం’ అంటూ తిరుచానూరు సమీపంలోని పద్మావ

పెండింగ్‌ జీతాలివ్వకపోగా విధుల్లోకీ తీసుకోరా?
నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు


పద్మావతి నిలయం వద్ద పారిశుధ్య కార్మికుల నిరసన

తిరుపతి సిటీ, జనవరి 21: ‘కొవిడ్‌ రెండో వేవ్‌లో మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాం. అయినా ఆరు నెలల జీతాలివ్వలేదు. ఇపుడేమో మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా కొత్తవారిని నియమించుకోవడం అన్యాయం’ అంటూ తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయంలో ఉన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఎదుట పారిశుధ్య కార్మికులు శుక్రవారం నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ.. రెండో వేవ్‌లో 152 మంది ఆరు నెలల పాటు ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేశారని చెప్పారు. ఆ తర్వాత కొవిడ్‌ కేంద్రాన్ని మూసేయడంతో జీతాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నామని వాపోయారు. ప్రస్తుతం మూడోవేవ్‌ ప్రారంభం కావడంతో తిరిగి కొవిడ్‌ కేంద్రాన్ని ప్రారంభించారని.. అయితే తమను విధుల్లోకి తీసుకోకుండా కొత్త వారిని నియమించుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. అందువల్లే కొవిడ్‌ కేంద్రం ముందు బైఠాయించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా విధులకు వచ్చిన కార్మికులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కొవిడ్‌ కేంద్రం నోడల్‌ అధికారి లక్ష్మి, తిరుచానూరు పోలీసులు అక్కడకు చేరుకుని కార్మికులకు సర్దిచెప్పారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి, రెండువారాల్లో పెండింగ్‌లోని జీతాలను ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాతవారినే విధుల్లోకి తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్మికులకు ఏఐటీయూసీ నాయకులు మద్దతుగా నిలిచారు. 


Updated Date - 2022-01-22T06:42:27+05:30 IST