ఆశల దీపాన్ని ఆర్పేయకండి!

ABN , First Publish Date - 2020-06-16T05:30:00+05:30 IST

యాక్టింగ్‌ కెరీర్‌ విజయవంతంగా సాగుతోంది. ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు అంతకంటే లేవు.అయినా మానసిక కుంగుబాటు అతణ్ణి కమ్మేసింది. హిందీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం... చనిపోవాలనే నిర్ణయం వెనకున్న... అంతుబట్టని కోణాలను విశ్లేషించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తోంది...

ఆశల దీపాన్ని ఆర్పేయకండి!

యాక్టింగ్‌ కెరీర్‌ విజయవంతంగా సాగుతోంది. ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు అంతకంటే లేవు.అయినా మానసిక కుంగుబాటు అతణ్ణి కమ్మేసింది. హిందీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం... చనిపోవాలనే నిర్ణయం వెనకున్న... అంతుబట్టని కోణాలను విశ్లేషించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ఆత్మహత్య కారణాలు, ముందుగానే కనిపెట్టి నియంత్రించే మార్గాల గురించి మానసిక నిపుణులు ఏమంటున్నారంటే.... 


‘‘నేను ఇప్పటికే దారుణమైన పరిణామంలో ఉన్నాను. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. దీనికి మరణం ఒక్కటే పరిష్కారం’’ అనే  స్థితికి లోను చేసేదే మానసిక కుంగుబాటు. ఈ స్థితికి లోనయ్యేవాళ్లు ‘ఆత్మహత్యే అన్నిటికంటే దారుణమైన పరిణామం’ అనే వాస్తవాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఆ విశ్లేషణాశక్తిని కోల్పోయే స్థితిలోకి నెట్టేసేదే డిప్రెషన్‌. వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, ప్రేమ వైఫల్యాలు, లాక్‌డౌన్‌ కారణంగా నెలకొనే ఆర్థిక సమస్యలు, కెరీర్‌ భయాలు... ఇలా కారణం ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో, గతంలో జరిగిన ఓ దురదృష్టకరమైన సంఘటన తాలూకు జ్ఞాపకాన్ని, తాజాగా ఎదురైన ఓ సంఘటన రేపి ఉండవచ్చు. అలా మొలకెత్తిన డిప్రెషన్‌ క్రమేపీ పెరుగుతూ ఉండి ఉండవచ్చు. ఫలితంగా తక్కువ సమయంలోనే తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి కూరుకుపోవచ్చు. కారణం ఏదైనా డిప్రెషన్‌ను బాధితులు, వారి సన్నిహితులు సకాలంలో గుర్తించి జాగ్రత్తపడకపోతే, అది అంతిమంగా ఆత్మహత్యగా పరిణామం చెందే ప్రమాదం ఉంది. కుంగుబాటు బయల్పడే తీరు ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. 




మానసిక ప్రశాంతతకు ఫార్ములా?

కొన్ని ఆత్మహత్యలను గమనిస్తే, ఆత్మహత్యకు పాల్పడవలసినంత బలమైన కారణాలు కనిపించవు. ‘అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు?’ అని ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. కానీ మనం భావించేవేవీ, సంతోషంగా బతకడానికి కారణాలుగా వారికి అనిపించి ఉండకపోవచ్చు. బహుశా వారి దృష్టిలో ఆనందంగా జీవించడానికి మరేవో ఇతర అంశాలు కారణాలుగా ఉండి ఉండవచ్చు. మానసిక ప్రశాంతత ఫార్ములా, ప్రతి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. ‘ఏం చేసినా మానసిక ప్రశాంతత చేకూరదు’ అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చే వారు ఆత్మహత్యకు పాల్పడే మొత్తం సంఖ్యలో, 10ు ఉంటారు. తీవ్రమైన మానసిక కుంగుబాటులో కూరుకుపోయి, విశ్లేషణాశక్తిని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్లందరూ ఈ 10శాతం కోవలోకే వస్తారు. 


క్షణికావేశమా? దీర్ఘకాల నిర్ణయమా?

ఆత్మహత్యల్లో రెండు రకాలుంటాయి. అప్పటికప్పుడు క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలకు (ఇంపల్సివ్‌ సూసైడ్‌) పాల్పడేవాళ్లు ఉంటారు. లేదంటే దీర్ఘకాలం ఆలోచించి, కచ్చితమైన ప్రణాళిక రచించి, ప్లాన్‌డ్‌ సూసైడ్‌లకు పాల్పడేవారూ ఉంటారు. మొదటి కోవకు చెందిన వారి ఆత్మహత్యలకు కారణం పగ, ప్రతీకారం కావచ్చు. ఎవరినో తప్పు పట్టడం,  అపరాధభావానికి లోను చేయడమూ కావచ్చు. వీళ్లు ఆ ప్రయత్నానికి ముందు సూసైడ్‌ నోట్‌ కూడా రాస్తూ ఉంటారు. ఇలాంటి వారు పాల్పడే ఆత్మహత్యా ప్రయత్నాలు ఎక్కువ శాతం ఫెయిల్‌ అవుతూ ఉంటాయి. నిజానికి భయపెట్టడానికో, బెదిరించడానికో ఇలాంటివారు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవి శ్రుతిమించి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇక ప్లాన్‌డ్‌ సూయిసైడ్‌ కోవకు చెందినవారు ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఆత్మహత్యలకు పాల్పడతారు. మొదటి ప్రయత్నంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ కోవకు చెందిన వారికి ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకోవడమే లక్ష్యం కాబట్టి, ఎవరికీ ఎటువంటి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదనే భావనతో, సూసైడ్‌ నోట్‌లు కూడా రాయరు. 


ఆలోచించాలి, చర్చించాలి!

మానసిక కుంగుబాటు... బాధితుల్లో 80ు, ఎదుటివారికి 20ు బహిర్గతం కావాలి. అప్పుడే బాధితుడు సన్నిహితులతో తన బాధలను వ్యక్తపరుస్తాడు. కొందరు తెలివైన బాధితులు బయటకు కనిపించవలసిన 20శాతం డిప్రెషన్‌ను చాకచక్యంగా దాచిపెడతారు. ఇలాంటి సందర్భాల్లో చాప కింద నీరులా పాకిపోయే డిప్రెషన్‌, అంతిమంగా వారిని బలిగొంటుంది. ఆత్మీయులతో మనసులోని బాధలను పంచుకుంటే, 80శాతం డిప్రెషన్‌ దూరమవుతుంది. కాబట్టి బాధలను పంచుకోవాలి. కుంగుబాటుకు కారణాలను వ్యక్తపరచాలి. అణచిపెట్టుకున్న ఉద్వేగాలను వెళ్లగక్కాలి. బాధలను విన్నవాళ్లు, సాధ్యమైనంత మేరకు ఉత్సాహపరిచే ప్రయత్నం చేయాలి. ‘ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావా?’ అని సూటిగా అడగకుండా, ‘ఏ విషయం గురించి అయినా బాధపడుతున్నావా?’ అని అనునయంగా అడగాలి. అతని బాధలను పంచుకుంటాననే భరోసా ఇవ్వాలి. అవసరాన్ని బట్టి మానసిక వైద్యుల చేత చికిత్స ఇప్పించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మహత్యకు దారి తీసే, లక్షణాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. 


మనసుకు మేకప్‌ వేస్తారు!

ఆత్మహత్యకూ, విజయవంతంగా సాగే జీవితానికీ సంబంధం లేదు అనే విషయాన్ని సుశాంత్‌ ఆత్మహత్య నిరూపిస్తోంది. సుశాంత్‌లా విజయవంతమైన కెరీర్‌ కలిగినవాళ్లు, ఉన్నతంగానే జీవిస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంటుంది. దాంతో మానసిక కుంగుబాటుకు లోనైనా ఆ ఛాయలు ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. తమ విలువ తరిగిపోతుందనే భయం, వారిని అలా ప్రవర్తించేలా చేస్తుంది. దాంతో ఎంతగా కుంగుబాటుకు లోనైనా, సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు.


బయల్పడే లక్షణాలు ఇవే...

ఆత్మహత్యకు ముందు బాధితుల్లో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అతను డిప్రెషన్‌ను దాచడంలో ఎంతటి సిద్ధహస్తుడైనా, కొన్ని లక్షణాలు కచ్చితంగా బయల్పడతాయి. అవేంటంటే....


  1. సరదా సందర్భాల్లో అంతకు ముందు ప్రవర్తనకూ, మానసిక కుంగుబాటుతో ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రవర్తనకూ స్పష్టమైన తేడా ఉంటుంది. నవ్వులో, ముఖకవళికల్లో ఉదాసీనత అస్పష్టంగా వ్యక్తమవుతూ ఉంటుంది.
  2. ఆహారం మీద అయిష్టత ప్రదర్శిస్తూ ఉంటారు.
  3. సాధించిన విజయాల గురించి పొగిడినప్పుడు, ‘ఏముందిలే! ఏం ప్రయోజనం?’ అంటూ పొడిపొడిగా ఉదాసీనతతో కూడిన మాటలు అంటూ ఉంటారు.
  4. ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు.
  5. సామాజిక మాధ్యమాల్లో ఆత్మహత్య ఆలోచనను తెలిపే పోస్ట్‌లను పెడుతూ ఉంటారు.




డిప్రెషన్‌ బలహీనత కాదు!

‘‘డిప్రెషన్‌ పట్ల సామాజిక దృక్పథం మారాలి. మరీ ముఖ్యంగా మన సమాజంలో మానసిక కుంగుబాటుకు లోనయిన వ్యక్తులను చిన్నచూపు చూసే నైజం ఉంది. ఈ ధోరణితో సాధారణ వ్యక్తుల మొదలు, సెలబ్రిటీల వరకూ తమకు డిప్రెషన్‌ ఉంటే, ఆ విషయాన్ని దాచే పరిస్థితి ఉంటోంది. ఈ ధోరణి మారాలి. డిప్రెషన్‌ కూడా మిగతా సాధారణ వ్యాధుల్లాంటిదే! శరీరం జబ్బుపడితే ఎలాగైతే చికిత్స తీసుకుని నయం చేసుకుంటామో, అలాగే మనసు జబ్బుపడినా మానసిక చికిత్సతో తిరిగి పుంజుకోవాలి. మానసిక కుంగుబాటును నిర్లక్ష్యం చేస్తే, అది క్రమేపీ పెరిగిపోయి నిర్లిప్తత, నిరాశానిస్పృహల్లోకి నెట్టేసి, ఆత్మహత్యకు పాల్పడేలా పురిగొల్పుతుంది. కాబట్టి డిప్రెషన్‌ బారిన పడినవాళ్లు, ఆ లక్షణాలను గమనించినవాళ్లు వెంటనే ఆ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నాలు చేయాలి.’’

-డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌, 

లూసిడ్‌ డయగ్నొస్టిక్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2020-06-16T05:30:00+05:30 IST