Jul 8 2021 @ 01:22AM

అక్టోబరు వరకు ఓటీటీకి ఇవ్వకండి..

సునీల్‌ నారంగ్‌ ‘‘నేనూ నిర్మాతనే.  నిర్మాతల బాధలు నాకూ తెలుసు. అయితే, నిర్మాతల కంటే పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఎక్కువ బాధలు పడుతున్నారు’’ అని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ, నిర్మాత సునీల్‌ నారంగ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అధ్యక్షుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘‘అక్టోబర్‌ నెలాఖరు వరకూ ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పటికీ థియేటర్లు తెరుచుకోకుంటే మీ ఇష్టం’’ అన్నారు. తెలంగాణ థియేటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇవాళ మమ్మల్ని (పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు) కిల్‌ చేయడానికి చూస్తున్న ఓటీటీలు... రేపటి రోజున మిమ్మల్ని (నిర్మాతలను) కిల్‌ చేస్తాయి. ‘నారప్ప’ను ఓటీటీకి అమ్మేశారని వింటున్నాం. అటువంటి సినిమాలను థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతి, ఓటీటీలో చూస్తేరాదు. నిర్మాతలకు సింగిల్‌ స్ర్కీన్ల నుంచి వచ్చే షేర్‌ మల్టీప్లెక్స్‌ల నుంచి రాదు. అలాగే, ఓటీటీల నుంచి’’ అన్నారు. సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ ‘‘మా ‘లవ్‌ స్టోరి’కి పది ఆఫర్లు వచ్చినా ఓటీటీకి ఇవ్వలేదు. చిన్న, పెద్ద... నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థియేటర్లు బంద్‌ ఉన్నాయి కాబట్టి ఓటీటీ వేదికలు రూ. 40, 50 కోట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. ఓపెన్‌ అయితే అంత చేయవు’’ అన్నారు. ‘‘థియేటర్లలో విడుదల చేసిన 20 రోజుల తర్వాత ఓటీటీలకు సినిమా ఇస్తే బావుంటుంది. లేదంటే హాళ్లు మూతపడే అవకాశం ఉంది’’ అని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ ఛైర్మన్‌ అభిషేక్‌ నామా అన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.