Aadhaar : ఆధార్‌ కార్డు జెరాక్స్ కాపీల దుర్వినియోగాన్ని అరికట్టడంపై ప్రభుత్వ సలహా

ABN , First Publish Date - 2022-05-29T16:58:11+05:30 IST

ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు

Aadhaar : ఆధార్‌ కార్డు జెరాక్స్ కాపీల దుర్వినియోగాన్ని అరికట్టడంపై ప్రభుత్వ సలహా

న్యూఢిల్లీ : ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్‌డ్ కాపీస్‌ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది. 


‘‘మీ ఆధార్‌ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 


ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు  హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India) నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగించవచ్చునని తెలిపింది. ప్రజలు తమ ఆధార్ కార్డు కాపీని ఇచ్చే ముందు సంబంధిత సంస్థకు ఇటువంటి యూజర్ లైసెన్స్ ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలని చెప్పింది. ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రజలు పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించుకోవద్దని తెలిపింది. ఇంటర్నెట్ కేఫ్‌ల వంటి వాటిలోని కంప్యూటర్ల నుంచి ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవద్దని తెలిపింది. ఒకవేళ ఇటువంటి కంప్యూటర్లను ఉపయోగించినట్లయితే, ఆ ఈ-ఆధార్ కాపీలను ఆ కంప్యూటర్ల నుంచి శాశ్వతంగా డిలీట్ చేసినట్లు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. 


మాస్క్‌డ్ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం :

UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో Download Aadhar ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


- ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.


- ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.


- ఆ తర్వాత Send OTP బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌తో జత చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి.


- ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. పాస్‌వర్డ్ నమోదు చేస్తే కార్డు కనిపిస్తుంది. ఆధార్ కార్డులో మీ పేరు ప్రారంభంలోని మొదటి నాలుగు అక్షరాలను కేపిటల్ లెటర్స్‌లో టైప్ చేసి, మీ పుట్టిన తేదీలోని సంవత్సరాన్ని (నాలుగు అంకెలను) టైప్ చేయాలి. అప్పుడు మాస్క్‌డ్ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది. 



Updated Date - 2022-05-29T16:58:11+05:30 IST