అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దు

ABN , First Publish Date - 2021-06-18T05:09:11+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన ఎంఆర్‌పీ కంటే ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే ఆ డీలర్ల లైసెన్సును రద్దు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఆయన వివిధ మండలాల్లో రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు.

అధిక ధరలకు ఎరువులు విక్రయించొద్దు
అగ్రి ల్యాబ్‌ భవనాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ కమిషనర్‌

పట్టించుకోకుంటే లైసెన్స్‌ రద్దు

వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

చీపురుపల్లి/ నెల్లిమర్ల/ డెంకాడ/ గుర్ల, జూన్‌ 17: ప్రభుత్వం ప్రకటించిన ఎంఆర్‌పీ కంటే ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తే ఆ డీలర్ల లైసెన్సును రద్దు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఆయన వివిధ మండలాల్లో రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. చీపురుపల్లిలో నిర్మాణంలో ఉన్న అగ్రి ల్యాబ్‌ను పరిశీలించి,  రైతులతో మాట్లాడారు. వంగపల్లిపేటకు చెందిన పలువురు రైతులు ఎరువులపై సబ్సిడీని పెంచాలని కమిషనర్‌ను కోరారు. ఎరువుల దుకాణాల వద్ద ధరల పట్టికలు ఉండడం లేదన్నారు. దీనికి స్పందించిన కమిషనర్‌ ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఏఓ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని కొంతమంది రైతులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కమిషనర్‌, పీడీఎస్‌ పథకం అమలులో ఉన్న కారణంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, మరే ఇతర వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనికి బదులు ప్రత్యమ్నాయ పంటలు సాగు చేయడం మంచిదని ఆయన సూచించారు. కమిషనర్‌ వెంట జేసీ కిషోర్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, ఏడీ ఎన్‌వీ వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు. 

నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలను కూడా  కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. వచ్చేనెల 8 నాటికి భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయ సలహామండలి సభ్యులతో మాట్లాడుతూ, మొక్కజొన్న 30శాతం కొనుగోలు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యామ్నాయ పంటలు  వేసుకోవాలని సూచించారు. 

డెంకాడ మండలంలోని సింగవరం రైతు భరోసా కేంద్రాన్ని కూడా వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ గురువారం సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు వ్యవసాయ పనిముట్లు అందించాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

గుర్ల  రైతు భరోసా కేంద్రం నిర్మాణాన్ని కూడా అరుణ్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కౌలు రైతు కార్డులు అందజేశారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 



Updated Date - 2021-06-18T05:09:11+05:30 IST