త్యాగాన్ని గుర్తించరా?

ABN , First Publish Date - 2020-02-20T10:54:28+05:30 IST

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద చెల్లించాల్సిన నష్ట పరిహారం ఎంతనేది నేటీకీ నిర్ధారించలేదు.

త్యాగాన్ని గుర్తించరా?

మార్కాపురం, ఫిబ్రవరి 19: వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద చెల్లించాల్సిన నష్ట పరిహారం ఎంతనేది నేటీకీ నిర్ధారించలేదు. ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారానికి నిర్వాసితులు అంగీకరించడం లేదు.   నిర్వాసిత గ్రామాలలో ఇళ్లకు, పొలాలకు నష్టపరిహారం 2012లో చెల్లించారు. అప్పుడు నివాసం ఉన్న కుటుంబాలు, ప్రస్తుతం నివాసముంటున్న కుటుంబాల సంఖ్య పెరిగింది.


18ఏళ్లు దాటి వివాహాలు జరిగి తల్లిదండ్రుల నుంచి విడిపోయిన కుటుంబాల వారు తమకు ప్రత్యేకంగా ప్యాకేజీ అమలు చేయాలని కోరుతున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు రూ.6.30లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రస్తుతం నిర్వాసితులు రూ.10లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. 2005లో అన్నీ గ్రామాల్లో 5000 కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ అంచనాలు జరిగిన ఇప్పటికి 14ఏళ్లు గడిచాయి. నిర్వాసిత కుటుంబాల సంఖ్య పెరిగింది. 18ఏళ్లు దాటి పెళ్లి జరిగి తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారున్నారు. అలా కొత్తగా ఏర్పడ్డ కు టుంబాలు 2వేల వర కూ ఉన్నాయి. అధికారులు తిరిగి సర్వే చేయించి విడిపోయిన వారికి కూడా నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు.


పురోగతిలేని  పునరావాసం

గొట్టిపడియ డ్యాం ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తాండ నిర్వాసితులకు మార్కాపురం మండలం వేములకోట సమీపంలో 83ఎకరాల స్థలం కేటాయించారు. రెండు గ్రామాలకు చెందిన 960కుటుంబాలకు అక్కడ ఇళ్లు నిర్మించాల్సి వుంది. కానీ ఎటువంటి పనులు మొదలు కాలేదు.  

సుంకేసుల డ్యాంపు ముంపుగ్రామమైన కలనూతలకు మార్కాపురం మండలం ఇడుపూరు పరిధిలో రెండు కాలనీలను ఏర్పాటుచేశారు. ఒక్కో కాలనీలో 80కుటుంబాల చొప్పున రెండు కాలనీలలో 160 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. రెండు కాలనీలలో రోడ్లు, గుడి, పంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, వైద్యశాల వంటి మౌలిక వసతులు కల్పించారు. కానీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. 

సుంకేసుల డ్యాం ముంపుగ్రామమైన సుంకేసుల, చింతలముడిపి నిర్వాసితులకు పెద్దారవీడు మండలం తోకపల్లి, మార్కాపురం మండలం గోగులదిన్నె సమీపంలో నిర్వాసిత కాలనీలను కేటాయించారు. రెండు కాలనీలలో మౌ లిక వసతుల అభివృద్ధి జరిగింది. ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. 


గుండంచర్ల నిర్వాసితులకు స్థలసేకరణ సమస్య

గుండంచర్ల నిర్వాసితులకు స్థలసేకరణ సమస్య వెంటాడుతోంది. మార్కాపురం మండలం ఇడుపూరు ఇలాకాలో ప్రభు త్వం స్థలం సేకరించేందుకు నిర్ణయించింది. అయితే నిర్వాసితులలో ఒకవర్గం పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద స్థలాలు ఇవ్వాలని కోరుతుండగా, మరొకవర్గం ఇడుపూరు వద్ద కావాలని కోరుతుంది. దీంతో నేటికీ స్థల సేకరణ జరగలేదు.

Updated Date - 2020-02-20T10:54:28+05:30 IST