రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

ABN , First Publish Date - 2022-05-27T06:17:19+05:30 IST

‘దేశానికి వెన్నెముక రైతు.. ఈ దేశం వెన్నెముక విరుగుతోంది. ప్రభుత్వాలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు’ అని సినీ నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి అన్నారు.

రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా..

స్వామినాథన సిఫార్సులను అమలు చేయాలి

సినీ నటుడు 

ఆర్‌ నారాయణ మూర్తి

అనంతపురం కల్చరల్‌, మే 26: ‘దేశానికి వెన్నెముక రైతు.. ఈ దేశం వెన్నెముక విరుగుతోంది. ప్రభుత్వాలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు’ అని సినీ నటుడు, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎంఎస్‌ స్వామినాథన సిఫారసులను వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలకు ఆయన గురువారం హాజరయ్యారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో లలితకళా పరిషత, ప్రజానాట్యమండలి సంయుక్తంగా సాంస్కృతికోత్సవాలను నిర్వహించాయి. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2006కు ముందు దేశంలో 3.5 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సమస్య పరిష్కారానికి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన కమిటీని వేసిందని అన్నారు. సేద్యానికి రైతులు పెట్టిన పెట్టుబడి, కౌలు, వడ్డీ, శ్రమకు అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు ఇస్తేనే రైతు ఆత్మహత్యలు ఆగుతాయని స్వామినాథన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. ప్రపంచంలో ప్రతి వ్యాపారీ తమ ఉత్పత్తులకు అమ్మకం ధర నిర్ణయిస్తారని, కానీ మన దేశంలో రైతు తాను పండించే పంటకు ధర నిర్ణయించుకోలేని దుస్థితిలో ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తోందని, ఇందులో భాగంగానే కార్మిక, రైతు హక్కులు కాలరాస్తున్నారని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అదాని, అంబానీ వంటి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నట్లే, వ్యవసాయం కూడా వారి చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం కార్పొరేట్‌పరమైతే, దేశంలో రైతు కనుమరుగయ్యే దుర్గతి పడుతుందని హెచ్చరించారు. దేశంలో ఎప్పటికీ రైతే రాజుగా ఉండాలంటే ఎంఎస్‌ స్వామినాథన సిఫారసులను అమలుచేసి తీరాలని అన్నారు.


మహనీయులు పుట్టిన గడ్డ..

తరిమెల నాగిరెడ్డి, పరిటాల శ్రీరాములు, నీలం రాజశేఖర్‌ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, బళ్లారి రాఘవ, పప్పూరు రామాచార్యులు వంటి ఎందరో మహనీయులు పుట్టినగడ్డ అనంతపురం జిల్లా అని నారాయణమూర్తి కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా’ పాట పాడి ఉత్తేజపరిచారు. మహాసభల నేపథ్యంలో ఈనెల 1న కేఎ్‌సఆర్‌ కళాశాలలో నిర్వహించిన వ్యవసాయ డ్రాయింగ్‌, కథల పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో లలితకళాపరిషత కార్యదర్శి పద్మజ, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంభూపాల్‌, ప్రజానాట్యమండలి నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, కృష్ణవేణి, పుల్లన్న, మహేష్‌, ఎర్రిస్వామి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-05-27T06:17:19+05:30 IST