ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2022-05-18T06:21:02+05:30 IST

వెలగలేరు జగనన్న కాలనీ లేఅవుట్‌లో లబ్ధిదారులు గృహా నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం చూపకుండా, త్వరగా ప్రారంభించేలా వారిలో చైతన్యం తీసుకురావాలి కలెక్టర్‌ దిల్లీరావు అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దు
లే అవుట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్నదిల్లీరావు కలెక్టర్‌ దిల్లీరావు

 లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకురావాలి

 అధికారులకు కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశం

జి.కొండూరు, మే 17: వెలగలేరు జగనన్న కాలనీ లేఅవుట్‌లో లబ్ధిదారులు గృహా నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం చూపకుండా, త్వరగా ప్రారంభించేలా వారిలో చైతన్యం తీసుకురావాలి కలెక్టర్‌ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. లే అవుట్‌లో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. నివేశన స్థలంతోపాటు ఇంటిని కూడా మంజూరు చేసిందన్నారు. వెలగలేరులో 180 ఎకరాల్లో 9,500 మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలను మంజూరుచేయగా వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవరానికి చెందిన 7,500 మంది, తూర్పు నియోజకవర్గానికి చెందిన రెండు వేల మంది ఉన్నారన్నారు. అయితే కేవలం మూడు వేల ప్లాట్లను మాత్రమే సిద్ధం చేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.  సత్వరమే మిగిలిన ప్లాట్లను సిద్ధం చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. 223 మంది లబ్ధిదారులకు డ్వాక్రా గ్రూపు నుంచి ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.35 వేలు అందజేస్తున్నా కేవలం 66 మంది మాత్రమే పునాదులు తీసి పనులు ప్రారంభించారన్నారు.  నెలాఖరుకల్లా మరి కొంత మంది పనులు ప్రారంభించేలా అవగాహన కల్పించాలన్నారు. వెలగలేరు సచివాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఇంతియాజ్‌పాషా, ఎంపీడీవో  పి.అనురాధ, హౌసింగ్‌ ఏఈ బి.ఎస్‌.ఎస్‌.సత్యనారాయణ, వీఎంసీ డీఈ డి.నిరీక్షణరావు, ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ, కాజ బ్రహ్మయ్య, నెల్లూరు లీలా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-18T06:21:02+05:30 IST