విలీనం వద్దే వద్దు!

ABN , First Publish Date - 2022-08-18T05:49:49+05:30 IST

అనంతపురం నగరంలోని శ్రీనివాసనగర్‌ నగర పాలక ప్రాథమిక పాఠశాల, చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాఠశాలను దూరంగా ఉన్న కొత్తూరు ఉన్నత పాఠశాలకు మ్యాప్‌ చేశారు.

విలీనం వద్దే వద్దు!
అనంతపురం నగరంలోని శ్రీనివాసనగర్‌ నగర పాలక ప్రాథమిక పాఠశాల, చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాఠశాలను దూరంగా ఉన్న కొత్తూరు ఉన్నత పాఠశాలకు మ్యాప్‌ చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అర్బన ఎమ్మెల్యే ప్రభుత్వానికి అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు.

జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు

రద్దు కోసం ప్రభుత్వానికి ఎమ్మెల్యేల లేఖలు

అభ్యంతరాలపై జిల్లా కమిటీ విచారణ పూర్తి

పాఠశాల విద్యాశాఖకు చేరిన నివేదిక

గుండిగానిపల్లి బడి నుంచి విద్యార్థులను తీసుకెళ్లిన తల్లిదండ్రులు



అనంతపురం విద్య  : పాఠశాలల విలీనం దుమారం కొనసాగుతోంది. దీని ప్రస్థావన రాగానే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం ముందుకెళ్లింది. పాఠశాలల పునఃప్రారంభం తరువాత విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతా ల్లో ఇప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. దీంతో ఇంటి నుంచి కొన్ని కి.మీ. దూరం చిన్నారులు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువశాతం పేద కుటుంబాల విద్యార్థులే ఉంటున్నారు. వీరి తల్లిదండ్రులు రోజూ ఏదో ఓ పనికి ఉదయాన్నే వెళ్లి సాయంత్రం, రాత్రికిగాని తిరిగి ఇంటికి చేరుకోలేరు. ఈ కారణంగా బడికి వెళ్లే తమ బిడ్డల భద్రత, ప్రయాణ ఇబ్బందుల గురించి ఆందోళన చెందుతున్నారు. విలీనాన్ని వ్యతిరేకించడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే అధికారులు, ప్రజా ప్రతినిధులకు బడిని కొనసాగించేలా చూడాలని విన్నవిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం విలీనంపై అభ్యంతరాలు తెలిపారు. జిల్లాలో ఏకంగా 32  స్కూళ్ల విలీనం వద్దని ప్రభుత్వానికి లేఖలు రాశారు. మరో 50 స్కూళ్ల విలీనం ఆపాలని ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై జిల్లా స్థాయి కమిటీతో విచారణ చేయించారు. ఈ కమిటీ పాఠశాల విద్యాశాఖకు నివేదిక పంపినట్లు సమాచారం.


వీటిపై అభ్యంతరాలు...

-జిల్లాలో 32 స్కూళ్లను విలీనం చేయవద్దని ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లేఖలు రాశారు. తల్లిదండ్రులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అనంతపురం నియోజకవర్గంలో తాటిచెర్ల, తపోవనం, సిండికేట్‌నగర్‌, ఆలమూరు, విన్సెంట్‌ ఫెర్రర్‌ నగర్‌, రుద్రంపేట, పాపంపేట, కందుకూరు, చియ్యేడు ఎంపీపీఎస్‌   పాఠశాలల విలీనాన్ని ఆపాలని కోరారు. అనంతపురం నగరంలోని రాణినగర్‌ ప్రాథమిక పాఠశాల, కేఎ్‌సఆర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శ్రీనివా్‌సనగర్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల, చంద్రశేఖర్‌ ఆజాద్‌ మున్సిపల్‌ స్కూల్స్‌ను సమీపంలో హైస్కూళ్లలో విలీనం చేశారు. వీటిపై స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్నాఇకి లేఖ రాశారు. 

- గుంతకల్లు నియోజకవర్గంలోని పలు పాఠశాలల విలీనాన్ని ఆపాలని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖరాశారు. గుత్తి పట్టణలోని 9వ వార్డు ఎంపీపీ పాఠశాల, ఎంపీపీఎస్‌ నెంబర్‌ -2 చెట్నేపల్లి, ఎంపీపీఎస్‌ తొండపాడు, ఎంపీపీఎస్‌ దాసరి కాలనీ, పామిడిలోని ఎంపీపీఎస్‌, ఎద్దుపల్లి పాఠశాలలను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేశారు. 

- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం ఎంపీయూపీ పోలేపల్లి, ఎంపీయూపీ చెలిమినేహల్లి స్కూళ్ల మ్యాపింగ్‌పై అభ్యంతరం తెలుపుతూ స్థానిక ప్రజాప్రతినిధి ప్రభుత్వానికి లేఖ రాశారు. 

- రాప్తాడు నియోజవకర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎంపీపీఎస్‌ మెయిన్‌, రామగిరి మండలంలోని పేరూరు డ్యాం, గొందిరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాలల విలీనం ఆపాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. 

- రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండల కేంద్రం, డీ హీరేహాళ్‌ మండలంలోని సోమలాపురం, గుమ్మఘట్ట మండలంలోని గలగల, నేత్రపల్లి, గోనబావి, కణేకల్లు మండలంలోని నేసేపేట, హెచఎల్‌సీ కాలనీ, రాయదుర్గంలోని జున్జురాంపల్లి ఎంపీపీ పాఠశాలల విలీనంపై స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలంలోని రామసాగరం ఎంపీపీ పాఠశాల విలీనంపైనా ప్రభుత్వానికి అభ్యంతరాలు వెళ్లాయి. 


విచారణ పూర్తి

విలీనానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఇటీవల లేఖలు రాయడంతో ప్రభుత్వం కొంత వెనుకడుగు వేసింది. అభ్యంతరాలపై జిల్లా స్థాయి కమిటీలు నియమించి విచారణ చేయించింది. జేసీ ఆధ్వర్యంలోని కమిటీలు జిల్లా వ్యాప్తంగా స్కూళ్ల విలీనంపై విచారణలు పూర్తి చేశాయి. ఇటీవలే ఆయా స్కూళ్ల విలీనంపై వస్తున్న అభ్యంతరాల గురించి పాఠశాల విద్యాశాఖకు విచారణ నివేదికను సమర్పించారని తెలిసింది. దీనిపై తుది నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.




ఇక బడికి పంపం

ఉపాధ్యాయులకు వినతిపత్రం ఇస్తున్న గ్రామస్థులు 

బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 6, 7, 8 తరగతులను గుండిగానిపల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు కొన్నాళ్ల నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. కలెక్టర్‌ డీఈవోకు వినతిపత్రాలను అందించారు. ఇబ్బందులను తెలియచేశారు. భైరవానితిప్ప కుడికాలువ పైనుంచి తమ బిడ్డలు విలీన పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుందని, పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గుండిగానిపల్లి ఉన్నత పాఠశాలకు బుధవారం వెళ్లిన విద్యార్థులను ఇళ్లకు తల్లిదండ్రులు, గ్రామస్థులు వెనక్కు తీసుకెళ్లారు. తమ పిల్లలను గురువారం నుంచి పాఠశాలకు పంపేది లేదని వారు స్పష్టం చేశారు. విలీనాన్ని రద్దు చేయించి, పోలేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతులను కొనసాగించాలని సర్పంచు మంజునాథ్‌, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు వినతి పత్రాన్ని ఇచ్చి వెళ్లారు. 

Updated Date - 2022-08-18T05:49:49+05:30 IST