విలీనం వద్దే వద్దు!

ABN , First Publish Date - 2022-07-07T09:09:54+05:30 IST

విలీనం వద్దే వద్దు!

విలీనం వద్దే వద్దు!

చిన్నారులను వేరే చోటుకు పంపలేం

ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సిందే

డిమాండ్‌ చేసిన తల్లిదండ్రులు

వైసీపీ నేతలదీ ఇదే మాట.. మద్దతు

బడుల విలీనంపై ఆందోళనల ఉధృతి

పాఠశాలల విలీనం వద్దే వద్దు!


మాచవరం/బెల్లంకొండ/నెల్లూరు/అనంతపురం, జూలై 6: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను.. ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాపాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలి రోజు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఆందోళన.. బుధవారం కూడా కొనసాగింది. మా పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పల్నాడు జిల్లా మాచవరం, బెల్లంకొండ మండల పరిధిలో బుధవారం ఆందోళన చేశారు. బెల్లంకొండ మండలం కొత్తగణేశునిపాడు ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. విలీనానికి స్వస్థి పలకాలని డిమాండ్‌ చేశారు. దూరంలో ఉన్న పాఠశాలకు చిన్న పిల్లలు వెళ్లలేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీడీవో రాజగోపాల్‌ సహా పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం, మాచాయపాలెం, న్యూచిట్యాల గ్రామాల్లో ఎంపీపీ స్కూల్లో 6, 7, 8 తరగతులను బెల్లంకొండ జడ్పీ హైస్కూల్లో విలీనం చేయడంపై తల్లిదండ్రులు పాఠశాల వద్ద ధర్నా చేపట్టారు. పాత పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 


నెల్లూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనబాట పట్టారు. ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడం ద్వారా తమ పిల్లలు బడులకు దూరమవుతారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం విలీనాన్ని నిరసిస్తూ ధర్నాలకు పిలుపునిచ్చాయి. జలదంకి, వలేటివారిపాళెం, సంగం, కొండాపురం, రాపూరు, బోగోలు తదితర మండలాల్లో ఆందోళన చేపట్టారు. విలీనం చేయవద్దని కోరుతూ ఎంఈవోలకు, హెచ్‌ఎంలకు వినతిపత్రాలు అందజేశారు. . 

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని మాయాదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7,8 క్లాసులను బాసాపురం హైస్కూల్‌లో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి, కంప చెట్లు అడ్డు పెట్టి ఆందోళన చేశారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ప్రాథమిక పాఠశాలను హైస్కూల్‌లో విలీనం చేశారు. దీంతో ప్రాథమిక పాఠశాల వద్ద గ్రామస్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వైసీపీకి సర్పంచ్‌  రామాంజనేయులు, మేడాపురం ఎంపీటీసీ-1 నాగేశ్వర్‌రెడ్డి సైతం ఆందోళనలో పాల్గొన్నారు.

పెనుకొండలోని తిమ్మాపురం స్కూల్‌ విలీనాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, సీపీఎం నాయకులు రాస్తారోకో చేశారు. గుత్తి ఆర్‌ఎ్‌సలోని నంబర్‌-2 ప్రైమరీ స్కూల్‌ను విలీనం చేయవద్దంటూ ఎంఈవో ఆఫీస్‌ వద్ద ఆందోళన చేశారు.

మడకశిర రూరల్‌లోని మెళవాయి ప్రాథమిక పాఠశాల వద్ద నేలపై కూర్చుని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. యాడికి మండలంలోని నెంబర్‌-5 ప్రాథమిక పాఠశాల వద్ద రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేశారు.

Updated Date - 2022-07-07T09:09:54+05:30 IST