ఉద్యోగుల్ని ఉసూరుమనిపించొద్దు!

ABN , First Publish Date - 2022-01-18T08:13:07+05:30 IST

ప్రభుత్వాలు ఆర్థిక విధానాల్లో భాగంగా ఉద్యోగుల ప్రయోజనాలను పాతరేస్తున్నాయి. పాతపెన్షన్‌ విధానం పోయింది. పిఆర్‌సి ప్రయోజనాలు సైతం తగ్గిపోతున్నాయి....

ఉద్యోగుల్ని ఉసూరుమనిపించొద్దు!

ప్రభుత్వాలు ఆర్థిక విధానాల్లో భాగంగా ఉద్యోగుల ప్రయోజనాలను పాతరేస్తున్నాయి. పాతపెన్షన్‌ విధానం పోయింది. పిఆర్‌సి ప్రయోజనాలు సైతం తగ్గిపోతున్నాయి. ఐదేళ్ళకోసారి పిఆర్‌సి బదులు ఇప్పుడు పదేళ్లకోసారి అంటున్నారు. గత పిఆర్‌సిలో సాధించుకున్న ఫిట్‌మెంట్‌, ఆర్థికలాభం, పింఛన్ ప్రయోజనాలలో కోతలు విధిస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద పెద్ద హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక పేద అరుపులు అరుస్తున్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు అమితంగా పెరిగిపోతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని జీవన వ్యయానికి అనుగుణంగా వేతనస్కేలు, ఫిట్‌మెంట్‌, పదవీవిరమణ ప్రయోజనాలను శాస్త్రీయంగా లెక్కించి నిర్ణయించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత.


ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు గత ప్రభుత్వంతో సంప్రదించి మే 2018లో పే రివిజన్‌ కమిషన్‌ వేయించుకున్నాయి. జులై 2018 నుంచి కమిషన్‌ పని ప్రారంభించినా ప్రభుత్వమే కావాలని పలు దఫాలుగా గడువులు పెంచడంతో నివేదికను ప్రభుత్వానికి అందించడానికి 2 సంవత్సరాల 4 నెలలు పట్టింది. 2020 అక్టోబరు 5న ఆ నివేదికను సమర్పించినప్పటికీ మళ్ళీ అధికారుల కమిటీ, అధ్యయన కమిటీ పేరుతో ప్రభుత్వం మరికొంత కాలయాపన చేసింది. సిఎస్‌కు సమర్పించిన నివేదికను 15 నెలలు దాటినా నేటికీ ప్రభుత్వం బయట పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటి? తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యోగసంఘాలతో చర్చకు అవకాశం ఇవ్వకుండా శాసనసభలో ఏకపక్షంగా 30శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి అమలు ప్రకటించారు. జగన్మోహనరెడ్డి కూడా ఇక్కడి ఉద్యోగసంఘాలతో చర్చల సందర్భంగా కాకుండా తాను అనుకున్న విధంగా 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి అలా ప్రకటించిన తర్వాత ఉద్యోగసంఘాల నేతలు ఎవరూ మాట్లాడడానికి వీలులేదనే నిరంకుశ ఆదేశాలు జారీ చేయడంతో వారు ఆ ఫిట్‌మెంట్‌కు అంగీకరించారు.


గతంతో పోల్చుకుంటే ఫిట్‌మెంట్‌ భారీగా తగ్గించడంతో పాటు నగదు చెల్లింపు 18 నెలలకే కుదింపు, ఇంటి అద్దె రేట్ల తగ్గింపు, 10ఏళ్ళకొకసారి పిఆర్‌సి, పెన్షన్‌ ప్రయోజనాల కోత, అదనపు పెన్షన్‌ కోతతో ఇది జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న తిరోగమన పిఆర్‌సి అనే చెప్పాలి. ఆ కారణంగానే ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పెరిగిన ధరల కనుగుణంగా డిఎలు నూరుశాతం ఉండనందున పిఆర్‌సి సందర్భంగా ఉద్యోగులు ఫిట్‌మెంట్‌ కోసం డిమాండ్‌ చేస్తారు. పిఆర్‌సి అమలులో ఫిట్‌మెంట్‌, ఆర్థికలాభం అమలు చాలా కీలకమైనవి. చరిత్రలో, అంతకుముందు పిఆర్‌సి కంటే ఫిట్‌మెంట్‌ భారీగా తగ్గించడం ఇది రెండోసారి. 1998 పిఆర్‌సిలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి 25శాతం ఫిట్‌మెంట్‌ సాధించుకోగా, ఊహించని పిఆర్‌సి ఇస్తానన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2003లో ఫిట్‌మెంట్‌ను 16శాతానికే పరిమితం చేయడం వల్ల పెద్ద నష్టమే జరిగింది. 2013 పిఆర్‌సిలో 43శాతం ఫిట్‌మెంట్‌ సాధించుకోగా, జగన్‌ ప్రభుత్వం 2018 పిఆర్‌సిలో దాన్ని 23శాతానికి తగ్గించింది. గత పిఆర్‌సితో సమానంగా 43శాతం ఫిట్‌మెంట్‌ అయినా వస్తుందని, కనీసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 30శాతం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. వీటన్నింటికీ భిన్నంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ఐఆర్‌ 27శాతాన్ని కూడా తగ్గించి 23.29శాతం నిర్ణయించి ఉసూరుమనిపించారు. 


పిఆర్‌సి అమలు సందర్భంగా వాస్తవ అమలు తేదీ కాకుండా నోషనల్‌ కాలాన్నీ పెంచేసి ఆర్థికలాభం కుదిస్తున్నారు. వైఎస్‌ ప్రభుత్వం తొలిసారిగా 2003 పిఆర్‌సిలో 21నెలల కాలాన్ని నోషనల్‌గా అమలు చేసి ఉద్యోగులకు నష్టం కలిగించింది. 2008 పిఆర్‌సిలోనూ 21నెలలు నోషనల్‌గా అమలు చేశారు. 2013 పిఆర్‌సిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒప్పించి నోషనల్‌ కాలాన్ని 11 నెలలు తగ్గించుకుంటే మళ్ళీ జగన్‌ ప్రభుత్వం 21నెలలు నోషనల్‌గా నిర్ణయించడంతోపాటు, నగదు లాభాన్ని 18 నెలలకే పరిమితం చేయడం పెద్ద తిరోగమనం. ఏప్రిల్‌ 20 నుంచి డిసెంబర్‌ 21 మధ్య ఆర్థికలాభం చెల్లింపుపై ఏమాత్రం స్పష్టత లేదు.


ఇంటి అద్దె, ఇతర భత్యాల విషయంలో కేంద్ర పదవ వేతనసంఘం ఫార్ములా పాటించాలని అధ్యయన కమిటీ సిఫారసు చేసినట్టు తెలిసింది. ఇదే అమలు జరిగితే ప్రస్తుతం 12శాతం, 14.5శాతం ఉన్న ఇంటి అద్దె 8శాతానికి పడిపోతుంది. విశాఖ, విజయవాడ వాసులకు మాత్రమే 24శాతం వస్తుంది. పిఆర్‌సి కమిషన్‌ ఇంటి అద్దెను యధాతథంగా కొనసాగిస్తూ కార్పొరేషన్‌ పరిధిలో 20శాతం నుంచి 22 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది.


డెబ్భై ఏళ్లు దాటిన పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్ పెన్షన్‌ను పిఆర్‌సి సిఫార్సు చేయగా  ప్రస్తుతమున్న 75 ఏళ్లునే కొనసాగించాలని అధ్యయన కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. అందువల్ల అసలు నివేదికలో సానుకూల అంశాలేమిటో, వ్యతిరేక అంశాలు ఏమిటో, వేటిని అమలు చేస్తారో, కేబినెట్‌ ఏ నివేదికను ఆమోదిస్తుందో, ఏ ఉత్తర్వులపై ఆర్థికలాభం ఎప్పటి నుంచి వస్తుందోననే అనుమానాలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంప్రదాయం అనండి, నిజాయితీ అనండి నివేదికను సమర్పించిన రోజునే బయట పెట్టడం, ఆ నివేదికలను వెంటనే ఆమోదించి అమలుచేయడం జరగాలి. కమిషన్‌ నివేదికను గోప్యంగా  ఉంచుతున్నందువల్లే వారిలో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు 60వేలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 2లక్షల 40వేలు, ఫుల్‌టైం, పార్ట్‌టైమ్‌, మినిమం టైంస్కేల్‌ ఉద్యోగులు 25వేల మంది, డైలీ వేజ్‌, కన్సాలిడేటెడ్ జీతంతో పనిచేస్తున్న వారికి కూడ 11వ పిఆర్‌సిని వర్తింపచేయాలి. మినిమమ్‌ బేసిక్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం, అంటే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు వారికి వర్తింపచేయాలి. ముఖ్యమంత్రి ప్రకటనలో స్పష్టత లేనందున వారంతా ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలి. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు 2021 అక్టోబరు 2 నుంచి రెగ్యులర్‌ స్కేలు ఇస్తామని నియామక ఉత్తర్వులలో చెప్పి, 11వ పిఆర్‌సిలో జూలై 2022 నుంచి ఇస్తామని చెప్పడం వల్ల 9 నెలల ప్రయోజనం నష్టపోవాల్సి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. వీరికి రెండేళ్లు నిండగానే రెగ్యులర్‌ స్కేలు, ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలి.


ఉద్యమబాట పట్టిన ఉపాధ్యాయ సంఘాలు, ఆ దిశగా యోచిస్తున్న ఉద్యోగ సంఘాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి పిఆర్‌సి అమలుపై ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వారితో చర్చించి గత పిఆర్‌సి ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె, ఆర్థికలాభం ఇతర ప్రయోజనాలు ఏవీ తగ్గించకుండా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఉద్యోగుల ఇతర ప్రధాన డిమాండ్లు అయిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై తక్షణమే సానుకూల నిర్ణయాలు ప్రకటించాలి.

ఐ. వెంకటేశ్వరరావు

పిడియఫ్‌ ఎమ్మెల్సీ

Updated Date - 2022-01-18T08:13:07+05:30 IST