సాగు భూములను లీజుకివ్వకండి

ABN , First Publish Date - 2021-10-15T06:45:50+05:30 IST

మండలంలోని సోమరాజుకుంట గ్రామ సమీపంలో ఎంతో కాలంగా సాగుచేసుకుని, జీవనం సాగించుకుంటున్న భూములను లీజుకు ఇవ్వకండి అని సోమరాజకుంట గ్రామ రైతులు ఆర్డీఓ వెంకటరెడ్డికి విన్నవించుకున్నారు

సాగు భూములను లీజుకివ్వకండి

- ఆర్డీఓ వద్ద మొరపెట్టుకున్న రైతులు 

నంబులపూలకుంట,  అక్టోబరు 14: మండలంలోని సోమరాజుకుంట గ్రామ సమీపంలో ఎంతో కాలంగా సాగుచేసుకుని, జీవనం సాగించుకుంటున్న భూములను  లీజుకు ఇవ్వకండి అని సోమరాజకుంట గ్రామ రైతులు ఆర్డీఓ వెంకటరెడ్డికి విన్నవించుకున్నారు. గురువారం సర్వేనెంబర్‌ 1 లో 625 ఎకరాలకు సంబంధించిన భూముని పరిశీలించడానికి ఆర్డీఓ గ్రామానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆర్డీఓ వెంకటరెడ్డికి సమస్యను విన్నవించుకున్నారు. సర్వేనెంబర్‌ 1 లో 150 ఎకరాలు సాగులో ఉందని, ఈ భూములను నమ్ముకుని 20 కుటుంబాలకు పైగా జీవనం సాగిస్తున్నారన్నారు. అదేవిధంగా సోమరాజుకుంటపల్లి గ్రామంతో పాటు ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అందరూ ఈ పొలాల్లో పాడి పశువులు, మూగజీవాలను గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి భూములను లీజుకిస్తే మా కడుపు కొట్టిన వారు అవుతారని ఆర్డీఓకు విన్నవించుకున్నారు. గతంలో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడికి ఈ విషయాన్ని విన్నవించుకున్నామని, మరలా ఆ భూముల సర్వేకోసం రావడం ఏమిటని ఆర్డీఓను ప్రశ్నించారు. ఆర్డీఓ రైతులతో మాట్లాడుతూ భూములను పరిశీలనకు వచ్చామని, కార్యాలయం వద్దకు వస్తే ఈ విషయం మాట్లాడదామని తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్‌ పీవీ రమణ, వీఆర్‌ఓ గంగాధర్‌, మండల సర్వేయర్‌ ఆనంద్‌నాయక్‌, సచివాలయ సర్వేయర్‌లు, రైతులు పాలకొండయ్య, హనుమంతు, శేఖర్‌రెడ్డి, కుమార్‌నాయుడు, జయరామిరెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-15T06:45:50+05:30 IST