నమాజ్‌ను అడ్డుకోవద్దు

ABN , First Publish Date - 2022-05-18T07:42:35+05:30 IST

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగాన్ని గుర్తించిన ప్రదేశాన్ని పరిరక్షించాలని, అయితే, నమాజ్‌ కోసం మసీదుకు వచ్చే భక్తులను అడ్డుకోవద్దని ఉత్తరప్రదేశ్‌ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

నమాజ్‌ను అడ్డుకోవద్దు

శివలింగం ఉన్న ప్రదేశాన్ని పరిరక్షించండి

ఉత్తరప్రదేశ్‌ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం

జ్ఞానవాపి మసీదులో భక్తుల సంఖ్యపై పరిమితి ఎత్తివేత

దిగువ కోర్టు ఆదేశాన్ని పక్కనపెట్టిన ధర్మాసనం

సర్వే వివరాల లీక్‌పై వారాణసీ కోర్టు ఆగ్రహం


శివలింగం ఉన్న ప్రదేశాన్ని మాత్రమే పరిరక్షించండి.. యూపీ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం


న్యూఢిల్లీ, మే 17: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగాన్ని గుర్తించిన ప్రదేశాన్ని పరిరక్షించాలని, అయితే, నమాజ్‌ కోసం మసీదుకు వచ్చే భక్తులను అడ్డుకోవద్దని ఉత్తరప్రదేశ్‌ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మసీదులో ప్రార్థనలకు 20 మందికి మించి అనుమతించవద్దని వారాణసీ కోర్టు సోమవారం జారీ చేసిన ఆదేశాన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం పక్కన పెట్టింది. వారాణసీ పట్టణంలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో వీడియోగ్రఫీ సర్వేను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించాలని కోరుతూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ముస్లింల ప్రార్థన హక్కుకు ఇబ్బంది కలిగించరాదని, అదే సందర్భంలో హిందూ భక్తులు పూజించే శివలింగాన్ని గుర్తించిన ప్రదేశాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల్లో పేర్కొంది. మసీదులో ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులను ఆదేశించింది. శివలింగం ఉందని చెబుతున్న బావి(వజూఖానా)ని ముస్లింలు మతపరమైన కార్యక్రమాలకు వినియోగించుకోవడంలోనూ ఆటంకాలు కలిగించొద్దని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో వివరణాత్మక స్పందనలు తెలియజేయాలని యూపీ ప్రభుత్వం, హిందూ సేన తదితరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మసీదు కాంప్లెక్స్‌లో నిర్దిష్టంగా ఏ ప్రదేశంలో శివలింగాన్ని గుర్తించారని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రశ్నించగా, సర్వే నివేదికను తాము చూడలేదని యూపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానమిచ్చారు. ఈ కేసులో కొన్ని అంశాలపై తన సహాయాన్ని కోర్టుకు అందించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, వారాణసీ సివిల్‌ జడ్జి తదుపరి ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు సర్వే రిపోర్టును కమిషనర్‌ ఇంకా సమర్పించలేదని, అయినప్పటికీ కమిషనర్‌ బావిలో శివలింగాన్ని గుర్తించారని ప్రతివాదులు  చెప్పడం పూర్తిగా ఆమోదనీయం కాదని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదించారు. మరోవైపు వారాణసీలోని విచారణ కోర్టులో ఈ అంశంపై మంగళవారం కూడా విచారణ కొనసాగింది. సర్వే నివేదికను ఇంకా కోర్టుకు సమర్పించక ముందే, ఆ వివరాలు మీడియాకు లీక్‌ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వే వివరాలు ఎలా లీక్‌ అయ్యాయని ప్రశ్నించింది. సర్వేకు నేతృత్వం వహించిన చీఫ్‌ అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రాను డిస్మిస్‌ చేసింది.  సర్వే నివేదికను రెండు రోజుల్లో తమకు సమర్పించాలని నూతన చీఫ్‌ అడ్వొకేట్‌ కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ను కోర్టు ఆదేశించింది. కాగా, సర్వే నివేదిక 50 శాతమే పూర్తయ్యిందని, నివేదికను కోర్టుకు సమర్పించేందుకు కొంత గడువు కోరుతామని అంతకుముందు అసిస్టెంట్‌ అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ చెప్పారు. 


బాబ్రీ కేసులోనూ ఆ ఇద్దరు..

జ్ఞానవాపి మసీదు కేసును విచారిస్తున్న సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ.. బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలోనూ ఉన్నారు. మరోవైపు, మధురలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్లు, లా విద్యార్థుల సంఘం ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మధుర కోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేసింది. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో నిర్మించిన ఆ మసీదును తొలగించాలని హిందుత్వ సంఘాలు ఇప్పటికే మధుర కోర్టుల్లో 10 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మసీదును ముస్లింలు వినియోగించకుండా ‘శాశ్వత ఇంజక్షన్‌’ కోరామని పిటిషనర్లలో ఒకరైన శైలేంద్ర సింగ్‌ తెలిపారు. 



సర్వేపై స్టే ఆశిస్తున్నాం: ఒవైసీ

గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదు సర్వే పనులపై స్టే ఆర్డర్‌ వస్తుందని ఆశిస్తున్నామని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు. వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారాణసీ కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని ఆదేశించడమంటే 1991 చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.


న్యాయ పోరాటం: పర్సనల్‌ లా 

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని బావి(వజూఖానా)ని సీల్‌ చేయాలని ఆదేశించడం అనైతికమని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లాబోర్డు పేర్కొంది. ‘అది ఒక మసీదు. గుడి అని నిరూపించేందుకు ప్రయత్నించడం మతఘర్షణలు సృష్టించే కుట్రే’ అని ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి ఖాలిద్‌ సైఫుల్లా రహ్మానీ పేర్కొన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఏఐఎంపీఎల్‌బీ పోరాటం చేస్తుందన్నారు. 


రెండింటికీ సారూప్యం: వీహెచ్‌పీ 

బాబ్రీ మసీదు కేసుతో జ్ఞానవాపి మసీదు కేసుకు సారూప్యత ఉందని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాందే పేర్కొన్నారు. మంగళవారం ఓ ఆంగ్ల పత్రికతో ఆయన మాట్లాడుతూ రెండు మసీదులూ మొఘల్‌ పాలకులు నిర్మించినవేనన్నారు. 

Updated Date - 2022-05-18T07:42:35+05:30 IST