రామాలయం నిర్మాణంపై పాకిస్థాన్ విమర్శలను తిప్పికొట్టిన భారత్

ABN , First Publish Date - 2020-08-06T23:00:07+05:30 IST

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన నేపథ్యంలో పాకిస్థాన్

రామాలయం నిర్మాణంపై పాకిస్థాన్ విమర్శలను తిప్పికొట్టిన భారత్

న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ చేసిన విమర్శలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మతపరంగా రెచ్చగొట్టడం మానుకోవాలని, భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని హెచ్చరించింది. 


అయోధ్య రామజన్మ భూమిలో రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. రామాలయం నిర్మాణాన్ని ఖండించింది. భారత దేశ సుప్రీంకోర్టు తీర్పు లోపభూయిష్టమని ఆరోపించింది. 


పాకిస్థాన్ దుర్మార్గపు వ్యాఖ్యలపై భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం స్పందించారు. భారత దేశ అంతర్గత వ్యవహారంపై పాకిస్థాన్ ఇచ్చిన పత్రికా ప్రకటనను చూశామన్నారు. భారత దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా మతపరంగా రెచ్చగొట్టకుండా సంయమనం పాటించాలని హితవు పలికారు. 


క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాల్పడుతున్న, తన సొంత మైనారిటీలకు మతపరమైన హక్కులను తిరస్కరిస్తున్న దేశం ఇటువంటి వైఖరిని ప్రదర్శించడంలో ఆశ్చర్యం లేదన్నారు. అయినప్పటికీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయమని చెప్పారు. 


పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ‘‘రామాలయం నిర్మాణానికి బాటలు పరిచిన భారత దేశ సుప్రీంకోర్టు లోపభూయిష్ట తీర్పులో న్యాయం కన్నా మత విశ్వాసానికే పెద్ద పీట అని మాత్రమే కాకుండా నేటి భారత దేశంలో పెరుగుతున్న మెజారిటీ వాదం కనిపిస్తోంది, భారత దేశంలో మైనారిటీలు, మరీ ముఖ్యంగా ముస్లింలు, వారి ప్రార్థనా స్థలాలు అత్యధికంగా దాడికి గురవుతున్నాయి’’ అని పేర్కొంది.


Updated Date - 2020-08-06T23:00:07+05:30 IST