Abn logo
Oct 1 2021 @ 15:16PM

బీజేపీకి సాయపడొద్దు : కెప్టెన్ అమరీందర్‌కు కాంగ్రెస్ సలహా

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి సాయపడొద్దని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఏఐసీసీ పంజాబ్ ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ కోరారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టాలనే నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. తాను కాంగ్రెస్‌లో ఉండబోనని, బీజేపీలో చేరబోనని కెప్టెన్ సింగ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రావత్ ఈ విజ్ఞప్తి చేశారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి సెప్టెంబరు 18న రాజీనామా చేశారు. తనను కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో సమావేశమయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాను కాంగ్రెస్‌లో కొనసాగబోనని, బీజేపీలో చేరబోనని కెప్టెన్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై చర్చించేందుకే తాను అమిత్ షాను కలిశానని చెప్పారు. ఆయన త్వరలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ డెహ్రాడూన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్ అవమానించిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కెప్టెన్ ఇటీవల ఇచ్చిన స్టేట్‌మెంట్లనుబట్టి ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నారనిపిస్తోందన్నారు. ఆయన పునరాలోచించుకోవాలని, బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయపడకూడదని అన్నారు. 


కాంగ్రెస్ ఇప్పటి వరకు చేసినదంతా కెప్టెన్ అమరీందర్ సింగ్ గౌరవ, మర్యాదలను కాపాడటం, 2022లో జరిగే పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలను పెంచడం అని చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Caption