గిరిజన ఖైదీల గోడు వినిపించడం లేదా?

ABN , First Publish Date - 2022-10-01T07:28:35+05:30 IST

అసమాన సమాజంలో పేద వర్గాలకు సమ న్యాయం దొరకడం సులభమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ఖైదీల విషయంలో ఇది ఋజువవుతున్నది.

గిరిజన ఖైదీల గోడు వినిపించడం లేదా?

అసమాన సమాజంలో పేద వర్గాలకు సమ న్యాయం దొరకడం సులభమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ గిరిజన ఖైదీల విషయంలో ఇది ఋజువవుతున్నది. పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఇంకా జైళ్లలో మరణశిక్ష ఖైదీలుగాను, జీవిత ఖైదీలుగాను మగ్గుతున్న గిరి జనులు ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తే ప్రస్తుత నేర న్యాయ పరిపాలన విధానంలో గిరిజనులకు సరైన న్యాయం లభిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మార్చి 2022లో వెలువరించిన నివేదిక ప్రకారం, గత పద్నాలుగేళ్లుగా జైలులో ఉన్న మొత్తం తొమ్మిది మంది గిరిజనుల్లో ఒక ఖైదీకి మాత్రమే ఉపశమనం (రెమిషన్) లభించింది. నలుగురు ఎస్టీ ఖైదీల విషయంలో న్యాయ పరిపాలన యంత్రాంగం ఉపశమనం ఇవ్వలేదు. మిగిలిన మరో నలుగురికి కనీసం ఉపశమనం కోసం దరఖాస్తులు పెట్టే అవకాశం కూడా దొరకలేదు. ఎస్టీ జీవిత ఖైదీలను కనీసం ఐదుగురినైనా పెరోల్‌పై విడుదల చేయలేదు.


మరణశిక్ష, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఈ గిరిజనుల ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ తొమ్మిది మందీ శారీరక లేదా మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఖైదీల సత్ప్రవర్తనను ప్రోత్సహించడమే పెరోల్ మంజూరు లక్ష్యం. ఖైదీల సత్ప్రవర్తన మీద, జైల్లో వారు చేసిన పని మీద ఆధారపడి వారికి ఉపశమనం ఉంటుంది. కేసు విచారణ అనంతరం సాక్ష్యాలను బట్టి శిక్ష విధించడం అనేది న్యాయపరమైన విధి. పెరోల్ లేదా ఉపశమనాన్ని మంజూరు చేయడం సాధారణంగా ప్రభుత్వ ప్రత్యేక అధికార పరిధిలోకి వచ్చే అంశం. ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో చురుగ్గా, విచక్షణతో తన బుద్ధి కుశలతను ఉపయోగించి కారాగారం నుండి ఖైదీల విడుదలకు ఒక సహేతుక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ నిర్ణయం కోర్టు విధించిన శిక్షను తగ్గించడంగా ఏ విధంగానూ చూడరాదు. అయితే గిరిజన ఖైదీల విషయంలో ప్రభుత్వాలు ఈ శ్రద్ధ చూపటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌లో 1,159 మంది గిరిజనులు క్రిమినల్ కేసుల విచారణ దశలోనే (అండర్ ట్రయల్ ఖైదీలు) రిమాండు ఖైదీలుగా కటకటాలపాలయ్యారు. వీరిలో 424మంది రిమాండ్ ఖైదీలకు చెందిన గిరిజన కుటుంబాలు తమ కుటుంబ ఆర్థిక సంపాదనపరుడు బెయిల్ లేకుండా జైలులో ఉన్నందున నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ 424మంది నిందితులలో 291మంది దరఖాస్తులు రాష్ట్రంలోని వివిధ విచారణ కోర్టులలో పెండింగులో ఉన్నట్లు ప్రభుత్వ నివేదిక తెలియజేస్తుంది. మిగిలిన 133 మంది నిందితులకు కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల జైలు నుండి విడుదల కాలేకపోయారు.


నిందితులు కడు పేదరికంలో ఉన్న షెడ్యూల్డు తెగలు అనే వాస్తవాన్ని గ్రహించడంలో మన నేర న్యాయ పాలనా వ్యవస్థ ఇంకా గుడ్డిగానే ఉంది. జామీను సర్టిఫికేట్‌లను తయారు చేయించడం లేదా నగదు డిపాజిట్‌ను సమకూర్చడం వంటివి అధిక ఖర్చుతో కూడిన పనులు. కోర్టులకు బెయిల్ బాండ్‌లను (ష్యూరిటీలను) సంపన్న వర్గాల మాదిరిగా గిరిజనులు సమర్పించలేరు. దైనందిన జీవితంలో చాలామంది గిరిజనులు రాతపూర్వక పత్రాల కంటే మౌఖిక అంశాలకే విలువనిస్తారు. వారు తమ సాంప్రదాయ చట్టానికి లేక ఆచారాలకు కట్టుబడి నడుచుకుంటారు. రాజ్యాంగం ఐదవ షెడ్యూల్డు ప్రాంతంలో నివసించే గిరిజనులకు సంప్రదాయ వివాద పరిష్కారానికి షెడ్యూల్డు ప్రాంత పంచాయతీ నియమాల విస్తరణ కేంద్ర చట్టం 1996 వీలు కల్పిస్తుంది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి గ్రామసభ ఒక న్యాయ వేదిక అవుతుంది.


విచారణ ప్రక్రియలో (అండర్ ట్రైల్‌లో) ఉన్న ఖైదీల విడుదలకు జామీనుదారుల ఆస్తి ధ్రువీకరణ పత్రాలు తీసుకురమ్మని కోర్టులు పట్టుబట్టే బదులు, గ్రామసభ తీర్మానాన్ని సమర్పించమని లేదా కోర్టు ఆదేశాల ప్రకారం కేసు విచారణ సమయంలో ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తామని అంగీకరిస్తూ గిరిజన సంప్రదాయ పెద్దల నుండి ఒక లేఖను తీసుకురమ్మని కోరడం గిరిజన నిందితుల విషయంలో సముచితంగా ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే అయినా వారిలో కూడా అసమానులు ఉన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఏదైనా కేసులో నిందితుడు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే, బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించే అధికారం పోలీసులకు ఎలాగూ ఉండనే ఉంది. అందువల్ల ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న జామీను పత్రాలు సమర్పించే విషయంలో న్యాయస్థానాలు గిరిజనుల విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరిస్తే నేరం ఋజువుకాక మునుపే గిరిజనులు జైళ్ళలో మగ్గే పరిస్థితి తగ్గుతుంది.


మోతీరామ్ – మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్య (1978), హుస్సేనారా ఖాటూన్ – బీహార్ రాష్ట్రం (1979) మధ్య నడిచిన కేసులలో నిందితుల బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారిస్తూ ‘మన సోషలిస్ట్ రిపబ్లిక్‌లో, సామాజిక న్యాయం ఒక ముఖ్య లక్షణంగా ఉండాలా వద్దా, ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలా లేదా వంటి అంశాలు మేము పార్లమెంటుకు వదిలివేస్తాము. కానీ బెయిల్ పొందే వ్యక్తి న్యాయానికి దూరం కాకుండా చూడ్డానికి బెయిల్ బాండ్స్ విషయంలో కుటుంబ సంబంధాలు, సమాజంలోని మూలాలు మొదలైన ఇతర సంబంధిత అంశాలను తప్పక పరిగణలోకి తీసుకోవాలి’ అని స్పష్టం చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై, అవసరమైతే పూచీకత్తులు లేకుండా కూడా నిందితులను బెయిల్‌పై విడిచిపెట్టే అవకాశాలను కోర్టులు పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.


తమపై వచ్చిన నేరారోపణ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాదాపు 87మంది నిందితులు అప్పీలు చేసుకొన్నప్పటికీ అవి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పటికీ వారు ఖైదీలుగానే జైలులో ఉన్నారు. ఆరుగురు గిరిజనులు విచారణ పెండింగ్‌లో ఉండగానే జైలులో మరణించారు, ముగ్గురు ఖైదీలు శారీరక లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొత్తం 91 మంది గిరిజనులు కేసుల విచారణ దశలోనే ఏడాదికి పైగా రిమాండ్‌లో ఉన్నారు. సాధారణంగా రిమాండ్, పోలీస్ దర్యాప్తు రిపోర్టులలో పేర్కొన్న కథనాలే బెయిల్ మంజూరు విషయంలో క్రిమినల్ కోర్టులు ఆచితూచి వ్యవహరించడానికి దారి తీస్తున్నాయని చెప్పవచ్చు. కేసు విచారణకు ముందు దశలో ప్రాసిక్యూషన్ పేర్కొన్న ఆరోపణలను విశ్లేషించడానికి, తన క్లయింటుకు బెయిల్ ఇప్పించడానికి న్యాయవాదికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఒక క్రిమినల్ కేసులో పూర్తి విచారణ ముగిసిన తర్వాతే పోలీస్ కేసులలో నిజం ఎంత ఉందో కోర్టులకు తెలుస్తుంది. గతంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల ఆధారంగా బెయిల్ మంజూరు విషయంలో తమ విచక్షణ అధికారాన్ని కోర్టులు వినియోగించాల్సి ఉన్నప్పటికీ, న్యాయస్థానాల విస్తృత విచక్షణాధికారమే బెయిల్‌ తిరస్కరణ సమస్యలో ఒక భాగం అవుతుంది.


ఉన్నత న్యాయస్థానాల్లో ఉండే చట్టపరమైన ఆటంకాలు, ఖైదీల సుదీర్ఘ నిర్బంధానికి దారి తీస్తున్నాయి. అది ప్రజల సత్వర విచారణ హక్కును, న్యాయం పొందే హక్కును ఉల్లంఘిస్తుందని చెప్పాలి. అండర్ ట్రయల్ ఖైదీలకూ యూనియన్ ఆఫ్ ఇండియాకూ మధ్య నడిచిన కేసులో (1994) నిందితుల విచారణను నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక నిష్పక్షపాత మధ్యవర్తి ముందు నేరంగా నిరూపించబడితే తప్పా, ఏ వ్యక్తి కూడా తన చర్యల కారణంగా, తీవ్ర ప్రతికూల పరిణామాలను అనుభవించకూడదనేది అదర్శవంతంగా కోర్టు పేర్కొంది. అందువల్ల షెడ్యూల్డ్ తెగలకు వ్యతిరేకంగా విచారణ పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులలో అర్హత గల పోలీస్ కేసులను ఉపసంహరించుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎస్టీ కమ్యూనిటీకి చెందిన నిందితులపైన, విచారణలో ఉన్న ఖైదీలపైన ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా వారికి సత్వర సరైన న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


డా. పల్లా తినాధరావు

Updated Date - 2022-10-01T07:28:35+05:30 IST