ఆ స్థలాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వం

ABN , First Publish Date - 2022-09-29T05:27:43+05:30 IST

పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పక్కన సీబీరోడ్డుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు

ఆ స్థలాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వం
మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి

 తాడిపత్రి, సెప్టెంబరు 28: పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పక్కన సీబీరోడ్డుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితోపాటు పోలీసు అధికారులు ఎంపికచేయడంపై చైర్మన్‌ మండిపడ్డారు. కోట్లాదిరూపాయల విలువైన స్థలంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ కట్టాలని గతంలో నిర్ణయించడం జరిగిందన్నారు. 2021 ఆగస్టు 27న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఈ స్థలంతోపాటు పోలీస్‌స్టేషన్‌ ఉత్తరాన ఉన్న స్థలం, దినకూరగాయల మార్కెట్‌ ఎదురుగా ఉన్న స్థలాల్లో మున్సిపల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటుచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశామ న్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి పోలీసులు మున్సిపాలిటీకి వినతిపత్రం అందిస్తే పరిగణలోనికి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెనుక భాగంలో గతంలో మున్సిప ల్‌ బాయ్స్‌హైస్కూల్‌ కోసం నిర్మించిన భవనాన్ని ఇవ్వడానికి అంగీకారం తెలుపుతా మన్నారు. ఈ భవనానికి పోలీస్‌స్టేషన్‌కు కేవలం కాంపౌండ్‌వాల్‌ మాత్రమే అడ్డంగా ఉందన్నారు. అన్ని వసతులతో కూడిన భవనం ఉండడంతోపాటు ఖాళీ స్థలంకూడా ఎక్కువగా ఉండడం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద న్నారు. కొత్తగా లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అంతకుమునుపు ఇదే విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌మియాకు టీడీపీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2022-09-29T05:27:43+05:30 IST