డబుల్‌కు డబ్బులు ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2020-10-27T11:01:22+05:30 IST

‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టివ్వాలని ఈ పథకం తీసుకువచ్చారు. కచ్చితంగా ఇల్లు లేని పేదలకే వాటిని కట్టిస్తాం.

డబుల్‌కు డబ్బులు ఇవ్వొద్దు

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

వీరన్నపేటలో పండగవేళ లబ్ధిదారులకు డబుల్‌ ఇళ్ల పట్టాల పంపిణీ


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 26: ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టివ్వాలని ఈ పథకం తీసుకువచ్చారు. కచ్చితంగా ఇల్లు లేని పేదలకే వాటిని కట్టిస్తాం. అందులో ఎవరి ప్రమేయం ఉండదు. ఇల్లు ఇప్పిస్తామని, అందుకు డబ్బులు ఇవ్వాలని రాజకీ య నాయకులు, దళారులు వస్తే ఆ సమాచారం అధికారులకు, నాకు ఇవ్వండి. వారిపై కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతాం.’ అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరన్నపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు సంబంధించి కొందరు లబ్ధిదారులకు మంత్రి ఇళ్ల పట్టాలను అందించారు. 15 మంది దివ్యాంగులతో పాటు మరికొందరికి పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులతో మాట్లాడుతూ ఎవరైనా మీ వద్దకు వచ్చి ఇళ్ల కోసం డబ్బులు అడిగారా? అని అడగగా లబ్ధిదారులు లేదని బుదులిచ్చారు.


ఇల్లు రావడం ఎలా ఉందని అడిగితే చాలా సంతోషంగా ఉందని, పండుగ వేళ కడుపు నిండిందని చెప్పారు. మీరు మాకు దేవుడని, మీ వల్లే ఇల్లు వచ్చిందని మంత్రిని ఉద్దేశించి అనగా, మనందరి దేవుడు కేసీఆర్‌ అని మంత్రి బదులిచ్చారు. ఇండ్లు లేని వారందరికీ రానున్న రోజుల్లో ఇండ్లు కట్టిస్తామని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు. కొందరు నాయకులు కుల, మతాలతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారని, అలాంటి వారి మాయలో పడొద్దని సూచించారు. పని చేసే వారికి కుల, మతాలేవీ ఉండవన్నారు. ఉన్నదల్లా పేదలకు న్యాయం చేయడం, అభివృది చేయడమేనని అన్నారు.


ఇల్లు తీసుకున్నవారు అందులోనే ఉండాలని, అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టినందున అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, కౌన్సిలర్లు షబ్బీర్‌ అలీ, రామ్‌, నాయకులు కృష్ణమోహన్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T11:01:22+05:30 IST