చాణక్య నీతి: మీరు ఈ మూడింటికీ మరీ దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండకూడదు.. అతిక్రమిస్తే తీవ్రంగా నష్టపోతారు!

ABN , First Publish Date - 2021-12-25T12:47:23+05:30 IST

సంతోషకరమైన జీవితం కోసం ఆచార్య చాణక్య..

చాణక్య నీతి: మీరు ఈ మూడింటికీ మరీ దగ్గరగా లేదా చాలా దూరంగా ఉండకూడదు.. అతిక్రమిస్తే తీవ్రంగా నష్టపోతారు!

సంతోషకరమైన జీవితం కోసం ఆచార్య చాణక్య పలు విధివిధానాలను తెలిపారు. మీరు కూడా మీ జీవితంలో ఆనందాన్ని, శాంతిని కోరుకుంటే ఈ విధానాలను అమలు చేయాలని చాణక్య సూచించారు. సంతోషకరమైన జీవితం ప్రతి మనిషి కల. తన జీవితంలో ఎలాంటి విషాద ఛాయలు ఉండకూడదని అందరూ కోరుకుంటారు. ప్రతి క్షణం ఆనందంతో నిండిపోవాలని భావిస్తారు. అయితే నిజ జీవితంలో మనిషి నిరంతరం ఆనందంగా ఉంటడం సాధ్యం కాదు. ఎందుకంటే జీవితంలో ఆనందం, దుఃఖం రెండూ ఒకే నాణేనికి ఇరు వైపులా ఉన్న బొమ్మబొరుసులాంటివి. జీవితంలో సుఖం పక్కనే దుఃఖం ఉంటుంది. దుఃఖం వెంటనే ఆనందం కూడా వస్తుంది. ఆచార్య చాణక్య.. మనిషి సంతోషకరమైన జీవితం గడిపేందుకు సంబంధించి కొన్ని విధానాలతో పాటు విలువైన ఆలోచనలు చేశాడు. ఈ విధానాలు నేటి కాలానికీ వర్తిస్తాయి. ఆచార్య చాణక్య ఒక శ్లోకంలో.. ఎవరైనా సరే.. మరీ దగ్గరగా ఉండకూడని, పూర్తిగా దూరం చేసుకోకూడని మూడు విషయాల గురించి వివరంగా ఒక శ్లోకంలో తెలిపారు.

అత్యాసన్నా వినాశాయ దూర్‌స్థా న ఫలప్రదా:।

సేవిత్వయం మధ్యాభాగేన రాజా బహిర్గురూ: స్త్రీయం: ।।

ఈ శ్లోకంలో ఆచార్య చాణక్య.. ఎవరైనాసరే.. ఆర్థికంగా లేదా సామాజికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తికి, అగ్నికి, స్త్రీకి చాలా దగ్గరగా ఉండకూడదని, అలాగని వాటికి పూర్తిగా దూరం కాకూడదని తెలిపారు. వీటికి మరీ దగ్గరగా ఉంటే.. తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్నవాటికి కోల్పోతాడని తెలిపారు. అలాగే గౌరవం దెబ్బతింటుందని, శిక్షకు గురవడమో లేదా కుట్రకు బలి కావడమో జరుగుతుందని హెచ్చరించారు.


సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించడం ద్వారా మీకు హాని తలపెట్టే అవకాశాలున్నాయని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే పలుకుడి కలిగిన వారితో అత్యంత సన్నిహితంగా మెలగడం మంచిదికాదని, అలాగని దూరంగా ఉండడం కూడా మంచిదికాదని ఆచార్య చాణక్య సూచించారు. అగ్ని గురించి ఆచార్య చాణక్య వివరిస్తూ.. కుండకు అధిక దూరంలో నిప్పువుంటే వంట వండలేమని తెలిపారు. అలాగని మరీ దగ్గరగా ఉన్నా వంట సరిగా సిద్దం కాదని తెలిపారు. అగ్నికి మరీ దగ్గరగా వెళితే శరీర భాగాలు కాలిపోతాయని హెచ్చరించారు. ఇక  స్త్రీ గురించి ఆచార్య చాణక్య ఏమన్నారంటే.. స్త్రీకి చాలా సన్నిహితంగా ఉంటే ఆ వ్యక్తిలో అసూయాద్వేషాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. స్త్రీని ఎప్పటికీ బలహీనురాలిగా పరిగణించకూడదని చాణక్య తెలిపారు, ఎందుకంటే ఈ ప్రపంచ మనుగడకు పురుషుని సహకారం ఎంతో..స్త్రీ భాగస్వామ్యం కూడా అంతేనని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-25T12:47:23+05:30 IST