ప్రలోభాల్లో పడకండి!

ABN , First Publish Date - 2020-10-02T06:53:35+05:30 IST

చెడు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. తన వైపు రమ్మని ఆహ్వానిస్తుంది. ప్రలోభాలలో ముంచెత్తుతుంది...

ప్రలోభాల్లో పడకండి!

చెడు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. తన వైపు రమ్మని ఆహ్వానిస్తుంది. ప్రలోభాలలో ముంచెత్తుతుంది. భౌతికమైన సుఖాలు పొందడానికీ, ఆనందంగా ఉన్నామన్న భ్రమలో తేలిపోవడానికీ చెడ్డ దారులు అనేకం కళ్ళ ఎదుటే కనిపిస్తాయి. ఆ దారుల్లోకి రావాలని పిలిచే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి మార్గాన్ని పట్టినవారు దీపం వెలుగుల్ని చూసి దగ్గరకు చేరిన పురుగుల్లా నాశనమైపోతారు. అలాంటి వారిని ఏసుక్రీస్తు హెచ్చరిస్తూ ‘‘ఇరుకైన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించండి. ఎందుకంటే వినాశనానికి దారి తీసే ద్వారం వెడల్పుగా ఉంటుంది, అటువైపు వెళ్ళే మార్గం విశాలంగా ఉంటుంది. కానీ జీవం వైపు దారి తీసే ద్వారం చిన్నది. మార్గం ఇరుకైనది. దాన్ని చాలా కొద్దిమంది మాత్రమే కనుక్కోగలరు’’ అని చెప్పాడు (మత్తయి సువార్త 7:13-14). జీవం వైపు నడిపించే మార్గం అంటే దైవం వైపు నడిపించే దారి. తాత్కాలిక ఆనందాన్నిచ్చే ఆకర్షణల్లో పడిన వారు ఆ దారిని గుర్తించలేరు. కళ్ళకు కమ్మిన ఆ ఆకర్షణ పొరల్ని తొలగించుకున్న వారికే ఆ మార్గం కనిపిస్తుంది. అది జీవంతో నిండిన, సత్యమైన మార్గం వైపు నడిపిస్తుంది.

Updated Date - 2020-10-02T06:53:35+05:30 IST