నీటి రాజకీయాలకు పాల్పడవద్దు

ABN , First Publish Date - 2020-05-20T11:06:23+05:30 IST

కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమలో నీటి రాజకీయాలకు పాల్పడవద్దని, కలిసికట్టుగా

నీటి రాజకీయాలకు పాల్పడవద్దు

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో  అఖిలపక్ష నేతలు 


కడప (మారుతీనగర్‌), మే 19: కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమలో  నీటి రాజకీయాలకు పాల్పడవద్దని, కలిసికట్టుగా ముందుకెళ్లాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చంద్ర అధ్యక్షతన మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా నీటి వివాదాలపై ఏర్పాటైన బచావత్‌ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఏ ప్రాంతానికి ఎంతెంత నీటి వాటాలు రావాల్సి ఉందో ఆ ప్రకారం కేటాయించాలన్నారు. రాష్ట్ర విభజనానంతరం జీవో నెం.69 ప్రకారం నీటిమట్టం 834 అడుగులు, 107 జీవో ప్రకారం నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాల్సి ఉందన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధనలకు నీళ్లు వదలి వచ్చిన నీటిని వచ్చినట్లు శ్రీశైలం ఎడమ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా తోడేస్తుందని తెలిపారు. దీంతో వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయన్నారు.


వేసవి ఆరంభంలోనే గుక్కెడు మంచి నీటి కోసం సీమ ప్రజలు తల్లడిల్లాల్సి వస్తుందన్నారు. సీమకు నీరివ్వడానికి పోతిరెడ్డిపాడు తప్ప మరోమార్గం లేదన్నారు. దీనిపై సీఎం జగన్‌మోన్‌రెడ్డి చొరవ తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పక్షాలతో అఖిలపక్షం ఏర్పాటుకు చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం నాయకులు నారాయణరెడ్డి, వైఎ్‌సఆర్‌ రైతుసంఘం నాయకుడు ఎస్‌.ప్రసాద్‌రెడ్డి, ఆర్‌సీపీ నాయకుడు రవిశంకర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, బీసీ మహాసభ జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లికార్జున, రైతు ప్రజా సంఘాల నాయకులు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, దస్తగిరిరెడ్డి, కేసీ బాదుల్లా, మద్దిలేటి, జేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-20T11:06:23+05:30 IST