ధాన్యం రవాణాలో జాప్యం జరుగొద్దు

ABN , First Publish Date - 2021-05-11T04:27:40+05:30 IST

ధాన్యం రవాణాలో జాప్యం జరుగ కుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

ధాన్యం రవాణాలో  జాప్యం జరుగొద్దు
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

ఎక్కువ వాహనాలను రవాణాకు వాడుకోండి

మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్‌లోడ్‌ చేయాలి

పంట నమోదు చేసుకోలేదని ధాన్యం కొనకుంటే చర్యలు

కరోనా నివారణలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్ల సేవలకు చేతులెత్తి మొక్కాలి

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 


వనపర్తి అర్బన్‌/గద్వాల/నాగర్‌కర్నూల్‌(ఆంధ్రజ్యోతి), భూత్పూర్‌ మే 10: ధాన్యం రవాణాలో జాప్యం జరుగ కుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మిల్లుల వద్ద లారీలను ఆపకుండా వెంటనే దించుకొని పంపివాలని అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి సోమవారం జూమ్‌ యాప్‌ ద్వారా సమీక్ష చేశారు. ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డి, వీఎం అబ్రహాం, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మాధవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్లు శృతిఓఝా, వెంకట్రావు, శర్మన్‌, డీఎంఅండ్‌హెచ్‌వోలు శ్రీనివాసులు, చందునాయక్‌, సుధాకర్‌లాల్‌ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా మిల్లుల్లో స్థల సమస్య ఉంటే పక్క మిల్లుకు, పక్కన ఉన్న గోదాంలకు ధాన్యం పంపించాలన్నారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్నచిన్న తప్పిదాలతో వారికి నష్టం కలిగించి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దన్నారు. పంట నమోదు చేసుకోలేదన్న సాకుతో ధాన్యం తిరస్కరించొద్దని సూచించారు. అలా చేస్తే శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. కొన్ని జిల్లాల నుంచి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తోందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు. హమాలీల సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ ఫిర్యాదులపై కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 31లోపు పంటల కోతలు పూర్తయ్యేలా చూసుకుంటే పంట నష్టాలు ఉండవన్నారు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో రైతులను ఆ దిశగా చైతన్యం చేయాలన్నారు. ప్రకృతి విపత్తులైన గాలివానల వల్ల జరిగే నష్టాలను మనం నివారించలేమన్నారు. 


వైద్య సిబ్బంది కృషి అమోఘం

కరోనా మహమ్మారి నివారణకు వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అమోఘమని, కరోనా లక్షణాలుంటే చికిత్స మొదలు పెట్టాలని జిల్లాల వైద్యాధికారులకు మంత్రి సూచించారు. కరోనా నివారణకు అవసరమైన సదుపాయాల కల్పన, వచ్చే నెలలో అవసరమైన కిట్ల వివరాలు సమర్పించాలన్నారు. వేసవి నేపథ్యంలో వడదెబ్బ కేసులు కూడా వస్తాయని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి జ్వరం సర్వేలు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే సందర్భంగా వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు ఆశిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. కరోనా కేసులు హైదరాబాద్‌ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే మెరుగైన చికిత్స అందేలా చూడడాలన్నారు. నాలుగు రోజుల నుంచి కేసులు తగ్గుతున్నాయని మంత్రికి కలెక్టర్లు సూచించారు. మరొక రెండు మాసాలు అందరం కలిసికట్టుగా కృషి చేసి, దీనిని దైవకార్యంగా భావించి మనందరం ప్రజలను ఈ విపత్తు నుంచి బయటపడేద్దామని మంత్రి తెలిపారు. అయిన వారే దూరం పెడుతున్న ఈ పరిస్థితుల్లో కరోనా విపత్తులో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్ల చేస్తున్న సేవలకు చేతులెత్తి మొక్కాలన్నారు.

Updated Date - 2021-05-11T04:27:40+05:30 IST