యాసంగిలో వరి సాగు వద్దు

ABN , First Publish Date - 2021-12-08T05:13:13+05:30 IST

యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని, కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ఎఫ్‌సీఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిందని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు.

యాసంగిలో వరి సాగు వద్దు
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంటలో రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు

వర్గల్‌, డిసెంబరు 7 : యాసంగిలో రైతులు వరిసాగు చేయవద్దని, కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ఎఫ్‌సీఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిందని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. మంగళవారం వర్గల్‌లోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్వాహకులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవన్నారు. రైతులు వరిసాగును వదిలిపెట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్యాబ్‌ ఎంట్రీ, ట్రక్‌ షిట్‌ జనరేట్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఏవో సకలేష్‌, ఏఈవో సంతోష్‌, పీఏసీఎస్‌ సీఈవో జితేందర్‌రెడ్డి, రైతులు ఉన్నారు.

ఆరుతడి పంటలే మేలు : మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

నర్సాపూర్‌, డిసెంబరు 7: యాసంగిలో ఆరుతడి పంటలే రైతులకు ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పెద్దచింతకుంటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హరీశ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే యాసంగిలో ఎఫ్‌సీఐ వరి ధాన్యం తీసుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు ఉండదన్నారు. అందువల్ల రైతులు పంటమార్పిడి ద్వారా ఇతర పంటలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటల వల్లరైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. మంచి డిమాండు ఉన్న ఆరుతడి పంటల వల్ల రైతులకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా వేరుశనగ, కుసుమ, నువ్వులు, ఆముదం వంటి పంటలను రైతులు వేసుకోవాలన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే తాము పంటల మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రమేష్‌, జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం, ఏడీఏ సురేఖ, సర్పంచ్‌ శివకుమార్‌,  ఎవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:13:13+05:30 IST