గీత దాటొద్దు

ABN , First Publish Date - 2022-05-01T08:31:14+05:30 IST

‘‘శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల పరిధి, అధికారాలు, బాధ్యతలను రాజ్యాంగం స్పష్టంగా విభజించింది.

గీత దాటొద్దు

కర్తవ్య నిర్వహణలో పరిమితులను గుర్తించాలి 


సీఎస్‌ సోమేశ్‌పై చీఫ్‌ జస్టిస్‌ రమణ ఆగ్రహం

సీఎం, చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయాలనూ అమలు చేయరా?

మేమేమీ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదు కదా!

కోర్టుల్లో దయనీయ పరిస్థితులు: జస్టిస్‌ రమణ

తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

కోర్టు తీర్పులను ప్రభుత్వాలు అమలు చేయట్లేదు 

ఆలోచించి చట్టాలు చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవు 

పాలనలో అసమర్థత వల్లే కేసులు పెరిగిపోతున్నాయి 

పెరిగిన ధిక్కార వ్యాజ్యాలతో అదనపు భారం 

‘వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలు’గా మారిన పిల్‌లు 

జిల్లా కోర్టుల్లో 4.11 కోట్ల కేసులు పెండింగ్‌ 

ప్రతి 10 లక్షల జనాభాకు న్యాయమూర్తులు 20 మందే 

సీఎంలు, హైకోర్టు సీజేల సమావేశంలో జస్టిస్‌ రమణ

కోర్టుల్లో ప్రాంతీయ భాష వాడాలి

అప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం: మోదీ

ఒక్కరోజులో సాధ్యం కాదు 

స్థానిక భాష వినియోగానికి అవరోధాలు: సీజేఐ

న్యాయ ‘ఇన్‌ఫ్రా’ సంస్థ రాష్ట్ర స్థాయిలోనే: రిజిజు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘‘శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల పరిధి, అధికారాలు, బాధ్యతలను రాజ్యాంగం స్పష్టంగా విభజించింది. ఈ మూడింటి మధ్య సామరస్యమైన పనితీరు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణరేఖను కూడా గుర్తుంచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆయా శాఖలు విధి నిర్వహణలో పరిమితులను తెలుసుకోవాలని, లక్ష్మణ రేఖను దాటకూడదని సూచించారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన ప్రసంగించారు. చట్టసభల పరిధిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోబోదని, అయితే చట్టాలు చేసేటప్పుడు సరైన వివేచన ఉపయోగించాలన్నారు.

గతంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా ఇదే విషయం స్పష్టం చేశారన్నారు. కోర్టు తీర్పుల తర్వాత కూడా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కాదన్నారు. విధాన నిర్ణయాలు చేయడం తమ పని కాదని, కానీ ప్రజలు వచ్చి తమ సమస్యలను విన్నవించుకుంటే కోర్టులు కాదనలేవని జస్టిస్‌ రమణ చెప్పారు. న్యాయపరమైన, చట్టపరమైన పరిశీలన లేకుండా చట్టాలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, చట్టసభలు ముందుచూపుతో చట్టాలు చేస్తే వివాదాలు తగ్గిపోతాయన్నారు. బిల్లులపై ప్రజల అభిప్రాయాలను తీసుకుని క్లాజ్‌ ప్రకారం క్షుణ్నంగా చర్చించిన తర్వాతే చట్టాలు చేయాలని ఆయన సూచించారు. తనకు ప్రజా ప్రతినిధులన్నా, చట్టసభలన్నా ఎంతో గౌరవం ఉన్నదన్నారు. వార్డు సభ్యుడి నుంచి పార్లమెంట్‌ సభ్యుడి వరకూ ప్రజాస్వామ్యంలో వారి పాత్ర ఎంతో ఉన్నదన్నారు.

తాను కేవలం కొన్ని లోపాలు మాత్రమే చెబుతున్నానన్నారు. న్యాయవ్యవస్థ ఎప్పుడూ పాలనకు అడ్డంకిగా పరిణమించదని, అయితే ఆ పాలన న్యాయబద్ధంగా ఉండాలని చెప్పారు. చట్టసభ తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోకపోవడం, ప్రభుత్వంలోని వివిధ విభాగాలు సరిగా పనిచేయకపోవడం వల్లే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. కోర్టుల్లో కేసుల పెండింగ్‌కు కేవలం న్యాయవ్యవస్థే కారణం కాదన్నారు. ప్రభుత్వాలను అతిపెద్ద ప్రతివాదులుగా జస్టిస్‌ రమణ అభివర్ణించారు. ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 50శాతం కేసుల్లో ప్రభుత్వాలే అతిపెద్ద లిటిగెంట్లుగా ఉన్నాయన్నది అంగీకరించాల్సిన వాస్తవమన్నారు. కోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, పరిష్కరించాల్సిన కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయ న్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల దుర్వినియోగంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అవి ‘వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలు’గా మారాయన్నారు. వ్యక్తిగత వివాదాల పరిష్కారం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారన్నారు.  


పెండింగ్‌ కేసుల్లో 66శాతం ఇలాంటివే 

ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్నంత విస్తృత స్థాయిలో సమస్యలను ప్రపంచంలో ఎక్కడా ఎదుర్కోవడం లేదని జస్టిస్‌ రమణ చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే న్యాయస్థానాలకు పని ఉండదని, కేసులు పెద్దఎత్తున పెరిగిపోయే అవకాశం లేదన్నారు. ఒక తహశీల్దార్‌ భూసర్వే విషయం కానీ, రేషన్‌కార్డు విషయం కానీ, రైతు సమస్యను కానీ పట్టించుకున్నా, ఒక మున్సిపల్‌ అధికారులు, గ్రామపంచాయతీలు తమ విధులు సరిగా నిర్వహించినా, రెవెన్యూ అధికారులు చట్టప్రకారం భూమిని సేకరించినా, ప్రజలు కోర్టు తలుపు తట్టే అవకాశమే లేదన్నారు.

పెండింగ్‌ కేసుల్లో ఇలాంటివే 66శాతం ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో వివిధ విభాగాల మఽధ్య తగాదాలు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య వివాదాలు కూడా కోర్టులకు ఎందుకు ఎక్కుతున్నాయో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీనియారిటీ, పింఛను తదితర అంశాల్లో సర్వీసు చట్టాలను సరిగ్గా అమలు చేస్తే ఏ ఉద్యోగి కోర్టులకు వెళ్లడని, 50శాతం పెండింగ్‌ కేసులు ఇవే ఉన్నాయన్నారు. పోలీసు దర్యాప్తులు సవ్యంగా సాగితే, అక్రమ అరెస్టులు, కస్టడీలో హింసలు అంతమైతే ఏ బాధితుడూ కోర్టును ఆశ్రయించబోడన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడటమే సుపరిపాలనలో ప్రధానాంశమని, కానీ న్యాయ విభాగాలను సంప్రదించకుండానే తరచూ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆయ న విమర్శించారు.

ప్రత్యేక ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్‌ కౌన్సిళ్లు లేకపోవడం కూడా పెండింగ్‌ కేసులకు కారణమని చెప్పారు. కోర్టుల తీర్పులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు అమలు చేయ డం లేదని, దీనివల్ల ధిక్కార వ్యాజ్యాలు పెరిగిపోయి కోర్టులపై అదనపు భారం పడుతోందని సీజేఐ అన్నారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు.   


ఖాళీల భర్తీకి సహకరించాలి 

న్యాయవ్యవస్థలో ఖాళీలు పెరిగిపోతున్నాయని, బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఈ విషయంపై అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారని జస్టిస్‌ రమణ చెప్పారు. హైకోర్టుల్లో 1,104 పోస్టులు మం జూరు కాగా, 388 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. జిల్లాల్లో కూడా ఖాళీలు భర్తీచేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తులకు సీఎంలు సహకరించాలని కోరారు. జిల్లా కోర్టుల్లో 4కోట్ల 11లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 20 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారన్నారు. 


కోర్టుల్లో మౌలిక సదుపాయాలేవీ?  

న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలకు, ప్రజల న్యాయపరమైన అవసరాలకు ఎంతో అగాధం ఉందని జస్టిస్‌ రమణ అన్నారు. కొన్ని జిల్లా కోర్టుల్లో మహిళా న్యాయవాదులు ప్రవేశించేందుకే సందేహించే పరిస్థితులు ఉన్నాయని, ఇక మహిళా కక్షిదారులు కోర్టుల్లోకి ఎలా రాగలరని ఆయన ప్రశ్నించారు. న్యాయ దేవాలయాలైన కోర్టుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్నారు. అందుకే జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో మౌలిక సదుపాయాల అథారిటీల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరిస్తున్నానని చెప్పారు. ఈ వ్యవస్థల్లో అందరు కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులకు భాగస్వామ్యం ఉంటుందని, ప్రభుత్వ అధికారాలను ఎవరూ స్వాఽధీనం చేసుకోబోరని హామీ ఇచ్చారు. 


సీఎం, చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయాలనూ అమలు చేయరా!?

సోమేశ్‌పై జస్టిస్‌ రమణ ఆగ్రహం

చర్యలు తీసుకుంటానన్న ఇంద్రకరణ్‌ 

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తీరుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తు న్నప్పుడు తెలంగాణ అంశాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రస్తావించారు. సీఎం, చీఫ్‌ జస్టిస్‌ తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయకుండా సీఎస్‌ పెం డింగ్‌లో పెడుతున్నారని తప్పుబట్టారు. కోర్టుల్లో ద యనీయ పరిస్థితులు ఉన్నాయని, వ్యక్తిగత పనుల కోసం సదుపాయాలు అడగడం లేదని ఆక్షేపించా రు.

న్యాయ వ్యవస్థ బలోపేతానికే అడుగుతున్నామన్నారు. జోక్యం చేసుకున్న తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. తాను పరిశీలించి నిర్ణయాలు అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి మౌలిక సదుపాయాల సంస్థ లో ప్రధాన కార్యదర్శికి కూడా భాగస్వామ్యం కల్పించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించగా.. సీఎ్‌సల తీరు ఎలా ఉందో చూస్తున్నారుగా అంటూ తెలంగాణ సీఎ్‌సను ఉదహరించారు.

Updated Date - 2022-05-01T08:31:14+05:30 IST