సరిహద్దు దాటొద్దు

ABN , First Publish Date - 2020-03-29T10:28:01+05:30 IST

జిల్లా సరిహద్దులోని కర్నూలు జిల్లాలోని రైల్వే గ్యాంగ్‌మెన్‌ (23) అనే యువకుడికి కరోనా పాజిటివ్‌

సరిహద్దు దాటొద్దు

కర్నూలు జిల్లాలో రాజస్థాన్‌ రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌

అధికారికంగా ప్రకటించిన యంత్రాంగం    

జిల్లా సరిహద్దుల్లో కలకలం

బఫర్‌జోన్‌ పరిధిలో ఆరు గ్రామాలు     

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

ఆ గ్రామాల నుంచి ఒక్కరు బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు

ప్రజలకు అవసరమైన సరుకులు ప్రభుత్వమే సరఫరాకు చర్యలు

కంట్రోల్‌ రూంగా పెద్దముడియం పోలీసుస్టేషన్‌ 

కంట్రోల్‌ రూం ఫోన్‌ నెంబరు 08560- 277733


కడప, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా సరిహద్దులోని కర్నూలు జిల్లాలోని రైల్వే గ్యాంగ్‌మెన్‌ (23) అనే యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా సరిహద్దులో కలకలం రేగింది. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ గ్రామం చుట్టూ 7- 8 కి.మీల పరిధిని బఫర్‌ జోన్‌గా గుర్తించారు. ఆ జోన్‌ పరిధిలో మన జిల్లాకు చెందిన ఆరు గ్రామాలు ఉన్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆ గ్రామస్తులను ఒక్కరిని కూడా బయటికి అనుమతించరు. ఏ అవసరం వచ్చినా అధికారులకు చెబితే వారే సమకూరుస్తారు. అంతే కాదు.. ఈనెల 19న కర్నూలు-ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్సులో కరోనా బాధితులతో పాటు ప్రయాణించిన జిల్లావాసులను గుర్తించి క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు.


రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు కర్నూలు జిల్లా ఓ గ్రామంలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనతో పాటు గ్యాంగ్‌మెన్‌లో 22 మంది వరకు ఉన్నారు. ఆ యువకుడితో పాటు మరో ముగ్గురు అదే గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన రాజస్తాన్‌ వెళ్లిన ఆ యువకుడు 19వ తేదీ ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. తీవ్ర జ్వరం, నొప్పులు రావడంతో స్థానిక ఓ ప్రైవేటు వైద్యుడికి చూపించారు. ఈనెల 24వ తేదీ 108 వాహనంలో కర్నూలు సరోజిని వైద్యశాలకు చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆ యువకుడి నుంచి శాంపిల్స్‌ సేకరించి అనంతపురం, తిరుపతి ల్యాబ్‌లకు పంపగా.. కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ శనివారం ప్రకటించారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

 

బఫర్‌జోన్‌ పరిధిలో 6 గ్రామాలు : కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన ఆ గ్రామం మూడు కి.మీ చుట్టూ ఉన్న గ్రామాలను కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు డిటెక్షన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కోవిడ్‌-19 కంట్రోల్‌మెంట్‌ జోన్‌, 7 కిలోమీటర్ల చుట్టూ కోవిడ్‌-19 బఫర్‌జోన్‌గా ప్రకటించారు. ఈ రెండు జోన్ల పరిధిలో జిల్లాకు చెందిన పెద్దముడియం మండలం బీమగుండం, భూతమాపురం, గుండ్లకుంట, పాలూరు, నాగరాజుపల్లె, కొండపాపాయపల్లె గ్రామాలు బఫర్‌జోన్‌ గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ గ్రామాలకు రాకపోకలు బంద్‌ చేశారు.


ఆ గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లరాదు.. ఇతర గ్రామాల ప్రజలు ఆ గ్రామాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో నుంచి ఒక్కరిని కూడా బయటికి రానీయడం లేదు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రజ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పెద్దముడియం మండల వైద్యాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని కలెక్టరు హరికిరణ్‌ సూచించారు. అప్రమత్తం, సామాజిక దూరం ద్వారానే ఈ వ్యాధి జిల్లాలో వ్యాప్తి కాకుండా నిరోధించగలమని ఆయన సూచించారు. 


కంట్రోల్‌ రూము - చెక్‌పోస్టు ఏర్పాటు

కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో బఫర్‌ జోన్‌ గ్రామాల పరిధిలో రెవెన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఏమైనా అవసరం అయితే ఆ చెక్‌పోస్టులో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది దృష్టికి తీసుకెళితే వెంటనే పరిష్కరిస్తారు. అదే క్రమంలో పెద్దముడియం పోలీసుస్టేషన్‌ను కంట్రోల్‌ రూంగా మార్చారు. 08560-277733 నెంబరుకు కాల్‌ చేస్తే తక్షణమే స్పందిస్తారని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. 


ఆ బస్సులో ప్రయాణించిన వారెందరో..

కరోనా పాజిటివ్‌ బాధితుడు ఈనెల 5వ తేదీ స్వరాష్ట్రం రాజస్థాన్‌కు వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఆగ్రా తదితర ప్రాంతాలను సందర్శించాడు. 17వ తేదీ రాజస్తాన్‌లోని ఆగ్రా కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-2 బోగిలో సీటు నెం.22లో ప్రయాణించి 18వ తేదీ ఉదయం హైదరాబాదుకు చేరుకున్నాడు. హైదరాబాదు నుంచి రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరాడు. ఎస్‌-5 బోగిలో ప్రయాణం చేశాడు. అర్ధరాత్రి కర్నూలు రైల్వేస్టేషన్‌ చేరుకున్నాడు. 19వ తేదీ ఉదయం 4 గంటలకు కర్నూలు-ప్రొద్దుటూరు వయా బనగానపల్లె, జమ్మలమడుగు ఆర్టీసీ బస్సులో బయలుదేరి ఆ గ్రామంలో దిగిపోయాడు.


అదే బస్సులో కర్నూలు జిల్లాకు చెందిన పలు గ్రామాల ప్రయాణికులు, కడప జిల్లాకు చెందిన గుండ్లకుంట, ఉప్పలపాడు, ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ యువకుడితో కలిసి ప్రయాణించిన దాదాపు 21 మందిని గుర్తించి ప్రొద్దుటూరు, కడప రిమ్స్‌ క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచారు. రిజర్వేషన్‌ బస్సు కాకపోవడంతో ఎవరెవరు ప్రయాణించారో గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. 19వ తేదీ ఉదయం 4 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరిన కర్నూలు-ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్సులో ఎవరైనా ప్రయాణించి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. ఆయా గ్రామాల్లో దండోరా వేయిస్తున్నట్లు తెలిపారు. 


పకడ్బందీ చర్యలు 

కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన ఆ గ్రామానికి చుట్టూరా ఉన్న బఫర్‌జోన్‌ పరిధిలోని జిల్లాకు చెందిన ఆరు గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా గ్రామస్తులను బయటికి రాకుండా ఏర్పాట్లు చేశాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి. పాజిటివ్‌ బాధితుడితో కలిసి ప్రయాణం చేసిన 21 మంది ప్రయాణికులను గుర్తించి ముందు జాగ్రత్తగా ప్రొద్దుటూరు, కడప రిమ్స్‌ క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు తరలించాం. వారి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్ష కోసం తిరుపతికి పంపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎంతో కీలకమైనది. మరొకరికి ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదు. 19వ తేదీ కర్నూలు నుంచి 4 గంటలకు ఆ యువకుడు ప్రయాణించిన ఆర్టీసీ బస్సులో ఎవరైనా ప్రయాణించి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు చెప్పాలని, దాస్తే అందరూ నష్టపోయే పరిస్థితి ఉందని సూచించారు.

- సి.హరికిరణ్‌, కలెక్టర్‌


ఇల్లు దాటనివ్వం  

బఫర్‌ జోన్‌ పరిధిలో ఉన్న ఆరు గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. ఏ ఒక్కరినీ కూడా ఇల్లు దాటకుండా చూస్తున్నాం. గ్రామానికి అన్ని రహదారులు మూసివేశాం. గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లరాదు. ఇతరులు ఆ గ్రామానికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాం, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో చెక్‌పోస్టు, కంట్రోలు రూం ఏర్పాటు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రావద్దు. హద్దుల్లో ఉంటే ఆరోగ్యానికి మంచిది. నిత్యావసర సరుకులు, కూరగాయలు అవసరమైతే ఆ గ్రామాలకు మేమే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ 

Updated Date - 2020-03-29T10:28:01+05:30 IST