భవన నిర్మాణాల నాణ్యతలో రాజీ పడొద్దు

ABN , First Publish Date - 2021-06-18T05:26:35+05:30 IST

ప్రభుత్వ భవన నిర్మాణాల నాణ్యతలో రాజీపడొద్దని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు.

భవన నిర్మాణాల నాణ్యతలో రాజీ పడొద్దు
అరకులోయలో కొవిడ్‌ బాధితులను పరామర్శించి వస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, అధికారులు


 ఐటీడీఏ పీవో ఆర్‌ గోపాలకృష్ణ

డుంబ్రిగుడ, జూన్‌ 17: ప్రభుత్వ భవన నిర్మాణాల నాణ్యతలో రాజీపడొద్దని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. గురువారం ఆయన మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కించుమండలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతుభరోసా భవన నిర్మాణ పనులపై ఆరా తీశారు. నిధులు మంజూరైనా పనులెందుకు పూర్తికాలేదని అధికారులను ప్రశ్నించారు. స్థల వివాదం ఉంటే పరిష్కరించి, ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం డుంబ్రిగుడలో రూ.12కోట్లతో నిర్మిస్తున్న ఏకలయ్య మోడల్‌ గురుకుల పాఠశాల భవన నిర్మాణాన్ని పరిశీలించి సిమెంట్‌ పాళ్లపై ఆరా తీశారు. సిమెంట్‌ సరఫరాలో జాప్యం జరుగుతుందని అధికారులు పీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని పీవో గోపాలకృష్ణ చెప్పారు.  

కొవిడ్‌ బాధితులను పరామర్శించిన  పీవో  

అరకులోయ: వైటీసీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా సౌకర్యాలు, అందుతున్న వైద్య సేవలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. మందులు వాడుతూ.. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లాడుతూ.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. తర్వాత రణజిల్లడ గ్రామ పరిధిలో అరటి తోటను ఐటీడీఏ ప్రాజెక్టు హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌తో కలిసి పరిశీలించారు. యువ రైతు లకే భార్గవతో ముచ్చటించారు. ఉద్యాన తోటలను కంటికి రెప్పలా కాపాడితే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఉన్న భూమిలో స్ర్టాబెర్రీ, డ్రాగన్‌ ప్రూట్‌, తేనెటీగల పెంపకం చేపట్టాలని సూచించారు. జైపూర్‌ జంక్షన్‌ వద్ద నిర్మిస్తున్న కిల్లోగుడ బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో టీడబ్ల్యూ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీడీ విజయ్‌కుమార్‌, పీహెచ్‌ఓ .ప్రభాకర్‌రావు, పీఆర్‌ డీఈఈ కొండయ్యపడాల్‌, టీడబ్ల్యూ డీఈఈ వంశీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:26:35+05:30 IST