సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే గ్రామానికి రావద్దు!

ABN , First Publish Date - 2022-08-07T06:35:49+05:30 IST

సమస్యలు పరిష్కరించని నాయకుడు తమ గ్రామానికి అవసరం లేదని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ను మూకుమ్మడిగా ప్రజలు అడ్డుకున్న ఘటన మండలంలోని పెరుగుపల్లిలో శనివారం చోటుచేసుకుంది.

సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే గ్రామానికి రావద్దు!
మహిళలతో వాగ్వివాదం చేస్తున్న ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి

వెలిగండ్ల మండలంలో బుర్రాకు పరాభవం

మూకుమ్మడిగా తిరగబడిన పెరుగుపల్లి ప్రజలు 

బిత్తరపోయి వెనుదిరిగిన మధుసూదన్‌ యాదవ్‌

మహిళలపై ఎస్‌ఐ విశ్వనాఽథరెడ్డి వీరంగం  

వెలిగండ్ల, ఆగస్టు 6 : సమస్యలు పరిష్కరించని నాయకుడు తమ గ్రామానికి అవసరం లేదని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ను మూకుమ్మడిగా ప్రజలు అడ్డుకున్న ఘటన మండలంలోని పెరుగుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ప్రజలు తిరుగుబాటును తట్టుకోలేని ఎమ్మెల్యే బిత్తరపోయి పరాభవంతో వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం గత వారం నుంచి ఎమ్మెల్యే బుర్రా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం మొదలు నుంచి ఆయా మండల నాయకులు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు వ్యతిరేకిస్తూ  డుమ్మా కొడుతున్నారు. ఇటీవల వెన్నావారిపల్లి, తమ్మినేనివారిపల్లి, గుడిపాటిపల్లి, లక్ష్మక్కపల్లి, గోపసంద్రం గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు నాయకులందరూ హ్యాండిచ్చారు. దీంతో చేసేది లేక ఆయన కార్యక్రమాన్ని మమ అనిపించారు. తాజాగా పెరుగుపల్లికి చెందిన 15ఎకరాల పశువుల బీడును కొంతమంది అన్యాక్రాంతం చేశారు. అదేవిధంగా సర్పంచ్‌ మంజుభార్గవిని అవమానపరిచేలా సమాచారం ఇవ్వకుండా హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమం నిర్వహించిన తీరుపై గ్రామస్థులు ఎమ్మెల్యేని నిలదీసి కడిగిపారేశారు. ఎన్నికలకు ముందు పశువుల బీడును తిరిగి గ్రామానికి అప్పగిస్తానని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  పట్టించుకోలేదని ప్రశ్నించారు. పశువుల బీడును గ్రామానికి అప్పగించేంత వరకు మా గ్రామంలోకి రావద్దంటూ అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ పాపారావు కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి ఎస్‌ఐలతోపాటు వెలిగండ్ల ఎస్‌ఐ, పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటికీ గ్రామస్థులు వెనుకడుగు వేయకపోవటంతో ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని ఆపేసి వెనుదిరిగారు.


మహిళలపై వెలిగండ్ల ఎస్‌ఐ వీరంగం 

ఎమ్మెల్యేని అడ్డుకున్న మహిళలపై వెలిగండ్ల ఎస్‌ఐ వీరంగం సృష్టిం చారు. ఎమ్మెల్యే వెళ్లిపోయాక వాగ్వివాదానికి దిగారు. మహిళలు కాబట్టి వదిలేశాను.. లేకపోతే వేరుగా ఉండేదని బెదిరింపు ధోరణితో హెచ్చరించారు. ఎస్‌ఐ వైఖరిపై మహిళలు ఆందోళన చెందారు. ఎమ్మెల్యేనే కావాలని పోలీసులను మహిళలపైకి ఉసిగొల్పాడని ఆరోపించారు.


గెలిపిస్తే పురుగుల్లా చూస్తారా.. 

హెచ్‌ఎంపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణ

ఎమ్మెల్యే తమ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో బ్రహ్మరథం పట్టి ఎన్నికల్లో గెలిపించుకున్నామని, కరోనా సమయంలో ఎమ్మెల్యేకి మంచిపేరు రావాలని లక్షలు ఖర్చు చేశానని  పెరుగుపల్లి సర్పంచ్‌ మంజుభార్గవి భర్త, హెచ్‌ఎంపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణ వాపోయాడు. ఇప్పుడు తనను పురుగుల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-07T06:35:49+05:30 IST