కాంగ్రెస్‌లో వర్గపోరు

ABN , First Publish Date - 2022-01-19T05:16:29+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న ఏకైక జిల్లా ఉమ్మడి నల్లగొండనే. వచ్చే ఎన్నిక ల్లో ఆ పార్టీకి అధికస్థా నాలు దక్కే అవకాశం జిల్లాలోనే అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది.

కాంగ్రెస్‌లో వర్గపోరు

రేవంత్‌కు జిల్లా సీనియర్ల సహాయ నిరాకరణ

పలు నియోజకవర్గాల్లో నత్తనడకన సభ్యత్వ నమోదు

ఆధిపత్యానికే  పెద్దల ప్రాధాన్యం



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న ఏకైక జిల్లా ఉమ్మడి నల్లగొండనే. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అధికస్థానాలు దక్కే అవకాశం జిల్లాలోనే అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాకు చెందిన నేతలు పీసీసీ, ఆపైస్థాయి పదవుల్లో పనిచేసిన వారు కావడంతో పీసీసీ పీఠం విషయంలో రేవంత్‌రెడ్డితో విభేదాలు పలుమార్లు రచ్చకెక్కాయి. 


పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో జిల్లా నేతలకు ఉన్న విభేదాలు కిందిస్థాయి లో ప్రభావం చూపుతున్నాయి. నియోజకవర్గాలు తమ కనుసన్నల్లోనే ఉండాలని బడా నేతలు భావిస్తుండటంతో రేవంత్‌ కీలకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పలు నియోజకవర్గాల్లో సభ్యత్వం ఎక్కడ తీసుకోవాలో తెలియక కాంగ్రెస్‌ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. తమకు సభ్యత్వ నమోదు లింక్‌లుఇవ్వడంలేదని నియోజకవర్గ స్థాయి నేతలు రేవంత్‌కు ఫిర్యాదు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. పీసీసీ నియమించిన ఇన్‌చార్జీలకు సహకారం లేక ఇళ్లకే పరిమితమయ్యారు.


రేవంత్‌కు సహాయ నిరాకరణ

రాష్ట్రంలో 30లక్షల సభ్యత్వం నమోదు చేయాలనేది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లక్ష్యం. ఇది పూర్తయితే ఆయనకు ఢిల్లీలో పూర్తిస్థాయిలో పట్టు లభించినట్లే. ఆన్‌లైన్‌లో సభ్యత్వం నమోదు చేసుకోవాల్సి ఉండగా, అందుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించారు. నవంబరు మొదటి వారం నుంచే సభ్యత్వ నమోదు  కొనసాగుతుండగా, ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో కార్యాచరణ ఊపందుకోలేదు. ఈనెల 26తో సభ్యత్వ నమోదు గడువు ముగియనుంది. ప్రతీ పోలింగ్‌ బూత్‌కు 100 మంది చొప్పున 30వేలమందికి ఆన్‌లైన్‌లో కాంగ్రెస్‌ పార్టీసభ్యత్వం నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను బడా నేతలు బాధ్యతగా తీసుకోకపోగా, మరొకరికి అవకాశం కూడా ఇవ్వడం లేదు.


ఆధిపత్యానికే పెద్దల ప్రాధాన్యం

మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల్లో సీనియర్‌ నేత జానారెడ్డిదే ఆధిపత్యం. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన భాస్కర్‌రావు ఆ తరువాత టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ కాంగ్రె్‌సకు సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త బీఎల్‌ఆర్‌(బత్తుల లక్ష్మారెడ్డి) కాంగ్రెస్‌లో చేరి పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రారంభించారు. ఈనియోజకవర్గంపై ఆశలుపెట్టుకున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ స్థానికంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే జానా తనయుడు రఘువీర్‌ మిర్యాలగూడ నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు బీఎల్‌ఆర్‌ చేతికి అందకుండా జిల్లా పెద్దలు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 17న మిర్యాలగూడలో సమావేశం ఏర్పాటు చేయగా, ఆధిపత్య పోరు వెలుగుచూసింది. బీఎల్‌ఆర్‌ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుచేసి సభ్యత్వ నమోదు లింక్‌ను అందుబాటులోకి తెచ్చుకుని నమోదు ప్రక్రియను ప్రారంభించారు.


కోమటిరెడ్డి బ్రదర్స్‌ నియోజకవర్గాల్లో సహకారం కరువు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రె్‌సలో ఉంటా రా? లేదా? అనే అనుమానం ఉంది. నియోజకవర్గంతోపాటు, పార్టీ సం స్థాగత కార్యక్రమాలకు కొంతకాలంగా ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో అక్కడ సభ్యత్వ నమోదుకు ఆయన ఆసక్తి చూపకపోగా, పీసీసీ నుంచి వచ్చిన వారికి అక్కడ ప్రోత్సహం కరువైంది. నకిరేకల్‌ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఈ నియోజకవర్గం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కనుసన్నల్లో ఉంది. ఆయన అనుచరుడు, ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడంతో ఇక్కడ పార్టీకి నాయకత్వం కరువైంది. ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, అక్కడ సభ్యత్వ నమోదుకు ప్రయత్నించినా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులైన పార్టీ మండల అధ్యక్షులు సహకరించే పరిస్థితి లేదు. దీంతో కొండేటి మల్లయ్య పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా, నమోదు లింక్‌ను ఆయనకు ఇస్తూ పీసీసీ అధ్యక్షుడు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ అ సెంబ్లీ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుప్పిట్లోనే ఉంది. సభ్యత్వ నమోదుపై నియోజకవర్గంలో వెంకట్‌రెడ్డి ఇప్పటి వరకు మండల అధ్యక్షులు, కీలక నేతలతో సమావేశమే నిర్వహించలేదు. ఈ స్థానంపై ఆశ  పెట్టుకున్న దుబ్బాక నర్సింహారెడ్డి, నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వని పరిస్థితి ఉంది. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించినా, వెంకట్‌రెడ్డి అనుచరులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.


తుంగతుర్తి, పేటలో ముఠా రాజకీయాలు

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన అద్దంకి దయాకర్‌ సంస్థాగతంగా, స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సభ్యత్వ నమోదుకు నేటికీ నియోజకవర్గంలో ఆయన సమావేశం ఏర్పాటు చేయలేకపోయారు. సూర్యాపేటలో సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఒకవైపు, మరో కీలక నేత పటేల్‌ రమే్‌షరెడ్డి, డాక్టర్‌ రవి మరోవైపు మొత్తంగా మూడు వర్గాలుగా ఇక్కడ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జీగా పటేల్‌ రమే్‌షరెడ్డిని నియమించగా, అక్కడ స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నుంచి సహకారం లేదు. దీంతో ఆయన సూర్యాపేట నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మొత్తంగా కాంగ్రెస్‌ ఉద్దండులు ఉన్న జిల్లాలో వర్గపోరుతో కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు.



Updated Date - 2022-01-19T05:16:29+05:30 IST